Home News ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

0
SHARE

నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు.

 నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.

 ముల్లోకసంచారి

నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంతమంది మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను “కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా అభివర్ణించారు.

 ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు ‘యదార్ధవాది లోక విరోధి’. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, మానవ, దానవులకు  సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.

‘నార’ అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ‘ద’ అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు, నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.

జన్మ వృత్తాతం

ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.

 ధర్మ రక్షణలో నారదుడి పాత్ర
 రామాయణ రచనలో

రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో “ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?”  అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.

మహర్షికి మార్గదర్శనం

ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్, యజుర్, సామ, అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలి యుగంలో ప్రజలకు దైవభక్తి, సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.

ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంధస్థం చేయడంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.

అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.

ధ్రువుడు

ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి “నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసులోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.

 చిత్రకేతు

శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో, తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు “నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మానుసారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మ చక్రం నుంచి బయటపడలనుకుంటున్నాను” అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.

భక్త ప్రహ్లాద

భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా, ఇంద్రుడు అతని భార్యని రపదతాడు చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.

 సతీ సావిత్రి

సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది. నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్ధిమంతుడని, అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.

శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం, ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు.పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు, ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.

 ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ, కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని, ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు.  నారదుని “నారద శిక్ష” అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము, దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.

 మొదటి పాత్రికేయుడు నారదుడు

ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.

నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పాత్రికేయులందరికీ మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.

నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం

వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి? ధర్మ మార్గంలో  నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది.

This article was first published in 2020