Home News అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదు: యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదు: యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు

0
SHARE
  • అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణానికి అభ్యంతరం లేదు
  • ప్రతిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదును నిర్మించాలి
  • యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ వసీం రిజ్వి వెల్లడి

అయోధ్యలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మందిరం-మసీదు వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారంకావాలని కోరుకుంటున్నట్లు యూపీలోని షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు మండలి తెలిపింది. వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బోర్డు ఛైర్మన్‌ వసీం రజ్వీ సోమవారం లఖ్‌నవూలో వెల్లడించారు. దీనికి ప్రతిగా వివాదాస్పద ప్రాంతానికి దూరంగా, ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో ‘మజీద్‌ ఎ అమన్‌’ పేరుతో మసీదును నిర్మించాలని కోరారు. ‘‘1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన ప్రాంతంలో హిందువులు తాత్కాలిక ఆలయంలో దేవుని ప్రతిమను ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారు. అలాంటి ప్రదేశంలో మసీదు నిర్మించాలని ఏ ముస్లిం అయినా ఎలా కోరగలడు?’’ అని విలేకరుల సమావేశంలో రిజ్వీ అన్నారు. అన్య మతస్థుల ప్రార్థనా స్థలాల్లో మసీదులను నిర్మించరాదని ఇస్లాం కూడా చెబుతుందని తెలిపారు. భారత పురావస్తు విభాగం(ఏఎస్‌ఐ) కూడా బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదని నిర్ధరించినందున ముస్లింలు అయోధ్య వివాదంపై పునరాలోచించాలని కోరారు. శ్రీరాముని జన్మస్థలంలో నిర్మించిన ఆలయాన్ని బాబర్‌ సేనాని మిర్‌ బకి కూల్చి మసీదును నిర్మించారని తులసీదాస్‌ తన ‘రామచరిత మానస్‌’లో పేర్కొన్నారని తెలిపారు. మందిరం-మసీదు వివాదాన్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలో కమిటీని నియమించాలంటూ గతంలో తాను చేసిన ప్రతిపాదనను రిజ్వీ పునరుద్ఘాటించారు. ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన షియా మత పెద్దలూ వివాదాస్పద ప్రాంతాన్ని రామమందిరం నిర్మాణానికి అప్పగించి మసీదును మరోచోట నిర్మించుకోవాలని సూచించారని వెల్లడించారు. బాబర్‌ సేనాని మిర్‌ బకి షియా వర్గానికి చెందిన వాడని, ఆయన నిర్మించిన మసీదుపై షియాలకే సర్వహక్కులుంటాయని రిజ్వీ అన్నారు.

(ఈనాడు సౌజన్యం తో)