నవంబర్ 30 - జగదీశ్ చంద్రబోస్ జయంతి
‘రాత్రివేళ మొక్కలని బాధ పెట్టకూడదు. అవి నిద్రపోతాయి.’ ఎందుకో మరి, ఒకరాత్రి పూట ఆ పిల్లవాడు పువ్వు తెంపడానికి ఒక మొక్కవైపు చేయి చాపినప్పుడు అతడి తల్లి అలా మందలించింది. ఆ బాలుడే జగదీశ్ చంద్ర బోస్ (జేసీ బోస్), మందలించిన ఆ మహిళ బామాసుందరీ బోస్. అతని కన్నతల్లి. ఇదేమాట ఎన్నో తరాలలో ఎందరో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందరో పిల్లలకు చెప్పారు కూడా. కొందరు పిల్లలు నవ్వారు. అదేదో మూఢ నమ్మకమని కొందరు గడుగ్గాయిలు భావిం చారు. కానీ ఆ మాటలోని నిజమెంతో తాను వృక్షశాస్త్ర పరిశోధనలో చేరిన తరువాత, మారుతున్న కాంతిలో మొక్కల స్పందన అన్న అంశం మీద సిద్ధాంత వ్యాసం రాసిన తరువాత మాత్రమే తెలిసిందంటారు డాక్టర్ వినీత్ అగర్వాల్ (ఈయన బ్లాగ్ డికోడ్ హిందూ మైథాలజీ). కానీ తల్లి చెప్పిన మాట జేసీ బోస్‌ను (నవంబర్ 30, 1858-23 నవంబర్ 1937) జీవితాంతం వెంటాడింది. మొక్కలకూ అనుభూతులు, బాధలు ఉంటా యని, అవి అనురాగాన్ని వెదజల్లగలవని ప్రపంచానికి చా•గలిగే స్థాయిలో ఆయన పరిశోధన సాగింది. ఫలితంగా మొక్కల పట్ల విశ్వమానవాళి దృష్టి మారింది.
జేసీ బోస్ భారతీయ పునరుజ్జీవన యుగంలో పుట్టిన అపురూపమైన వ్యక్తి. అందుకే పురాతన భారతీయ విజ్ఞానశాస్త్రాన్ని, ఆధునిక పాశ్చాత్య విజ్ఞానశాస్త్రంతో అద్భుతంగా క్రోడీకరించగలిగారు. తండ్రి భగవాన్‌చంద్ర బోస్ బ్రహ్మ సమాజ్ ప్రము ఖుడు. జేసీ బోస్ పుట్టిన మున్షీగంజ్ ప్రస్తుతం బంగ్లా దేశ్‌లో ఉంది. ఆంగ్ల మాధ్యమం ఉన్న పాఠశాలలో మాత్రమే పిల్లలను చదివించడం కులీన కుటుంబా లలో ఒక రివాజుగా ఉన్న ఆ కాలంలోను ప్రభుత్వోన్న తోద్యోగి అయిన భగవాన్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలకు పంపి, బెంగాలీ మాధ్యమంతోనే చదివించారు. జాలరి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాలుడు, తన ఇంట్లోనే పనిచేసే ముస్లిం నౌకరు కొడుకు బోస్‌కు ఆ పాఠశాలలో సహాధ్యాయులు. వారి ద్వారానే తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు బోస్. వైద్యశాస్త్రం చదవడానికి లండన్ వెళ్లినా, కేంబ్రిడ్జ్‌లో నేచురల్ సైన్స్ చదివారు. ఆ కాలంలోనే ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో చదువుతున్న ప్రఫుల్లచంద్రరేతో పరిచయం ఏర్పడింది. తరువాత ఆ ఇద్దరు కలకత్తా వచ్చి ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. ఇద్దరూ గొప్ప జాతీయ వాదులు. వలస దేశంలో పరిశోధనకు తగిన మౌలిక సౌకర్యాల కోసం, వలస పాలకుల వివక్షతో వారిద్దరూ ఏకకాలంలో పోరాడవలసి వచ్చింది.
