Home Views భారత మాత సేవలో సోదరి ‘నివేదిత’

భారత మాత సేవలో సోదరి ‘నివేదిత’

0
SHARE

మనదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది.

స్వామీ వివేకానంద స్ఫూర్తి
1895 సంవత్సరంలో మార్గరెట్‌ జీవితం అసాధారణమైన మలుపుతిరిగింది. ఆమె స్నేహితు రాలు ఆమెకు ఒక భారతీయ సన్యాసిని పరిచయం చేయటానికి తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ సన్యాసి ఎవరో కాదు స్వామి వివేకానంద. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో పాశ్చాత్య జనుల హృదయాలను జయించిన ఆ యుగ పురుషుని వ్యక్తిత్వం, తేజస్సు, ఆయన వాక్కు ఆమెను ఆకట్టు కున్నాయి. ఆయన ఉపదేశాలు, ప్రవచనాలు ఆమె ఆత్మను మేలుకొలిపాయి. భారతదేశానికి సేవ చేసే విధంగా ప్రేరేపించాయి.

మహిళా విద్యకు ప్రాధాన్యత
భారతదేశ స్థితిని గురించి స్వామిజీ ఆమెతో ఇలా అన్నారు ‘మా మహిళలు విద్యావంతులయ్యే వరకూ మా దేశం ప్రగతి సాధించదు. మా దేశపు మహిళల విద్య, అభివృద్ధి కొరకు, వారిని ఆ పనిలో నిమగ్నం చేయటానికి నువ్వు నాకు సహాయం చేస్తావా’. తనపట్ల స్వామిజీకి ఉన్న విశ్వాసానికి ప్రభావితురాలై స్వామీజీ దేశమే తన దేశంగా భావించి భారతదేశానికి రావటానికి నిర్ణయించుకొని 1898 జనవరి 28న కలకత్తా చేరుకుంది. ఆమెను స్వాగతించేందుకు స్వయంగా స్వామీజీ అక్కడికి వెళ్ళారు. త్వరలోనే ఆమె అక్కడ ప్రజలలో కలిసి పోయింది. బెంగాలీ భాష నేర్చుకుని ఆ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసింది. స్వామీజీ శిష్యులు అమెరికా నుండి ఇద్దరు వచ్చారు. ముగ్గురూ కలసి ఒక తమ నివాసాన్నే ఆశ్రమంగా మార్చేశారు.  వారికి స్వామిజీ స్పష్టంగా ఒక సందేశం ఇచ్చారు. ”ఈ దేశాన్ని ప్రేమించండి. పూజించండి. ఇదే ప్రార్థన. ఇదే పూజ.” 1898 మార్చి 25న స్వామిజీ మార్గరెట్‌తో శివపూజ చేయించి ”నివేదిత”  నామ కరణం చేశారు. నివేదిత అంటే నివేదించబడినది (సమర్పితమైనది) అని అర్ధం. ఆమెను భగవంతునికి తద్వారా భారతదేశానికి సమర్పించారు.

మహిళలకు, బాలికలకు విద్యనేర్పటానికి నివేదిత ఒక పాఠశాలను ప్రారంభించింది. ఇంటింటికీ వెళ్ళి బాలికలను బడికి పంపవల సిందిగా ప్రజలను కోరింది. వారినుండి ఎంత ప్రతికూలత వచ్చినా, వారికి నచ్చజెప్పి కొందరి బాలికలకు వ్రాయటం, చదవ టమే కాకుండా చిత్రకళ, శిల్పకళ కూడా నేర్పింది. అలా తన నిస్వార్ధ సేవా, సహయాలతో కలకత్తా ప్రజల హృదయాలలో స్థానం పొందింది.

బాధితుల సేవలో
1899 మార్చిలో కలకత్తాలో ”ప్లేగ్‌” వ్యాధి వ్యాపించింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పో యారు. ఆ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే సంకల్పం తీసుకుని మురికి వాడలను శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఆమె సేవాకార్యక్రమాల ప్రభావంతో మిగతా మహిళలు కూడా ముందుకు వచ్చారు. శుభ్రపరచడమేకాక రోగగ్రస్తులకు సేవచేయటం కూడా ఆమె ఆచరణ ద్వారా నేర్పింది.

పాఠశాలకు నిధులు సమకూర్చేందుకు ఆమె యూరప్‌కు ప్రయాణమైంది. నిధులకోసమేకాక క్రైస్తవ మిషనరీలు పాశ్చాత్య దేశాలలో మనదేశం గురించి ప్రచారం చేసే అసత్యాలను ఖండించి ఇక్కడి మ¬న్నత  సంస్కృతిని గూర్చి వారికి సరియైన అవగాహన కల్పించేందుకు కూడా ఆమె తన యాత్రను ఉపయోగించుకున్నారు.

జనజాగృతి…
1902లో స్వామిజీ మహాసమాధి చెందారు. అంతకుముందు మన దేశ స్వాతంత్రంకోసం సంఘర్షణ చేయాలనే మరో కార్యాన్ని కూడా ‘నివేదిత’కు అప్పగించారు. అలా ఆమె భారత స్వాతంత్య్ర సాధనే తన జీవన కార్యంగా స్వీకరిం చింది. దేశమంతా పర్యటించి ప్రజలను స్వతంత్ర పోరాటానికి సమాయత్తం చేసే విధంగా ప్రేరణ దాయకమైన ప్రసంగాలు చేసింది.

అలా ఆమె మానసిక బానిసత్వం నుండి బయటపడే విధంగా ప్రజలకు ప్రేరణ కల్గించింది.

– రమేష్‌ చంద్ర

Source: Lokahitam