Home Telugu Articles సావర్కర్, నేతాజీలది ఒకటే మార్గం

సావర్కర్, నేతాజీలది ఒకటే మార్గం

0
SHARE

— ప్రొ. కపిల్ కుమార్

కమ్యూనిస్ట్, కాంగ్రెస్ మేధావులు, చరిత్రకారులు 70 ఏళ్లుగా ఏ చారిత్రక సత్యాలను ప్రజల నుంచి దాచిపెడుతూ వచ్చారో ఆ నిజాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. నిజాలను ఎక్కువ కాలం దాచిపెట్టలేరని, వక్రీకరించలేరని దీనివల్ల స్పష్టమవుతోంది.

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వీర సావర్కర్ ఘన చరిత్రను మరుగునపరచేందుకు చేసిన ప్రయత్నం ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. అక్కడ విద్యార్ధులేకాకుండా, ప్రజానీకమంతా సావర్కర్ పాఠ్యాంశాన్ని ఎందుకు తొలగించారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. సావర్కర్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత కోపం? 1984 సిక్కుల ఊచకోత సంఘటన గురించి అడిగితే చరిత్రలోకి వెళ్లవద్దని అనే కాంగ్రెస్ సావర్కర్ విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తించిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సావర్కర్ చరిత్రను మరుగు పరచలేదని, ఇంటర్ నెట్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే వీలు ఇప్పుడు ఉందని సమాధానమిస్తున్నారు.

బ్రిటిష్ పాలకుల స్వస్థలమైన బ్రిటన్ లోనే సావర్కర్ విప్లవ శంఖాన్ని పూరించిన సంగతి ఎవరైనా మరచిపోగలరా? విప్లవకారులకు, సాధారణ ప్రజానీకానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించిన ఆయన వ్రాసిన పుస్తకాన్ని దాచిపెట్టగలరా?

రాజకీయ ఖైదీలా ఇంగ్లండ్ నుంచి భారత్ కు తీసుకువస్తున్నప్పుడు ఫ్రాన్స్ తీరంలో ఓడలోనుంచి దూకడమేకాక ఒడ్డువరకు ఈదుకురావడం ఏ కాంగ్రెస్ నాయకుడైనా కలలోనైనా ఊహించగలడా? అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ వల్లనే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చూపించడానికి, ప్రచారం చేయడానికి ఇలాంటి విషయాలను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటివారి త్యాగాలను వామపక్ష, కాంగ్రెస్ చరిత్రకారులు ప్రజలకు తెలియకుండా చేశారు.

నేతాజీని హిట్లర్ ఏజెంటుగా అభివర్ణించిన వీళ్ళే వీర సావర్కర్ భయంతో బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరారని ప్రచారం చేశారు. కానీ ఏడేళ్లపాటు సావర్కర్ అండమాన్ జైలులో అనుభవించిన దారుణమైన శిక్షలు ఏ కాంగ్రెస్ నాయకుడైనా, ఎప్పుడైనా ఒక్క రోజుకైనా అనుభవించాడా అని ఎవరైనా అడిగారా? నెహ్రూ ఎప్పుడైనా అరెస్ట్ అయితే వెంటనే తాను రాజకీయ ఖైదీనని చెప్పుకుని తప్పనిసరిగా `బి శ్రేణి’ వసతులు పొందేవారు. సావర్కర్ తన లేఖలో తన కోసం మాత్రమేకాక అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అందరి కోసం క్షమాభిక్ష అర్ధించారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఎంతో `నాగరికమైన’ బ్రిటిష్ పాలకులు ఆ జైలులో స్వాతంత్ర్య యోధులకు విధించిన దారుణమైన శిక్షల వల్ల 1857 తరువాత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎంతమంది మతిస్థిమితం కోల్పోయారో తెలియదు. రెండవ కారణం, ఒక విప్లవ వీరుడు దారుణమైన కాలాపానీ జైలులో శిక్షలు అనుభవిస్తూ కుంగికృశించిపోవడం తప్ప ఏమి చేయలేడు.  జైలు నుంచి పారిపోవడం సాధ్యం కాదు. బయటకు వస్తే లక్ష్యసాధన కోసం ఏదైనా చేయవచ్చును. జైలు నుంచి విడుదల చేసిన తరువాత ఆయనను బ్రిటిష్ వాళ్ళు గృహనిర్బంధంలో ఉంచారనే విషయం గుర్తుచేసుకుంటే సావర్కర్ కు ఉన్న ఈ ఆలోచన వాళ్ళు గ్రహించారని తెలుస్తుంది. దీనినిబట్టి బ్రిటిష్ వారికి లేఖ వ్రాయడం కేవలం జైలు నుంచి బయటపడటం కోసమేనని, అది విప్లవకార్యకలాపాల్లో ఒక వ్యూహాత్మక ఎత్తు మాత్రమేనని స్పష్టమవుతుంది.