శాస్త్రవేత్తగా జేసీ బోస్ జీవితంలో రెండు పార్శ్వాలు ప్రముఖమైనవి. ఒకటి రేడియో భౌతిక శాస్త్రం, రెండు వృక్ష ఇంద్రియ విజ్ఞానశాస్త్రం. ఈ రెండో దశలోనే సిస్టర్ నివేదిత బోస్ సన్నిహితు రాలయ్యారు. నివేదిత స్వయంగా శాస్త్రవేత్త కాదు. అయినా పరిశోధక పత్రాలు, గ్రంథాల రచనలో బోస్‌కు ఎంతో సహకరించారు. ఆమెను బోస్ శాస్త్రీయ ఆత్మబంధువు అని శ్లాఘించేవారు. విద్యార్థి దశలో పీసీ రే, నివేదిత ద్వారా స్వామి వివేకానంద, సాహిత్య అభిరుచితో రవీంద్ర కవీంద్రుడు జేసీ బోస్‌కు వివిధ దశలలో ఆత్మీయులయ్యారు. బోస్ పరిశోధనలలో భారతీయ వైజ్ఞానిక స్ఫూర్తిని దర్శించారు రవీంద్రనాథ్ టాగోర్. అలాగే, ‘విజ్ఞాన శాస్త్రం అంటే బాహ్య ప్రపంచంలోని సత్యాన్ని దర్శించడానికి సాగించే అన్వేషణ. ఆధ్యాత్మిక చింతన అంటే అంతర్లోకాలలోని సత్యాన్ని పరిశోధించేది’ అని నిర్వచించిన వివేకానందులూ ఆయనకు మార్గదర్శకు డయ్యారు. మొదట వివేకానందుడు, రామకృష్ణ పరమహంసలతో ఆలోచనల పట్ల వైమనస్యం ఉన్న బోస్, సోదరి నివేదిత కారణంగా వివేకానందులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఒక క్లిష్ట చారిత్రక సంధ్యలో ఇద్దరు భరతమాత ముద్దుబిడ్డలు కలసి నడవడం అవసరమని నివేదిత భావించిన ఫలిత మది. ఇక విశ్వకవి అన్న మాట ఎంత గొప్పది! ‘వనసీమలలో చెట్లు సమృద్ధిగా పండుటాకులను రాలుస్తాయి. వాటితోనే మట్టిపొరలు సారవంత మవుతాయి. అలాగే ఏ దేశంలో అయితే శాస్త్ర పరిశోధన నిరంతరం జరుగుతుందో, జ్ఞానతృష్ణ రగులుతూ ఉంటుందో అక్కడ అవి పరిఢవిల్లుతాయి. మనిషి హృదయమనే నేల వాటితోనే సారవంత మవుతుంది’ అన్నారాయన. ఏ తరమైనా గుర్తుంచు కోవలసిన మాట.
బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విశేషణానికి నిలువెత్తు రూపం జేసీ బోస్. ఆయన జీవశాస్త్రవేత్త, వృక్షశాస్త్రవేత్త, భౌతికశాస్త్రవేత్త, అలాగే సైన్స్ ఫిక్షన్‌లో తొలి భారతీయ రచయితగా కూడా పేర్గాంచారు. రేడియో తరంగ పరిశోధనలో, అభివృద్ధిలో ఆయన పాత్ర అమోఘమైనది. న్యూయార్క్‌కు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ సంస్థ ఆయనను రేడియో విజ్ఞానశాస్త్ర పితామహుడు అని శ్లాగించింది. క్రెస్కోగ్రాఫ్ అనే యంత్రాన్ని ఆయనే కనుగొన్నారు. ఇది మొక్కల కణాలలో వచ్చే సున్నితమైన స్పందనలను నమోదు చేస్తుంది.
