స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఆగస్గు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా(ప్రతి ఇంటిపై జాతీయజెండా) అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల నుంచి జాతీయ జెండాల విక్రయం ప్రారంభమైంది. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 6214 పోస్టాఫీసులకు 7,50,000 జాతీయ జెండాలు సరఫరా చేయనున్నట్టు పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
స్తంభం లేకుండా 30x 20 అంగుళాల పరిమాణంలో ఉన్న జాతీయ జెండాలు ఇప్పుడు జెండాకు రూ. 25/- ధరలో అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయాల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా పోస్టల్ సిబ్బందికి ముందస్తు సూచనలు చేశారు.
తపాలా సిబ్బంది గ్రామాల్లో, పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలల్లో హర్ ఘర్ తిరంగా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి , దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 13 నుండి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో చురుకుగా పాల్గొని తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నట్టు వారు పేర్కొన్నారు.