Home Telugu Articles మానవ హక్కులపై మనకు పాఠాలా?

మానవ హక్కులపై మనకు పాఠాలా?

0
SHARE

జమ్మూ కాశ్మీర్‌లో, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరగుతున్నవని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరపాలంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి భాతదేశంపై కొన్ని విమర్శలు చేసింది. ఈ సమితిలో 47 సభ్య దేశాలున్నాయి. సమితి నివేదికలో అనేక అంశా లున్నాయి. మయన్మార్‌లో రోహింగ్యాల గురించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొన్నందుకు ఇటీవలే అమెరికా ఈ సమితి నుంచి వైదొలగింది. జమ్మూ కశ్మీరుపై మొదటిసారి ఈ సమితి నివేదిక విడుదల చేసింది.

జూలై 2016 నుంచి ఏప్రిల్‌ 2018 వరకు 145 మంది పౌరులు సైన్యం చేతిలో చనిపోయారని, 20 మంది సాయుధుల చేతిలో చనిపోయారని, సైన్యం మీద ఎటువంటి విచారణ జరగలేదని, దీనిపై ఒక కమిషన్‌ వేయాలని నివేదిక పేర్కొంది. 38వ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాలు జూన్‌ 18, 2018 మొదలైనాయి. జూలై 6, 2018 వరకు ఇవి జరుగుతాయి. ఈ మండలి 2006లో ఏర్పడింది. ఏడాదిలో మూడుసార్లు మండలి సమావేశమై మానవహక్కుల గురించి చర్చిస్తుంది. సెప్టెంబరు 2015లో జైద్‌రాద్‌ అల్‌ హుసేన్‌ అనే పేరుగల ఐక్యరాజ్యసమితిలో సౌదీఅరేబియా రాయబారి ఈ మానవహక్కుల సలహా మండలి అధ్యక్షుడయ్యాడు. ఐక్యరాజ్య సమితికి చెందిన డైరెక్టర్‌ హిల్లేవ్‌నూర్‌ మాట్లాడుతూ తమ దేశంలో వేలమందిని ఊచకోత కోసిన దేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సలహా మండలికి అధ్యక్షతవహించడం హాస్యాస్పదం అన్నారు.

రిపబ్లిక్‌ ఆఫ్‌ ఎమన్‌పై జూన్‌ 2015లో సౌదీఅరేబియా వైమానిక దాడులు జరపడం, అనేకమంది భారతీయులను భారతదేశ విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం తెలిసిన విషయమే. నిజానికి ప్రపంచమంతా కుటుంబం అని భావించిన భారత్‌కు ఇవాళ ఈ మానవహక్కుల మండలి పాఠం చెబుతోంది. ఏనాడూ ఏ దేశం మీద కూడా భారత్‌ దండెత్తలేదు. పైగా ఐక్యరాజ్య సమితి తరపున వివిధ దేశాలలో శాంతి కోసం ఇప్పటివరకు 10 లక్షల మంది భారతీయ సైనికులు తమ సేవలందించారు. మండలి చేసిన ఈ ప్రకటనను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి శ్రీ రాజీవ్‌ చందర్‌ ఖండించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం సజావుగా వుందని, భావప్రకటనా స్వేచ్ఛ వుందని, భారత్‌లో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని, పత్రికలు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని, న్యాయం, చట్టాన్ని అతిక్రమించి పాల్పడే చర్యలను భారత్‌ సమర్థించదని ఆయన తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్నది తీవ్రవాదులతో యుద్ధమని, తీవ్రవాదం పట్ల భారత్‌ ఏమాత్రం సహనం పాటించదని, తీవ్రవాదాన్ని అణచివేయడం మానవహక్కుల ఉల్లంఘనతో పోల్చలేమని అన్నారు. భారత్‌ లక్ష్యం అందరితో కలసి అందరి అభివృద్ధి అని, ఎవరినీ వెనుకబడనీయకుండా అందరితో కూడిన సమాజ అభివృద్ధినే భారత్‌ కోరుకుంటుందని మండలికి తెలియజేశారు.

తాజాగా కాశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛను మంటగలుపుతూ రైజింగ్‌ కాశ్మీర్‌ సంపాదకుడు సజ్జత్‌ బుఖారీని, ఔరంగజేబు అనే సైనికాధికారిని తీవ్రవాదులు కాల్చిచంపడం మానవహక్కుల ఉల్లంఘన కాదా? అని మండలిని భారత్‌ ప్రశ్నించింది. మండలి నివేదిక, ఐక్యరాజ్య సమితి తీవ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఉందని, ఐక్యరాజ్యసమితి పేర్కొన్న తీవ్రవాద సంస్థలైన లష్కరేతోయిబా, జైషేమహమ్మద్‌లను మండలి సాయుధ దళాలుగా పేర్కొనడాన్ని కూడా తప్పుబడుతూ నిరసన తెలియజేసింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలతో రాజీపడేది లేదని భారత్‌ మండలికి తేల్చి చెప్పింది.

– హనుమత్‌ ప్రసాద్‌

(లోకహితం సౌజన్యం తో)