Home News పరాక్రమ స్వభావంతోనే పూర్తిగా స్వతంత్రులం అవుతాం: మోహన్‌ భగవత్‌ జీ

పరాక్రమ స్వభావంతోనే పూర్తిగా స్వతంత్రులం అవుతాం: మోహన్‌ భగవత్‌ జీ

0
SHARE

హిందువుల్లో ఏర్పడ్డ ఆత్మవిస్మృతి కారణంగా మనం ఎవరో పూర్తిగా మరిచిపోయామని, దీనిపై స్పష్టతను కూడా కోల్పోయామని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్ సంఘ్ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. అనేక సార్లు విదేశీయుల దండయాత్రల కారణంగా బానిస మనస్తత్వం ఏర్పడిరదని, ఇది మన ఆలోచనలపై పదే పదే ప్రభావం చూపిస్తోందని అన్నారు. దీంతో ఆలోచనల్లో స్పష్టత లోపిస్తోందని, ఆత్మవిశ్వాసం కూడా ఘోరంగా పడిపోతోందని అన్నారు. బానిస మనస్తత్వం కారణంగా సమాజంలో భేదభావాలు, స్వార్థం బాగా వ్యాపించిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో అందరూ మేల్కొని, మనమెవరమో స్పష్టంగా తెలుసుకొని, హిందువులమని గర్వంగా ప్రకటించుకోవాలని అన్నారు. మరాఠీ వీక్లీ ‘‘వివేక్‌’’ ప్రచురించిన ‘‘హిందూ రాష్ట్ర కే జీవనోద్దేశ్య్ కీ క్రమబద్ధ అభివ్యక్తి – రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్’’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోహన్‌ భాగవత్‌ జీ ప్రసంగించారు.

ఈ పుస్తకాన్ని ఆకళింపు చేసుకుంటే.. ఆరెస్సెస్‌ అనేది లైఫ్‌ మిషన్‌ ఆఫ్‌ హిందూ నేషన్‌, ఓ పరిణామం అని తెలుస్తుందన్నారు. ఈ పుస్తకంలో కేవలం సంఘ్ ఆలోచనలు, విస్తరణతో పాటు సంఘ్ కార్యకర్తల జీవనశైలి కూడా తెలుస్తుందని, దీని ద్వారా సంఘ్ అంటే ఏమిటో పూర్తిగా అర్థమవుతుందన్నారు. నేడు భారత దేశంలో చాలా మార్పులు సంభవించాయని, విదేశాల్లోని ప్రముఖులు భావిస్తున్నారని, ఈ మార్పుల వెనుక సంఘ్ ఉందని కూడా వారు అనుకుంటారని పేర్కొన్నారు. అలా వారందరూ ఎందుకు విశ్వసిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలన్నారు. సమాజంలో సంఘ్ పట్ల ఆసక్తి బాగా పెరిగిందని, తాము కూడా స్వయంసేవకులు కావాలని చాలా ఉత్తరాలు వస్తున్నాయన్నారు. సంఘ్ వెబ్‌సైట్‌‌ను కూడా సందర్శిస్తున్నారని తెలిపారు. అలాంటి కొత్తవారికి, స్వయంసేవకులకు కూడా ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని అన్నారు.

సంఘ్ స్థాపన 1925లో జరిగిందని, ఇప్పుడు 2024 సంవత్సరం నడుస్తోందని, ఈ మధ్య కాలంలో సంఘ్ చాలా గడ్డు పరిస్థితులను అనుభవించిందని తెలిపారు. స్వయం సేవకుల ఖర్చులు వెళ్లడానికి కూడా చాలా కష్టతరమైందన్నారు. ఆ రోజుల్లో సంఘ్ ప్రశంసించే రోజులు కూడా కావని, అలాంటి పరిస్థితుల నుంచి సంఘ్ ఇప్పుడు బాగా సౌలభ్యం స్థాయికి చేరుకుందని, అభివృద్ధి కూడా చెందిందని గుర్తు చేశారు. అనుభవజ్ఞులైన వారు ఎత్తుపల్లాలను ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఈ ఎత్తుపల్లాల నుంచే వీరు దారులను నిర్మించుకుంటారని, ఈ సమయంలో అత్యంత చైతన్యవంతులుగా వుంటారన్నారు. వెయ్యి సంవత్సరాల నుంచి దేశంలో అనేక మంది మహాపురుషులు సమర్పిత భావం, నిస్వార్థ సేవతో సేవలు చేశారని, అయినా… పూర్తిగా సఫలం కాలేకపోయామని గుర్తు చేశారు. పరాక్రమ స్వభావం వల్లే పూర్తిగా స్వతంత్రులం అవుతామని తెలిపారు. మనలో వున్న విభేదాల కారణంగా, తప్పుల కారణంగా విదేశీయులకు విజయం చేకూరిందని, ప్రాథమికంగా ఇదో వ్యాధి అని అన్నారు. ఇది పరిష్కారం అయ్యేవరకూ ఇబ్బందులు తప్పవని మోహన్‌ భాగవత్‌ జీ అన్నారు.