
సహజ వనరుల వినియోగంపై పరిశోధక సంస్థ అంచనాలు
సహజ వనరుల వినియోగం తీరుపై ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మనిషి అవసరాలు, కోరికలను తీర్చాలంటే నేడు 1.7 భూగ్రహాలు కావాలని ‘గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్’ అనే ఈ సంస్థ అంచనా వేసింది. వనరుల వినియోగం భవిష్యత్తులోనూ ఇంతే తీవ్రంగా ఉంటే 2030 నాటికి రెండు భూమండలాలు కావాలని తెలిపింది. అందరూ భారతీయుల మాదిరి వనరులను వినియోగిస్తూ బతికితే భూమి అర్ధభాగం కన్నా కొంత ఎక్కువగా (60 శాతం) ఉంటే సరిపోతుందని తెలిపింది. అమెరికన్లలా జీవించాలంటే మాత్రం ఐదు భూగ్రహాలు కావాలని అంచనా వేసింది. వారు వనరులను విపరీతంగా వాడేస్తున్నారు.
ఐదు నెలలు ముందే అవగొట్టేశాం!:ఏడాది కాలానికి వనరులను ఏ స్థాయి వరకు వినియోగిస్తే భూమి తట్టుకోగలదో చెప్పే అంచనాలు ఉన్నాయి. వినియోగం ఈ స్థాయికి చేరిన రోజును ‘ఎర్త్ ఓవర్‌షూట్ డే’గా పిలుస్తారు. ఈ స్థాయి వరకైతే భూమి తిరిగి భర్తీ చేసుకోగలదు. ఈ స్థాయిని దాటితే తట్టుకోలేదు. ఓవర్‌షూట్ డే తర్వాత రోజు నుంచి ఏడాది చివరి వరకు వనరుల వాడకంవల్ల భూమిపై పడేది భరించలేని అదనపు భారమే. రెండు దశాబ్దాల క్రితం అంటే 1997లో ఓవర్‌షూట్ డే సెప్టెంబరు 30న వచ్చింది. వనరుల వినియోగం పెరిగే కొద్దీ ఇది ముందుకు జరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు 2నే వచ్చింది. అంటే ఏడాదిపాటు వాడుకోవాల్సిన వనరులను దాదాపు ఐదు నెలలు ముందుగానే అవగొట్టేశామన్నమాట!
వనరుల వినియోగాన్ని తగ్గించుకొంటూ ఏడాదికి నాలుగున్నర రోజుల చొప్పున ఓవర్‌షూట్ డేను వెనక్కు జరుపుతూ వెళ్లగలిగితే 2050 నాటికి వనరుల వినియోగం భూమి తట్టుకోగలిగే స్థాయికి చేరే అవకాశముందని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వీటిని మనిషి తీవ్రస్థాయిలో వాడేస్తుండటంతో ప్రకృతిలోని ఇతర జీవజాతుల జనాభాపై పెను ప్రభావం పడుతోందని ‘ప్రపంచ వన్యప్రాణుల నిధి(డబ్ల్యూడబ్ల్యూఎఫ్)’ నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తంచేసింది. 1970 నుంచి 2012 మధ్య భూమిపై మత్స్య సంపద, పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, సరీసృపాల సంఖ్య 58 శాతం తగ్గిపోయిందని తెలిపింది.
2050 నాటికి భారత్‌లో తీవ్ర నీటి కొరత: భారత్‌లో వనరుల వాడకం తీరు జల సంక్షోభానికి దారి తీస్తోంది. దేశంలోని 20 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో 14 బేసిన్లలో నీటి లభ్యతలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉపరితల జలవనరుల్లో 70శాతం కలుషితమైపోయాయి. 2050 నాటికి దేశవ్యాప్తంగా తీవ్రమైన నీటి కొరత ఏర్పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు, వాటి అమలు తీరు సరిగా లేకపోతే వృద్ధి రూపంలోనూ పర్యావరణానికి గట్టి ముప్పు ఏర్పడవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్-భారత్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సెజల్ వోరా హెచ్చరించారు.
(ఈనాడు సౌజన్యం తో)