Home News ఒక ఋషి అస్తమయం

ఒక ఋషి అస్తమయం

0
SHARE

ప్రముఖ మానసిక వైద్యులు, జ్యేష్ట సంఘ్ కార్యకర్త డా. పి.టి. చంద్రమౌళి ఈ రోజు (వైకుంఠ ఏకాదశి) తెల్లవారు ఝామున భాగ్యనగర్ లో స్వర్గస్తులయ్యారు. వారి మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్కార్యవాహ మాననీయ శ్రీ భాగయ్య గారు నివాళి అర్పిస్తూ చంద్రమౌళి గారి జీవితం సంఘ్ సమర్పితమన్నారు. ఒక ఋషి అస్తమించారని, అధ్యాత్మిక యోగి భౌతికంగా మన మద్య నుండి వెళ్లి పోయారని అన్నారు.

ఆయనకు 92 సంవత్సరాలు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థలో సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. ఆ సంస్థలో మానసిక వైద్యంపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ లు ప్రారంభించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి సమయాన్ని సమాజ సేవకే వెచ్చించారు.

భారతీయ మానసిక వైద్య సంస్థ (FIPS) ఫెలో అయిన డా. చంద్రమౌళి ఆ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ కు సంస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు.

చిత్తూరు జిల్లాలో సాధారణ కుటుంబంలో జన్మించిన డా. చంద్రమౌళి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన తండ్రిగారైన శ్రీ. కె. తిరువెంగడం ప్రముఖ పండితులు, హరికథ భాగవతార్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడే డా. చంద్ర మౌళి మానసిక వైద్యంలో డిప్లమా చేశారు. ఆ తరువాత బెంగళూర్ లోని జాతీయ మానసిక చికిత్స సంస్థలో డాక్టర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆయన వైద్యుల జాతీయ సంస్థ కు రెండు పర్యాయాలు అఖిల భారత అధ్యక్షుడుగా వ్యవహరించారు.
యువకుడుగా ఉన్నప్పటినుంచి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న డా. చంద్రమౌళి డాక్టర్ గా కూడా పేదలకు ఎంతో సేవ చేశారు. రామకృష్ణా మిషన్, సత్యసాయి సేవ సమితి వంటి సంస్థలకు విరివిగా విరాళాలు ఇచ్చారు. సంఘ్ కార్యం ఆయనకు చాలా ఇష్టమైనది. సంఘ్ ద్వారా దేశ సేవ చేయడానికి ఎప్పుడు ఆయన ముందుండేవారు. ఎమర్జెన్సీకి ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరిన ఆయన ఆ తరువాత చురుకైన కార్యకర్తగా పనిచేశారు.


సంఘలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన డా. చంద్రమౌళి దాదాపు రెండు దశాబ్దాలపాటు భాగ్యనగర్ విభాగ్ సంఘచాలక్ గా పనిచేశారు. వివిధ అంశాలపై విస్తృతమైన, లోతైన జ్ఞానం కలిగిన డా. చంద్రమౌళికి హిందూ సంస్కృతి చాలా ఇష్టమైన అంశం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం, నాటకం ఆయన అధ్యయనం చేశారు.

ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులు ముగ్గురు వివిధ రంగాల్లో ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. అంత్యక్రియలు జనవరి 8 మధ్యాహ్నం జరుగుతాయి.