Home News అసామాన్యులకే పట్టం… సామాన్యులకే ‘పద్మ పురస్కారాలు’

అసామాన్యులకే పట్టం… సామాన్యులకే ‘పద్మ పురస్కారాలు’

0
SHARE

ఇన్నాళ్లూ పద్మ అవార్డులంటే పైరవీల నిచ్చెనలెక్కి, రికమెండేషన్ల సందుల్లో దూరి, భజన దారుల్లో, భజంత్రీ బాటల్లో ఎలాగోలా ఆ పతకాన్ని సంపాదించుకోవడం. ఏలినవారి కృపాకటాక్ష వీక్షణాల కోసం పడరాని పాట్లు పడటం. అందుకే ప్రతిసారీ పద్మ అవార్డులు రాగానే వివాదాలూ మొదలయ్యేవి. దానితో నిజంగా అర్హులైన వారు కూడా ఏదో తప్పు చేసినట్టు ఫీలయ్యేవారు. నలుగురు ఆటగాళ్లు, ముగ్గురు కళాకారులు, ఆరడజను సినిమా వాళ్లు… ఇలా సాగేది పద్మ అవార్డుల కోటా.

కానీ ఇప్పుడు రికమండేష్లన్ల యుగం అంతమై పోయింది. ప్రతిభ, సేవ, తపస్సు, జీవన సాఫల్యాలకు గుర్తింపునిచ్చే యుగం మొదలైంది. మట్టిలో మాణిక్యాల్లా, ప్రచారానికి దూరంగా, పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా ఉండే వారిని ఏరి ఏరి వారికి అవార్డులనివ్వడం మొదలైంది. గతేడాది పద్మ అవార్డులతో మొదలైన ఈ ప్రక్రియ ఈ ఏడాది మరింత దృఢంగా, మరింత నిక్కచ్చిగా సాగింది. అందుకే ఈసారి పద్మ అవార్డుల్లో తళుకుతారల జిలుగు వెలుగులు లేవు. అట్టడుగు స్థాయిలో సేవలందించి, తపించి, తరిస్తున్న యోగులున్నారు. ఆజీవన యజ్ఞంగా సమాజ సేవలను కొనసాగిస్తున్న వారున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం.

ప్రధానమంత్రి మోది గత మూడేళ్లలో పద్మ అవార్డుల నామినేషన్‌ ప్రక్రియను మార్చేశారు. చాలా పారదర్శకతను తీసుకువచ్చారు. ఏ సాధారణ పౌరుడైనా పద్మ అవార్డులకు వ్యక్తులను నామినేట్‌ చేయవచ్చు. ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల కూడా పరిస్థితిలో మార్పు వచ్చింది.

ఈ సంవత్సరం పద్మ విభూషణ్‌ పొందిన వారిలో పుంభావ సంగీత సరస్వతి ఇళయ రాజా, సుప్రసిద్ధ మేధావి, జాతీయవాది, రచయిత పి.పరమేశ్వరన్‌, సుప్రసిద్ధ హిందుస్తానీ సంస్కృత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్‌లు ఉన్నారు.

పి.పరమేశ్వరన్‌ భారతీయ విచార కేంద్రం పేరిట కేరళలో భావ విప్లవానికి, జాతీయ ఆలోచనా విధాన వ్యాప్తికి ఆద్యులయ్యారు. దీనదయాళ్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఆయన చాలా కాలం పనిచేశారు. సంఘ ప్రచారక్‌ అయిన పరమేశ్వరన్‌జీని ఆయన రాజకీయ, సైద్ధాంతిక విరోధులు సైతం గౌరవిస్తారు. పలు తరాల స్వయంసేవకులకు, జాతీయవాదులకు ఆయన మార్గదర్శకులు.

ఇళయ రాజా అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరుకున్న మహనీయుడు. అత్యంత సరళ జీవనం, అనునిత్య సంగీత సాధన ఆయన ప్రత్యేకతలు.

ఇక పద్మ భూషణ్‌ పొందిన వారిలో క్రీడాకారుడు పంకజ్‌ అడ్వాణీ, ఫిలిపోస్‌ ఆర్‌ క్రిసోస్తోమ్‌, క్రికెట్‌ క్రీడాకారుడు ఎం.ఎస్‌.ధోనీ, అలెగ్జాండర్‌ కడాకిన్‌, ఆర్‌.నాగస్వామి, వేదప్రకాశ్‌ నందా, అరవింద్‌ పారిఖ్‌, శారదా సిన్హాలు ఉన్నారు.

ఆర్‌.నాగస్వామి సుప్రసిద్ధ ఆర్కియాలజిస్టు. తమిళనాడులో అనేకానేక కట్టడాలను వెలుగులోకి తెచ్చిన మహాపరిశోధకుడు. అయోధ్య కేసులో ఆయన అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌లో 26 సార్లు సాక్ష్యం ఇచ్చారు.