సావర్కర్ అనేకమందిని బ్రిటిష్ సైన్యంలో చేర్చారని, అలా చేరడానికి ప్రోత్సహించారని కొందరు చేసే మరో ఆరోపణ. కానీ మొదటి ప్రపంచయుద్ధ సమయంలో గాంధీజీ కూడా అనేకమందిని బ్రిటిష్ సైన్యంలో చేరమని కోరారన్న సంగతి వాళ్ళు మరచిపోతారు.

జాతీయ అభిలేఖాగారం(ఆర్కైవ్స్) ఫైళ్లలో ఉండిపోయిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెపుతాను. 1940లో సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల మధ్య చర్చలు జరిగాయని అందరికీ తెలుసు. అయితే కాబూల్ నుంచి బయలుదేరి జర్మనీకి వెళ్ళే ముందు నేతాజీ తన సహచరులకు ఒక లేఖ వ్రాసారు. అందులో ఈశాన్య ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ సేనలపై దాడి చేయాలనే ప్రణాళికను ఆయన అందులో వెల్లడించారు. అలాగే బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి చేపట్టవలసిన అనేక కార్యక్రమాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఆ లేఖ భారత్ లో ఆయన సహచరులకు చేరనేలేదు. 1948లో ఆ లేఖను ప్యారిస్ లో నేతాజీ పెద్దన్నగారైన శరత్ బోస్ కు ఆఫ్ఘనిస్తాన్ లో ఇటలీ రాయబారిగా పనిచేసిన క్వాత్రోని అందజేశారు. ఆ లేఖలో నేతాజీ మరొక  ముఖ్యమైన  విషయం ప్రస్తావించారు. బ్రిటిష్ సైన్యంలో జరుగుతున్న భర్తీని ఉపయోగించుకుని దేశభక్తులైన, విశ్వసనీయులైన యువకులను సైన్యంలో చేర్చాలని, అవసరమైనప్పుడు వాళ్ళే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఇలాగే జరిగింది కూడా. నిజానికి హింద్ ఫౌజ్ లో ప్రవాసీ భారతీయులతోపాటు ఇలా బ్రిటిష్ సైన్యాన్ని వదిలిపెట్టిన వారే ఉండేవారు.

సావర్కర్ కూడా భారతీయ యువకులను బ్రిటిష్ సైన్యంలో చేరమని ఇందుకోసమే ప్రోత్సహించారా? ఇది నేతాజీ, సావర్కర్ ల మధ్య జరిగిన రహస్య చర్చల ఫలితమా? ఈ ప్రశ్నలకు ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన ఒక సైనికుడు ఐ ఎన్ ఏ కమిటీకి వ్రాసిన ఒక లేఖలో లభించాయి. ఈ లేఖ బ్రిటిష్ గూఢచారి విభాగపు ఫైళ్ళలో ఉంది. తాను సావర్కర్ ఆదేశం మేరకే బ్రిటిష్ సైన్యంలో చేరానని, ఆ తరువాత ఆయన సూచన ప్రకారమే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిని అయ్యానని  సైనికుడు ఆ లేఖలో వెల్లడించాడు. అయితే ఇలాంటి పత్రాలను చరిత్రకారులమని చెప్పుకునే అనేకమంది అసలు పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ నాయకులైతే తమ రాజకీయ ప్రయోజనాలకు భంగకరం కాబట్టి వాటిని జాగ్రత్తగా మరుగుపరచారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఖండిత భారతదేశం కోసం పోరాడలేదు. పదవి కోసం మౌంట్ బాటన్ చెప్పినట్లు విన్న నెహ్రూ దేశ ప్రజానీకపు మనోభావాలు, విశ్వాసాలతోపాటు గాంధీజీ మాటలను కూడా లెక్కచేయకుండా దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి అంగీకరించారు. చరిత్రను వివిధ ఆధారాలు, సాక్ష్యాల ద్వారా రచించుకోవాలికానీ రాజకీయ ప్రయోజానాలకు తగినట్లుగా వక్రీకరించకూడదు.