కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా పాలిగ్రాఫ్ పరీక్షల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. తాను చేసిన పని పాపమేమీ కాదని, తనకు ఉరిశిక్ష విధించినా పశ్చాత్తాపపడేది లేదని, తన కోసం జన్నత్ (ఇస్లాంలో ‘స్వర్గం’ వంటిది)లో చోటు ఉంటుందని అన్నట్టు పోలీస్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ దైనిక్ భాస్కరన్ పత్రిక ప్రచురించింది.
శ్రద్ధా వాకర్ హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని అంగీకరించిన ఆఫ్తాబ్.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని, బాధ పడటం లేదని చెప్పినట్లు దర్యాప్తు బృందం వర్గాలు వెల్లడించాయి.
శ్రద్ధాను శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా ఆఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో చెప్పినట్లు తెలిసింది. తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో ఆఫ్తాబ్ ప్రవర్తన చాలా సాధారణంగా ఉందట. శ్రద్ధ హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తాను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్లు సమాచారం. అయితే, శ్రద్ధాను హత్య చేసినట్లు ఆఫ్తాబ్.. ఆ మధ్య కోర్టు ముందు కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
Courtesy : NIJAM TODAY