Home Telugu Articles నరరూప రాబందులు!

నరరూప రాబందులు!

0
SHARE

పుట్టి పది రోజులైనా కాని పసి నలుసుల్ని గుడ్డలో చుట్టి, బిస్కెట్లు సరఫరా చేసే పెట్టెల్లో పెట్టి దొంగచాటుగా తరలించడం కంటే అమానుషం ఉందా? మనుషుల అక్రమ రవాణా ఎంత వికృతంగా సాగుతోందో కళ్లకు కడుతోంది పశ్చిమ్‌ బంగలో ఏళ్ల తరబడి సాగుతున్న ఈ మాఫియా దందా! ఇద్దరు ఆడపిల్లల్ని పడుపు వృత్తి నుంచి బయటకు తెచ్చి తన స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంచిన నేరానికి అక్కడ నెలరోజుల నాడు ఓ అభాగిని దారుణ హత్యకు గురైంది. ఆ అమానుషాన్ని వెన్నంటే, ఆమె సంరక్షణలోని ఆడపిల్లల చిరునామా గల్లంతయ్యింది! అది జరిగిన కొన్నాళ్లకే కోల్‌కతాకు 50 మైళ్ల దూరంలోని బదూరియాలో పసిపిల్లల విక్రయ వ్యాపార చీకటి కోణాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. ఆసుపత్రులు, దళారులు, కోర్టు గుమస్తాలు, స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో మూడేళ్లకు పైగా సాగుతున్న చీకటి దందా మూలాల్ని రాష్ట్ర సీఐడీ ఒకటొకటిగా ఛేదిస్తోంది. తమ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు మృతశిశువు జన్మించిందని నమ్మబలికి, కోర్టు గుమస్తాల ద్వారా పసిబిడ్డలకు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి, స్వచ్ఛంద సంస్థ ముసుగులోని దళారులకు ‘సరకు’ను చేర్చి, దత్తత పేరిట శిశు విక్రయాలు జరిపే దారుణమిది.

మగపిల్లలకు మూడు లక్షలు, ఆడపిల్లలకైతే లక్ష రూపాయల వంతున బేరం పెడుతున్న ముఠాలు- అమానుష రవాణాలో ప్రాణాలు పోయిన పసిమొగ్గల్ని మూడోకంటికి తెలియకుండా పూడ్చేస్తున్నాయి. ఎన్నో ఆసుపత్రులు, వైద్యుల ప్రమేయంతో జరుగుతున్న ఈ కిరాతకం- ఒక్క కోల్‌కతాకే పరిమితమై లేదని మనుషుల అక్రమ రవాణా అధ్యయన నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇటీవల అక్రమ రవాణా వ్యూహంలో భాగంగా దళారులు తరలిస్తున్న 500 మందిని రాయ్‌పూర్‌ జంక్షన్‌లో రైల్వే పోలీసులు పట్టుకొని సంరక్షించారు. మనుషుల అక్రమ రవాణా అంతర్రాష్ట్ర స్థాయి దాటి అంతర్జాతీయమవుతున్న వేళ- రేపటి తరంపై రాబందుల రెక్కల నీడ పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శాసనాల కొరడా ఝళిపించక తప్పదు!