మొక్కలకీ ప్రాణం ఉందని చెప్పడం, వాటికీ అనుభూతులూ, బాధ పడడం ఉంటుందని చెబితే దానిని మత దృష్టిగా, ఇంకొకమాటలో చెప్పాలంటే మూఢ నమ్మకమని చెప్పడానికి చాలామందే ఉండేవారు. అసలు విజ్ఞానశాస్త్రం అభివృద్ధికి కొన్ని మతాలలోని మౌఢ్యం తీవ్ర అంతరాయమే కలిగిం చింది. క్రైస్తవం, ఇస్లాం అదే చేశాయి. విజ్ఞానశాస్త్రం మతంతో పాశ్చాత్య దేశాలలో పెద్ద యుద్ధమే చేయవలసి వచ్చింది. భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని టెలిస్కోప్ సాయంతో గెలిలియో చెప్పాడు. కానీ తాను చెప్పినది తప్పని మత గురువు ఎదుట మోకాళ్ల మీద నిలిచి క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నందుకు చార్లెస్ డార్విన్ ఎదుర్కొన్న ప్రతిఘటన కూడా తక్కువదేమీ కాదు. ఈ ఇద్దరు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు తమ ఆవిష్కరణలకు బలమైన రుజువులు ఉన్నప్పటికీ మతపెద్దల ముందు మోకరిల్లవలసి వచ్చింది. ఆఖరికి సాటి శాస్త్రవేత్తలు కూడా మత పెద్దలతో కలసి వీరిని ఇబ్బంది పెట్టిన వారిగానే చరిత్రకు ఎక్కారు. అలా అని మతం చెప్పిన ప్రతి విషయం అశాస్త్రీయమని ఎవరూ వాదించరు.
హిందూ జీవన విధానంలో వేదాలు, ఉపనిషత్తు లలో చెప్పిన కొన్ని ఖగోళశాస్త్ర అంశాలను దాటి ఆర్యభట్టు వంటి వారు విశ్లేషించారు. ఆవిష్కరణలు చేశారు. వీరి మీద మత విరోధులనీ, దైవ ద్వేషులనీ ముద్ర పడలేదు. ఈ నేపథ్యంలోనే జేసీ బోస్ పరిశోధనకూ, ఆయన పెరిగిన కాలానికీ, ఆయన కుటుంబ నేపథ్యం, అందులో విశ్వాసాలకీ మధ్య ఉన్న బంధాన్ని చూడడం అవసరం. జేసీ బోస్ వృక్ష శాస్త్రంలో ఎన్ని శిఖరాలను అధిరోహించారో, రేడియో తరంగాల పరిశోధనలో కూడా అన్ని లోతులను తరచి చూశారు.
జేసీ బోస్ ఆప్తమిత్రుడు మహాకవి రవీంద్ర కవీంద్రుడు, ‘బోస్ పరిశోధనలో తనకు భారతీయ వైజ్ఞానిక స్ఫూర్తి దర్శనమిస్తూ ఉంటుంది’ అన్నారు. భారత జాతీయ సంస్కృతి, వారసత్వం, జాతి గౌరవం అందులో ప్రతిబింబిస్తూ ఉంటాయని అన్నారు. విశ్వమానవాళిలో బోస్ ఏకత్వాన్ని చూస్తున్నారంటే అందుకు ఉపనిషత్తుల మీద ఆయనకు ఉన్న అభినివేశమే కారణమని కూడా ఒక సందర్భంలో టాగూర్ అభివర్ణించారు. బోస్ గురించి కల్పన అనే పత్రికలో రాసిన కవితలో ఇలా చెప్పారాయన.
ఓ నా స్నేహితుడా!
సింధునదికి సుదూరంగా ఉన్న
ఆ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్ర దేవాలయం నుంచి
నీవు జయమాలతో వచ్చావు
కుంగిపోయి జాలిగొలుపుతున్న మన పేద తల్లి
కంఠసీమను ఆ మాలతో అలంకరించావు.
