Home News తీర్మానం 2- హిందూ సమాజం సంప్రదాయాలు, విశ్వాసాలను రక్షించవలసిన అవసరం.

తీర్మానం 2- హిందూ సమాజం సంప్రదాయాలు, విశ్వాసాలను రక్షించవలసిన అవసరం.

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2019, గ్వాలియర్

తీర్మానం 2- హిందూ సమాజం సంప్రదాయాలు. విశ్వాసాలను రక్షించవలసిన అవసరం.

భారతీయేతర దృక్పథం కల స్వార్ధ శక్తులు హిందూ విశ్వాసాలను, సంప్రదాయాలను దెబ్బ తీసేందుకు ఒక పధ్ధతి ప్రకారం కుట్ర పన్నాయని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది. శబరిమల ఆలయ ఉదంతం ఈ కుట్రకి తాజా ఉదాహరణ.

హిందుత్వం ఏకశిలా సదృశమైన, వేర్పాటు దృక్పథం కల ఆలోచనా స్రవంతి కాదు. స్థానిక సంప్రదాయాలు, పూజా విధానాలు, పండుగలకు సంబంధించిన విలక్షణ, విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణ ద్వారా జీవితాన్ని వీక్షించే ఒక పధ్ధతి హిందుత్వం. మన సంప్రదాయాల్లో ఉన్న వైవిధ్య సౌందర్యం పైన పసలేని, రంగు రుచిలేని ఏకత్వవాదాన్ని రుద్దడం పొరపాటు అవుతుంది.

తన పద్ధతులు, సంప్రదాయాల్లో అవసరమైన, కాలానుగుణమైన సంస్కరణలను హిందూ సమాజం ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంది. అయితే అటువంటి సంస్కరణలు సామాజిక, మత, ఆధ్యాత్మిక నాయకుల నేతృత్వంలో, ఏకాభిప్రాయం ప్రాధాన్యతగా జరిగాయి. చట్టపరమైన ప్రక్రియలు కాక, స్థానిక సంప్రదాయాలు, ఆమోదం కూడా సామాజిక ప్రవర్తనలో కీలక పాత్ర పోషిస్తాయి.

సుప్రీమ్ కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం పవిత్ర శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించమని తీర్పు ఇచ్చినదన్న మిషతో కేరళలోని వామపక్ష ప్రభుత్వం హిందూ సమాజ మనోభావాలను, నమ్మకాలను తుంగలోకి తొక్కుతున్న ఈ తరుణంలో హిందూ సమాజం యావత్తు ఒక దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది.

శబరిమల అనేది భక్తుడికీ, భగవంతుడికి మధ్య ఒక విలక్షణమైన అనుబంధానికి ఉదాహరణ. తన తీర్పు ఇచ్చేటప్పుడు సుప్రీమ్ కోర్ట్ ఆ ఆలయంలో ఉన్న సంప్రదాయం, పద్ధతిని సమాజం యావత్తు ఆమోదించి ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తోందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టం. మత సంప్రదాయాలపై నిపుణులైన మత పెద్దల అభిప్రాయాలను సేకరించలేదు; మహిళా భక్తుల మనోభావాలు పట్టించుకోలేదు. ఒక సమగ్ర దృక్పథం లేకపోవడం వల్ల స్థానిక సమాజాలు ఎన్నో శతాబ్దాలుగా అనుసరించి, పెంపొందిస్తున్న విలక్షణ, వైవిధ్యంతో కూడుకున్న సంప్రదాయాలకు విఘాతం కలిగింది.

కేరళలో సిపిఎం-నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యలు అయ్యప్ప భక్తులలో తీవ్రమైన అలజడి కలిగించాయి. నాస్తికులు, తీవ్ర వామపక్షాలకు చెందిన మహిళలను దొంగచాటుగా గుడిలోకి చొప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు భక్తుల మనోభావాలను గాయపరచాయి. ఇది కేవలం సిపిఎం సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు, హిందువుల మధ్య మరొక సైద్ధాంతిక యుద్ధానికి తెర  తీసేందుకు ప్రయత్నించిన ఉదంతం. ఈ కారణం వల్లనే అనేకమంది భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు తమ మత విశ్వాసాలను, స్వేచ్చనూ కాపాడుకునేందుకు మునుపెన్నడూ లేని విధంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.

భక్తులందరూ వ్యక్తం చేసిన ఉమ్మడి దృక్పథం పట్ల అఖిల భారతీయ ప్రతినిధి సభ తన గౌరవాన్ని ప్రకటిస్తోంది. ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేందుకు జరుపుతున్న ఉద్యమాన్ని సంయమనంతో కొనసాగించవలసిందిగా కోరుతోంది. భక్తుల విశ్వాసాలు, మనోభావాలు, ప్రాజాస్వామిక హక్కులను గౌరవించాలని, తన సొంత ప్రజలపైనే హింసాత్మకంగా వ్యవహరించవద్దని ప్రతినిధి సభ కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రివ్యూ పిటీషన్లు, ఇతర పిటీషన్లపై విచారణ జరిపేటప్పుడు సుప్రీమ్ కోర్ట్ ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తుందని కూడా ప్రతినిధి సభ ఆశిస్తోంది. సేవ్ శబరిమల ఉద్యమానికి అన్ని విధాలా మద్దతు ఇవ్వాలని కూడా అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈ దేశప్రజలు కోరుతోంది.