ఆస్ట్రేలియాకు చెందిన వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ రూపొందించిన ప్రపంచ బానిసత్వ సూచీ ప్రకారం అన్ని దేశాల్లో కలిపి నాలుగు కోట్ల 58 లక్షల మంది హక్కులకు దిక్కులేని అభాగ్యులు ఉంటే, అందులో 40 శాతం ఇండియాలోనే పోగుపడ్డారు. మనుషుల అక్రమ రవాణా కేంద్రంగా వడివడిగా ఎదుగుతున్న ఇండియాలో మగపిల్లల్ని బానిస శ్రామికులుగా, ఆడపిల్లల్ని అంగడి బొమ్మలుగా విక్రయించే ముఠాలు విజృంభిస్తున్నాయి. ఈ నికృష్ట వ్యాపారానికి సంబంధించి నమోదవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌ బంగ, అండమాన్‌ నికోబార్‌ల నుంచే ఉంటున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి కనబడకుండా పోతున్న పిల్లల్లో సగటున 48 శాతం ఆచూకీ అసలెప్పటికీ తెలియడం లేదని సర్కారీ నివేదికలే చాటుతున్నాయి. ప్రపంచంలో ఆయుధాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం తరవాత అంత స్థాయిలో జరుగుతోంది మనుషుల అక్రమ రవాణాయే. గత పదేళ్ల కాలంలో ఇండియాలో ఆ జాడ్యం పది రెట్లు పెరగడం పరిస్థితి చేయిదాటి పోతోందనడానికి ప్రబల సంకేతమే! ప్రపంచవ్యాప్తంగా 2013 నాటికే రూ.15 లక్షల కోట్లకు చేరిన మనుషుల అక్రమ రవాణా మార్కెట్టును ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషిచేసి నేలమట్టం చెయ్యాలని మాదక ద్రవ్యాలు, నేరాలపై ఐరాస కార్యాలయం(యూఎన్‌ఓడీసీ) నిరుడు తీర్మానించింది. ఇండియాలోని 335 జిల్లాల్లో ఈ అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని 2013లో నివేదిక సమర్పించిన ఐక్యరాజ్య సమితి- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా ఓ అధ్యాయాన్నే జోడించింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 13 శాతంగా ఉందని, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ ‘మిస్సింగ్‌’ కేసు నమోదవుతున్న దుస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అధ్యయనాలు చాటుతున్నాయి. కరడుగట్టిన వ్యవస్థీకృత నేర ముఠాలపై ఉక్కుపాదం మోపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ పదునుతేలాల్సిన సమయమిది!

దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో వ్యవస్థీకృతమైపోయిన ముష్టి మాఫియాకు అపహరించి తెచ్చిన పిల్లలే పెట్టుబడి. దేశంలో ఏటా అపహరణకు గురి అవుతున్న పిల్లల సంఖ్య లక్షకు చేరిందని, వాళ్ల యాచన ద్వారా మాఫియా సంపాదన రూ.180కోట్లు దాటిపోయిందని రెండేళ్ల క్రితంనాటి గణాంకాలు చాటుతున్నాయి. పిల్లల్ని ఎత్తుకొచ్చి చిత్రహింసల పాల్జేసి, హృదయ విదారకంగా మార్చి, వాళ్ల కాయకష్టం నుంచే కోట్లు కొల్లగొడుతున్నది కొందరైతే- మైనర్‌ యువతులపై ప్రలోభాల వల విసిరి రాష్ట్రాల సరిహద్దులు దాటించి సత్వర ఎదుగుదల కోసం ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి పడుపు వృత్తిలో దించుతున్న దగాకోరులు ఇంకెందరో…! ఈ తరహా నేరాలకు సంబంధించి 2004లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై స్పందిస్తూ- బాలికల అక్రమ రవాణా నిరోధం, పరిరక్షణ, పునరావాసం లక్ష్యాలుగా సమగ్ర చట్టం రూపకల్పనకు సంప్రతింపుల ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు నిరుడీ రోజుల్లో ఆదేశించింది. కొరగాకుండా పడిఉన్న 1956 నాటి చట్టం స్థానే నేటి స్థితిగతులకు దీటైన ముసాయిదా చట్టాన్ని మే నెలనాటికే సిద్ధం చేసిన మోదీ ప్రభుత్వం, దానికి మెరుగులు దిద్దే పనిలో ఉంది. అక్రమ రవాణా కేసుల విచారణ కోసం వ్యవస్థీకృత నేరాల దర్యాప్తు సంస్థనూ కొలువు తీర్చాలన్న ‘సుప్రీం’ మార్గదర్శకాన్ని మన్నించడంతోపాటు, సాటి మనిషిని ‘మని-షి’గానే చూస్తూ కాసుల పంట పండించుకొంటున్న నేరముఠాల కూసాలు కదిలేలా చట్టం కొరడా ఝళిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహంతో కదిలినప్పుడే మనుషుల్ని కబళించే రాబందుల పీడ విరగడయ్యేది!