Home News ఒకే అక్షం పైనున్న ప్రాచీన అష్ట శివాలయాల రహస్యం ఏమిటి?      

ఒకే అక్షం పైనున్న ప్రాచీన అష్ట శివాలయాల రహస్యం ఏమిటి?      

0
SHARE

 – శ్రీపాద కులకర్ణి

ఇక్కడ మనం ఆశ్చర్యచకితులం కావలసిన విషయం  ఏమంటే – పురాతనకాలంలో మన దేవాలయ శిల్పకళాకారులు, అష్ట ప్రాచీన శివాలయాలు, వాటిమధ్య ఎన్నో వందల కిలో మీటర్ల దూరం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న GPS వంటి ఆధునిక పరిజ్ఞానం, పరికరాలు, సౌకర్యాలు అప్పట్లో లేకపోయినప్పటికీ, ఖచ్చితంగా ఒకే అక్షాంశంలో ఎలా నిర్మించగలిగారా, అని.

నేడు మన భారతీయ దేవాలయాలలో ఉండే అద్భుతమైన వింత – మన ఏకైక కళాసాంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం, వాస్తు నిర్మాణశాస్త్రం, విస్మయం కలిగించే విషయం – ఏమిటన్నది మనవాళ్ళు శోధిస్తున్నారు. ప్రథమంగా, కేదారనాథ్, శ్రీ కాళహస్తి, కంచి(కాంచీపురం) లోని ఏకాంబరేశ్వరాలయం, తిరువణ్ణామలై, తిరువాణైకోవిల్, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, రామేశ్వరం, కాళేశ్వరం – ఈ ప్రధాన ఆలయాలన్నింటిలోనూ సర్వసాధారణంగా ఉండే విషయం మీరు గ్రహించగలరా?

ఒకవేళ మీరు ఇవన్నీ శివాలయాలు అని అంటే, అది పాక్షికంగా సరైనదే, కానీ, మనం ఇప్పుడు ఈ ప్రశ్న వెనుక ఉన్న సరైన, సంపూర్ణమైన వాస్తవం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

వాస్తవమైన, విశేషమైన ఏకైక విషయం ఏమంటే, ఈ అష్ట శివాలయాలు ఒకే సరళరేఖలో, 79° అక్షాంశం పైనే నిర్మించబడ్డాయి.

భౌగోళికశాస్త్రం ప్రకారం, ఈ దేవాలయాల స్థానం ఏమిటో మనం పరిశీలిద్దాం;

కేదారనాథ్:          79.0669°                       శ్రీ కాళహస్తి:        79.7037°

కాంచీపురం:         79.7036°                       తిరువణ్ణామలై:    79.0747°

తిరువాణైకొవిల్:     78.7108°                       చిదంబరం:         79.6954°

రామేశ్వరం:          79.3129°                        కాళేశ్వరం:        79.9067°

  

పైన చెప్పిన అష్ట శివాలయాలు అంటే, కేదారనాథ్ నుండి రామేశ్వరం వరకూ, అన్నీ కూడా, ఒకే సరళరేఖలో ఉండటం విశేషం. ఈ దేవాలయాలన్నీ 4000 సంవత్సరాల పూర్వం నిర్మించబడ్డాయి. కాబట్టి, ఇవన్నీ ఒకే ఖచ్చితమైన సరళరేఖలో, ఆయా స్థానాలలో ఎలా మన శిల్పులు నిర్మించారు, అనేదే తెలియని విశేషం. ఈ ప్రశ్న ఇప్పటికీ విజ్ఞానశాస్త్రం మరియు శాస్త్రజ్ఞుల మేధస్సుకు, పరిశోధనకు అందటం సాధ్యం కావటం లేదు. ఇక్కడ కేదారనాథ్ నుండి రామేశ్వరం 2882 కి.మీ. దూరం ఉన్నది అనేది గమనార్హం.

ఇంకా నిశితంగా పరిశీలిస్తే, ఈ అష్ట శివాలయాలలో ఐదు, పంచ భూతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి, అవేమిటంటే  –

శ్రీ కాళహస్తి        – వాయు లింగం

తిరువాణికా        – జల లింగం (జంబుకేశ్వరం)

తిరువణ్ణామలై     – అగ్నిలింగం

కాంచీపురం        – భూ లింగం (స్వయంభూ)

చిదంబరం         – ఆకాశ లింగం (స్వర్గం), అంబరం అంటే ఆకాశం.

మన సాంస్కృతికవారసత్వం ద్వారా మనం పొందిన ఈ ప్రాచీనజ్ఞానం, విజ్ఞానం, తెలివితేటల పట్ల సదా గర్వపడాలి. పైన చెప్పిన పంచ శివాలయాలే కాక, ఇంకా చాలా శివాలయాలు ఇదే అక్షాంశరేఖపై ఉన్నట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇందులో కొన్ని ఒకే రేఖలో ఉండి, జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి పొందాయి. అందుకే, ప్రాచీన కాలంలో ఈ రేఖను “శివశక్తి రేఖ” అని పిలిచేవారు.

