Home News ‘యువతకు చరిత్రపై అవగాహన కోసం నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు’

‘యువతకు చరిత్రపై అవగాహన కోసం నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు’

0
SHARE

చరిత్ర పట్ల తెలంగాణ యువతకు సంపూర్ణ అవగాహన కలిగించడం లక్ష్యంగా ఏడాది పాటు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి గారు తెలిపారు.

భాగ్యనగరంలో శనివారం (సెప్టెంబర్ 3న‌) ఏర్పాటు విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా, ప్రజల భాగస్వామ్యంతో, ఎలాంటి డిమాండ్లు లేకుండా, చరిత్ర పట్ల యువతను జాగృతపరచడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇదే సందర్భంగా 28 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కమిటీలో గౌరవ అధ్యక్షులుగా పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(రిటైర్డ్) జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిగారు, అధ్య‌క్షులుగా శ్రీ డాక్టర్ వంశీ తిలక్ గారు, ఉపాద్యక్షులుగా విశ్రాంత ఐఎఎస్ అధికారి శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు, విశ్రాంత కార్మిక శాఖ కమిషనర్ శ్రీ హెచ్.కె.నాగు గారు, ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత శాఖాధిపతి శ్రీ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, తదితరులు ఉన్నారు.

కమిటీ కార్యాచరణ ప్రణాళిక

వచ్చే సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, రెవిన్యూ మండల కేంద్రాల్లో ప్రముఖులు, యువకులతో అమృతోత్సవాల కమిటీ ఏర్పాటు. అదే రోజున త్రివర్ణ పతాకానికి వందన సమర్పణతో నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు ఆరంభం.

నవంబర్ లో యువకులు, కళాశాల విద్యార్థులతో యువ సమ్మేళనం నిర్వహణ.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో లక్షలాది కుటుంబాలకు తెలంగాణ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించే దిశగా జనజాగరణ కార్యక్రమ నిర్వహణ.

2023 సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ అంతటా జిల్లా కేంద్రాల్లో ప్రముఖ వ్యక్తులు, మేధావులతో సదస్సుల నిర్వహణ. అదే రోజున నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల విజయవంతంగా పూర్తి చేసినందుకు నిదర్శనంగా గ్రామ గ్రామాన త్రివర్ణ పతాకానికి వందన సమర్పణం.