ఆ పేద అమ్మ ఈ అనామక కవితో
ఇవాళ ఆనంద బాష్పాలనే మాటలను
నీకు ఆశీస్సులుగా పంపించింది.
రవీంద్రనాథ్ టాగోర్‌కు నవంబర్ 29, 1901న జేసీ బోస్ రాసిన లేఖలో జాతి గౌరవాన్ని పునరుద్ధ రించడానికి ఒక శాస్త్రవేత్తగా తన బాధ్యతలేమిటో ప్రకటించారు.‘భూమాత ప్రసాదించిన జీవశక్తితోనే నేను జీవించి ఉన్నాను. నా దేశ ప్రజలు ప్రేమతో అందించిన సాయంతోనే నేను వృద్ధిలోకి వచ్చాను. లక్షలాది ప్రజలు జీవితాలను వెచ్చించి చేసిన త్యాగాలతో భారతీయ జ్ఞానజ్యోతి యుగాల నుంచి అఖండంగా వెలుగుతోంది. ఆ జ్వాలలోని చిన్న అగ్నికణం నా ద్వారా ఇప్పుడు దేశానికి చేరింది’ అన్నారు. అంటే తన ప్రాచీన శాస్త్రవిజ్ఞానానికి మళ్లీ ఊపిరులూదవలసిన బాధ్యత తన మీద ఉందని ఆయన వెల్లడించారు.
రేడియో తరంగాల మీద పరిశోధన చేసిన జగదీశ్‌చంద్ర బోస్ శంఖారావం ప్రత్యేకతపైన కూడా విశేష ప్రయోగాలు చేశారు. శంఖారావంతో ప్రతికూలత తొలగిపోతుందని ఆయన రుజువు చేశారు. అలాగే శంనాదంతో ప్రశాంత వాతా వరణం నెలకొంటుంది. పరిమిత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు అన్న ఆయన సిద్ధాంతాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు దారి మళ్లించారు. వైర్‌లెస్ రేడియోను కనుగొన్న ఘనత అలా వాళ్ల ఖాతాలో జమయింది. బోస్ పరిమిత ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలను తీసుకోవడానికి కారణం ఉంది. అసలు ఎలక్ట్రో మ్యాగ్నిటిక్ రేడియేషన్ అన్న ఆలోచన జేమ్స్ మ్యాక్స్‌వెల్ అనే శాస్త్రవేత్తది. కానీ దానిని ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించలేదు. జర్మన్ శాస్త్రవేత్త హెన్రిక్ హెర్ట్ 1886-1888 మధ్య ఇదే అంశం మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ఎలక్ట్రో మాగ్నిటిక్ తరంగాల ఉనికి ఈ ఖగోళంలో వాస్తవమని నిరూపించాడు. హెర్ట్ ప్రయోగాల గురించి అలీవర్ లాడ్జ్ రాసిన పుస్తకం మాత్రం బోస్ చదివారు. అందుకే దీర్ఘ తరంగాలతో ఉన్న సమస్యను ముందే గుర్తించారు. మిల్లీమీటర్ పరిమిత తరంగాలను ఎంచుకున్నారు. ఆపై 1894లో కలకత్తా టౌన్ హాలులో మైక్రోవేవ్స్ ప్రయోగం జరిపి చూపారు. తన పరిశోధన గురించి రెండు పత్రాలు కూడా ప్రచురించారు. ఈ పరిణామం మొత్తం, అందులోని నిజాలు 1997 వరకు వెలుగు చూడలేదు. ట్రాన్స్ అట్లాంటిక్ వైర్‌లెస్ సంకేతాలు అందుకోవడానికి (డిసెంబర్ 12, 1901) గుగ్లీల్మో మార్కొని వాడిన కొహెరర్ పరికరం బోస్ కనుగొన్నదే నని ప్రపంచ శాస్త్రవేత్తలు అంగీకరించారు. బోస్ 1899లోనే లండన్‌లోని రాయల్ ఇనిస్టిట్యూట్‌లో ప్రదర్శించి చూపించినది