ఇటీవల చెన్నయ్‌లో 44వ FIDE చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ చదరంగంతో తమిళనాడుకు గల సంబంధాన్ని వారి ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడులోని ఒక దేవస్థానంలో మహేశ్వరుడు చదరంగం ఆడిన దృష్టాంతం ఉందని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని ప్రస్తావించిన సదరు దేవస్థానంపై ప్రపంచ ప్రజల దృష్టి పడింది. ఆ దేవాలయమే సతురంగ వల్లభనాథర్ దేవస్థానం. తిరువారూరు జిల్లాలోని నీడమంగళానికి సమీపంలో గల తిరుపూవనూరులో సతురంగ వల్లభనాథర్ దేవస్థానం ఉంది. తమిళ భాషలో సతురంగ అంటే చదరంగం అని అర్థం. సతురంగ వల్లభనాథర్ అంటే చదరంగం ఆటలో నిష్టాతుడని అర్థం.
స్థలపురాణాన్ని అనుసరించి, స్థానిక మహా రాజుగారి కుమార్తెను చదరంగంలో ఓడించి ఆమెను పరిణయమాడిన కారణంగా మహాశివుడు సతురంగ వల్లభనాథర్ అని పేరొందారు. రాజకుమారి రాజరాజశ్వేరి పార్వతి దేవి వారి అవతారమని స్థల పురాణం చెబుతున్నది. రాజకుమారి చదరంగ క్రీడలో నిపుణురాలు. చదరంగం ఆటలో తన కుమార్తెను ఓడించినవారికి ఆమెతో వివాహం చేస్తానని మహా రాజు ప్రకటించారు. కానీ ఓ ఒక్కరూ కూడా ఆమెను ఓడించలేకపోతారు. గత్యంతరం లేక మహారాజు పరమశివును ప్రార్థిస్తారు.
మహారాజు ప్రార్థనను ఆలకించిన మహాశివుడు ఒక వృద్ధుడి రూపంలో నేల మీదకు అడుగిడుతారు. చదరంగం ఆటలో రాజరాజేశ్వరి దేవిని ఓడిస్తారు. అనంతరం నిజరూపాన్ని పొంది అమ్మవారి పాణిగ్రహణం చేస్తారు. ఈ వృత్తాంతాన్ని వెల్లడించే ముఖచిత్రంతో ప్రముఖ తమిళ వారపత్రిక ‘కల్కి’ దీపావళి పండుగను పురస్కరించుకొని 1965లో ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.