అభం శుభం తెలియని పిల్లలకు వృద్ధులైన షేక్‌లతో పెళ్లిళ్లు చేసి వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా అరబ్ దేశాలకు పంపుతున్న ఓల్టా ఖాజీ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పదమూడేళ్ల నుంచి పదహారేళ్ల బాలికలతో పెళ్లి చేయిస్తానంటూ ఓల్టా ఖాజీ.. షేక్‌ల నుంచి రూ.లక్షలు తీసుకుంటున్నాడంటూ పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. కొందరు తల్లిదండ్రులు పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు వచ్చి ఓల్టా ఖాజీ చేసిన నిఖాతో నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్‌షేక్‌తో పెళ్లి జరిపిస్తే రూ.లక్షలు వస్తాయంటూ ప్రలోభపెట్టాడని, అతడి మాటలు నమ్మి కూతుళ్ల గొంతు కోశామంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారి నుంచి వివరాలను సేకరించిన పోలీస్ అధికారులు ఓల్టా ఖాజీ నెట్‌వర్క్‌పై దృష్టి కేంద్రీకరించి వివరాలు రాబట్టారు. ఒక్కో పెళ్లికి అతను కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ సంపాదిస్తున్నాడని అంచనా వేశారు. ఇలా సంపాదించిన సొమ్మును స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) సంస్థల్లో పెట్టుబడులు పెట్టి నాలుగేళ్లలోనే రూ.50 కోట్ల వరకూ సంపాదించాడని సమాచారం. పాతబస్తీలో ఓల్టా ఖాజీ ఇల్లే రూ.10 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. న్యాయస్థానం అనుమతితో గురువారం కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ చెప్పారు. తాడ్‌బండ్‌లోని ఓల్టా ఖాజీ కార్యాలయం, ఇంట్లో వక్ఫ్‌బోర్డు అధికారులతో కలసి సోదాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సౌకర్యాలకు అదనపు వసూళ్లు
అరబ్ షేక్‌లకు పెళ్లిళ్లంటే ఓల్టా ఖాజీ దృష్టిలో ప్యాకేజీలు. ఒక్కో పెళ్లికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటాడు. ఓల్టా ఖాజీ అడిగిన మొత్తం ఇస్తే చాలు ఎంత వృద్ధుడికైనా ఒప్పంద పెళ్లి చేసేస్తాడు. ఇందుకోసం దళారులు, ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. దళారులు పేదరికం, ఆర్థిక అవసరాలున్న ఆడపిల్లల తల్లిదండ్రుల వివరాలను సేకరిస్తున్నారు. మీ అమ్మాయిని అరబ్‌షేక్‌కు ఇచ్చి నిఖా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చంటూ వాళ్లను ఒప్పిస్తున్నారు. తల్లిదండ్రులతోపాటు కుమార్తెను ఓల్టా ఖాజీ వద్దకు తీసుకెళ్తున్నారు. పెళ్లి చేస్తే అమ్మాయికి అరబ్‌షేక్ దహేజ్ (కట్నం) ఇస్తారని, అక్కడికి వెళ్లాక యజమాని హోదాలో చూసుకుంటాడని ఖాజీ.. తల్లిదండ్రులను నమ్మిస్తున్నాడు. నిఖా చేసుకుంటే రూ.10 లక్షలు ఇప్పిస్తానని భరోసా ఇస్తాడు. తల్లిదండ్రులు అంగీకరించగానే బాలికల ఫోటోలు తీయించి మస్కట్, దుబాయ్‌ల్లోని పెళ్లిళ్ల ఏజెంట్లకు పంపుతాడు. రూ.10 లక్షలు బాలికల తల్లిదండ్రులకు ఇవ్వాలని, షేక్‌ల వద్ద కమీషన్ తీసుకుని హైదరాబాద్‌కు పంపాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. అరబ్‌షేక్ హైదరాబాద్‌కు చేరుకోగానే షేక్ ఇచ్చే డబ్బు ఆధారంగా అతడికి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు ఇస్తే తన ఇంట్లోనే అతిథిగృహంలో వసతి కల్పిస్తాడు. నిఖా రోజు నుంచి 15 రోజుల పాటు షేక్ అక్కడే ఉండి ఆ బాలికతో గడపవచ్చు. షేక్ తన స్వస్థలానికి వెళ్లేంత వరకూ ఓల్టా ఖాజీదే బాధ్యత. అక్కడి వెళ్లాక షేక్ తలాక్ అని చెబితే తలాక్ పత్రాలను బాలిక తల్లిదండ్రులకు ఇస్తాడు. బాలికను పంపించమంటే ఏజెంట్ల ద్వారా వీసా ఇచ్చి పంపుతున్నాడని పోలీస్ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు.
(ఈనాడు సౌజన్యం తో )