ఆ పరికరం మాతృకనే. మార్కొని దానికి కొంత మెరుగైన పరికరాన్ని మాత్రమే రూపొందించాడు. దాని మీద ఆయనకే పేటెంట్ హక్కులు కూడా నమోదైనాయి. బోస్ తన ఆవిష్క రణను ప్రదర్శించినప్పుడే ఆ పరికరాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికీ, వినియోగంలోకి తేవడానికీ తమకు అవకాశం ఇవ్వాలని చాలా సంస్థలు అభ్యర్థించాయి. తన ఆవిష్కరణను వాణిజ్య వస్తువుగా మార్చడానికి ఆయన అంగీకరించలేక పోయారు. ఆ పరికరం మీద పేటెంట్ హక్కులు కూడా ఆయన ప్రకటించుకోలేదు. ఈ అంశాలను 20 శతాబ్దంలో బోస్ చరిత్ర రాసిన పలువురు కూడా నమోదు చేశారు. రుషితుల్యులైన పురాతన భారత శాస్త్రవేత్తల బాటలోనే ఆయన తన ఆవిష్కరణల మీద హక్కులు ప్రకటించుకోలేదని అర్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని పరిమితం చేయడం లేదా సంకెళ్లలో ఉంచడం సరికాదు, దానిని అందరికి అందుబాటులో ఉంచాలి అని మనసా వాచా నమ్మారు బోస్. మొక్కలకు సంబంధించి బోస్ పరిశోధనలన్నీ ప్రధానంగా మిమోసా పుడికా (అత్తిపత్తి), డెస్మోడి యమ్ గైరాన్స్ (డ్యాన్సింగ్ గ్రాస్)ల మీద నిర్వహిం చారు. జీవభౌతిక శాస్త్రానికి ఆయన చేసిన సేవలన్నీ ఎలక్ట్రికల్ నేచర్‌కు సంబంధించినవి. పలాతక్ తుపాన్ పేరుతో ఆయన వెలువరించిన కథా సంకలనం తొలి సైన్స్ ఫిక్షన్‌గా పేర్గాంచింది.
విజ్ఞానశాస్త్రం పాశ్చాత్య సంపద లేదా సృష్టి కాదు. అది ప్రధానంగా ప్రాచ్య దేశాలది. అలాగే ఇప్పుడు విశ్వ మానవాళిది అని జేసీ బోస్ అభిప్రాయం. ఈ వాదన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి మానవతను అద్దింది. రెస్పాన్స్ ఇన్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ (1902) అన్న పుస్తకాన్ని ‘ఏకం సత్, విప్రా బహుదా వదంతి’ అన్న రుగ్వేద సూక్తితో బోస్ ప్రారంభించడంలోని అంతరార్థం ఇదేనని చెబుతారు. చలన, చలన రహిత ప్రపంచాలు రెండూ వేర్వేరు కాదని ఆయన చెప్పిన ఈ సిద్ధాంతం ప్రాచీన భారతీయులు చెప్పిన సిద్ధాంతమేనని చెబుతారు. పురాతన భారత ఆధ్యాత్మిక చింతనలోని విజ్ఞతను విజ్ఞానశాస్త్రంలోకి తెచ్చినవారు బోస్. కానీ ఆయన ఆవిష్కరణలన్నీ నిజమని తరువాత రుజువైంది. ఆయన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి కేవలం అనుసరించే ప్రయత్నం చేయలేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఆవిష్కరణలు చేసే సామర్థ్యం భారతీయు లకు ఉందని నిరూపించడమే ఆయన ధ్యేయంగా కనిపిస్తుంది. విశ్వాసానికీ, విజ్ఞానానికీ మధ్య ఉన్నది దూరం కాదని, నాగరికతలో అవి రెండూ సమాంతరంగా సాగుతాయని నమ్మారు.
జాగృతి సౌజన్యంతో…