ముస్లిం రాష్ట్రీయ మంచ్ తెలంగాణ శాఖ నిర్వహించ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంచ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సత్తార్, ఉప కన్వీనర్ ఫైజుల్లాలతో పాటు జాతీయ కన్వీనర్ విరాగ్ పాచ్ పోరేలను నిర్బంధించిన పోలీసులు తమ చర్యలకు కారణాలను మాత్రం వివరించలేదు. బేగంపేటలోని లక్ష్మిభవనంలో జనవరి 27న ముస్లిం రాష్ట్రీయ మంచ్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో `దేశంలో వర్తమాన పరిస్థితులు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించ తలపెట్టింది. ఇందులో పాల్గొనడానికి ఎంఆర్ఎం గౌరవ సలహాదారులు శ్రీ ఇంద్రేశ కుమార్, సీనియర్ పాత్రికేయులు శ్రీ విరాగ్ పాచ్ పోరెలు విచ్చేశారు. అయితే కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే అక్కడకు వచ్చిన పోలీసులు మంచ్ రాష్ట్ర నేతలతోపాటు, పాచ్ పోరేను కూడా నిర్బంధించి సమావేశ స్థలం నుంచి తరలించారు. ముందు సమావేశానికి అనుమతి లేదన్న పోలీసులు హాలులో సమావేశాలకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదుకదా అని నిర్వాహకులు ప్రశ్నించడంతో మాట మార్చారు. బయటనుంచి ఎవరో కార్యక్రమానికి ఆటంకం కలిగించడానికి పూనుకుంటున్నారన్న సమాచారం తమకు అందిందని, ముందు జాగ్రత్త కోసం ఇలాంటి చర్య చేపట్టమని అన్నారు. కొద్దిసేపటి తరువాత ఎంఆర్ఎం రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ కన్వీనర్ ను విడిచిపెట్టారు.