ప్రాచీనకాలం నుండి, ఉజ్జయిని భూమికి నాభిస్థానం(కేంద్రం) గా పరిగణింపబడుతూ ఉండేది. అందుకే ఇక్కడి జ్యోతిర్లింగస్వరూపుడైన శివుడిని మహాకాలుడు అనేవారు. కాల్ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి – ఒకటి యముడు అని, రెండవది సమయం (కాలం) అని. ఆదికాలం నుండి మన ఋషులు, మునులు సమయాన్ని గణించటం కోసం ఉజ్జయినిని ప్రధానకేంద్రంగా భావించి, ఇక్కడి శివరూపాన్ని మహాకాళేశ్వరుడు అని ఉద్బోధించారు.

ప్రపంచంలోని  చాలామంది శాస్త్రజ్ఞులు, ఈరోజు వరకూ కూడా, విశ్వం మొత్తానికీ గ్రీన్ విచ్ సమయరేఖ (GMT Line) కేవలం ఊహారేఖ అనీ, దీనికి కేంద్రం లండన్ కాదనీ, ఉజ్జయిని మాత్రమేననీ విశ్వసిస్తున్నారు. ఆంగ్ల కాలగణనసూచిక (ఇంగ్లిష్ కాలెండర్) ప్రకారం ప్రతిరోజు అర్థరాత్రి 12గంటలకు తేదీ మారుతుంది. దీనికి మూలకారణం ఏమంటే, ఉజ్జయినిలో సమయం ఉదయం 6 గంటలయితే, అదే సమయంలో లండన్ లో అర్థరాత్రి 12 గంటలు సూచిస్తుంది. ఆ సమయంలో ఐరోపా మొత్తం ఉజ్జయినినే అనుసరిస్తుంది, ఇది మన శాస్త్రజ్ఞులు నిరూపించారు కూడా.

ఉజ్జయిని కర్కాటకరేఖపై నెలకొని ఉంది, అందుకే ఉజ్జయినిని భూమికి కేంద్రబిందువుగా భావిస్తున్నారు. మనలను ఆశ్చర్యచకితులను చేసే ఇంకొక అంశం ఏమిటంటే – భారతదేశమంతటా నిండిఉన్న పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల భావన. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నుండి, మిగతా జ్యోతిర్లింగాల క్షేత్రాలకు మధ్యగల  దూరం, 3 సమసంఖ్యల రూపంలో మనకు తెలుస్తుంది. ఇది ఎలాగంటే –

ఉజ్జయిని నుండి సోమనాథ్          – 777+ కి.మీ.                    ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్    – 111+ కి.మీ.

ఉజ్జయిని నుండి భీమశంకర్         – 666+ కి.మీ.                    ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ – 888+ కి.మీ.

ఉజ్జయిని నుండి శ్రీశైల మల్లికార్జున – 888+ కి.మీ.                    ఉజ్జయిని నుండి కేదారనాథ్     – 1111+ కి.మీ.

ఉజ్జయిని నుండి త్రయంబకేశ్వర్    – 555+ కి.మీ.                    ఉజ్జయిని నుండి బైద్యనాథ్     – 1399+ కి.మీ.

ఉజ్జయిని నుండి రామేశ్వరం       – 1999+ కి.మీ

మన ప్రాచీన సనాతనధర్మం ప్రకారం, ‘అవంతిక’ అని కూడా పిలువబడే ఉజ్జయిని, ఖగోళశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం మొదలైనవాటికి కొన్ని వేల సంవత్సరాలు కేంద్రంగా ఉండేది. మన ప్రాచీనకాలం నాటి ప్రముఖ ఖగోళశాస్త్రజ్ఞుల సూచీలోని వారందరూ ఉజ్జయినికి చెందినవారే. మనదేశంలోని ప్రముఖ ఖగోళశాస్త్రజ్ఞులు కృషిచేసిన కర్మభూమి ఉజ్జయినియే. దీనినిబట్టి ఈ ఉజ్జయిని ప్రాంతం ఆకాలంలో జ్యోతిశ్శాస్త్రం, ఖగోళశాస్త్రాలకు ముఖ్యకేంద్రంగా విలసిల్లేదని గట్టిగా చెప్పవచ్చు.

సుమారు 2050 సంవత్సరాల క్రితం సూర్యుడి గురించిన, జ్యోతిశ్శాస్త్రం గురించిన మానవనిర్మిత గణనయంత్రం ఉజ్జయినిలోనే తయారైంది. దీనిని ఇప్పుడు నక్షత్ర గణితశాల లేదా వేధశాల (ఆంగ్లంలో observatory) అని పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా, విశ్వమంతటికీ చెందిన ఖగోళశాస్త్రజ్ఞులు సూర్యుడు మరియు అంతరిక్షం గురించి మరింత తెలుసుకొనేందుకు, పరిశోధన చేసేందుకు ఉజ్జయిని వస్తూనే ఉన్నారు.

ప్రాచీన హిందూ ఖగోళశాస్త్రజ్ఞులు భూమిని ఒక గోళంగా భావించి, చంద్రగ్రహణం నుండి అక్షాంశంను కనుక్కుని, నిర్ణయించే పద్ధతికి సంబంధించిన విజ్ఞానాన్ని, ఆ కాలంలోనే కలిగి ఉండేవారు. ఈ పద్ధతి 4వ శతాబ్దం చివరిలో లేదా 5వ శతాబ్దం మొదట్లో వ్రాయబడ్డ “సూర్య సిద్ధాంత” అనే సంస్కృత పరిశీలనాత్మక గ్రంథంలో వివరించబడింది.

Source: Newsbharati

అనువాదం: సత్యనారాయణ మూర్తి