ఛత్తీస్‌ఘఢ్‌లోని కాత్రే నగర్‌లో భారతీయ కుష్టు నివారణ సంఘ్‌ కార్యకర్తగా దశాబ్దాల తరబడి కుష్టు రోగులకు సేవలందిస్తున్న వయోవృద్ధ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రచారక్‌ దామోదర్‌ గణేశ్‌ బాపట్‌కు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. దశాబ్దాల తరబడి ఆయన అపూర్వమైన సేవలను అందిస్తూ వస్తున్నారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఆయన నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు.

పద్మశ్రీ పొందిన వారిలో తమిళనాడుకు చెందిన రాజగోపాల్‌ వాసుదేవన్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం చేపట్టడంలో అగ్రగణ్యులు. అబ్దుల్‌ కలామ్‌ ప్రేరణతో ఆయన ఈ పనిని చేపపట్టారు. తమిళనాట పలు రోడ్లను ఆయన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించి, వ్యర్థాల నిర్వహణలో కొత్త బాటలు వేశారు.

ఇక తమిళనాడుకే చెందిన 98 ఏళ్ల నానమ్మాళ్‌ నేటికి యోగా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. దేశమంతటా వెయ్యికి పైగా యోగా టీచర్లను ఆమె తయారు చేశారు. ఈ వయసులోనూ నిత్యం యోగాసనాలు వేయడమే కాక, రోజుకు ఆరువందల మందికి శిక్షణనిస్తారు.

కేరళకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ కుట్టి పాము కాటుకు, తేలు కాటుకు ఉచితంగా మందు వేస్తారు. వేలాది మందికి తన మూలికా వైద్యంతో చికిత్స చేస్తారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో ఒక చిన్న పూరి గుడిసెలో ఆమె నివసిస్తున్నారు.

ఐఐటీలో చదువుకున్నా గ్రామీణ పేదలకు చదువు చెప్పడం కోసమే జీవితాన్ని వెచ్చిస్తున్న అరవింద్‌ గుప్తకు కూడా పద్మశ్రీని ప్రకటించారు. ఆయన దాదాపు మూడు వేల స్కూళ్లలో సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహిస్తు న్నారు. దాదాపు 6000 కు పైగా షార్ట్‌ ఫిల్ములు తీసి గ్రామీణ ప్రాంతాల్లో సైన్సును ప్రచారం చేస్తున్నారు.

బెంగాల్‌కు చెందిన 99 ఏళ్ల సుధాంశు బిస్వాస్‌ స్కూళ్లు, అనాథాలయాల ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. గ్రామీణులకు వైద్య సేవలందించే ఎం.ఆర్‌. రాజగోపాల్‌, 1965 యుద్ధంలో వికలాంగుడైనా పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మురళీకాంత్‌ పేట్కర్‌, ఇళ్లలో పాచిపని చేస్తూ, దినసరి కూలీగా పనిచేస్తూ పేదలకు ఒక ఆస్పత్రిని కట్టించిన సుభాషిణీ మిస్త్రీ, కర్నాటకలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఉచితంగా పురుళ్లు పోస్తున్న తొంభై ఏళ్ల దినసరి కూలీ సులగట్టి నరసమ్మ, గ్రామీళ కళలకు సేవ చేస్తున్న విజయలక్ష్మి నవనీత కృష్ణన్‌, నక్సల్‌ ప్రభావిత గఢ్‌చిరోలీలో వైద్య సేవలందిస్తున్న రాణి బంగ్‌, అభయ బంక్‌, తలసేమియా పేషంట్లకు సేవలందించే మహారాష్ట్ర వైద్యుడు సంపత్‌రామ్‌ టేకే, తక్కువ ఖర్చుతో 30 దేశాల పేదలకు కాటరాక్ట్‌ చికిత్స చేస్తున్న నేపాలీ వైద్యుడు సందుక్‌ రుయిత్‌, భగవద్గీతను ఉర్దూలోకి అనువదించిన అన్వర్‌ జలాల్‌ పురీ, దేవదాసీల అభివద్ధి కోసం కృషి చేస్తున్న సీతవ్వ జోద్దాతి, సౌదీ అరేబియాలో యోగా ప్రచారానికి కషి చేస్తున్న నౌఫ్‌ మార్వాయిలకు కూడా పద్మశ్రీ ఇవ్వడం నిజంగా వారు చేస్తున్న కషికి గుర్తింపు నివ్వడమే.

పద్మ అవార్డులలో మరో ప్రత్యేకత ఏమిటంటే మామూలుగా ఉపేక్షకు గురయ్యే ఈశాన్య రాష్ట్రాలకు ఈ సారి పెద్దపీట వేశారు. అసొం ట్రిబ్యూన్‌ సంపాదకుడు ప్రఫుల్ల గోవింద బరువా, మణిపూర్‌కి చెందిన మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ సైఖోమ్‌ మీరాబాయి చాను, రచయిత అరూప్‌ కుమార్‌ దత్త, నాగా గిరిజనులకు సేవ చేస్తున్న నాగా వనిత లెంటినా ఆవో ఠక్కర్‌, త్రిపుర టెన్నిస్‌ క్రీడాకారుడు సోమ్‌ దేవ్‌ దేవ వర్మన్‌, మణిపూర్‌కు చెందిన చేనేత కళాకారిణి లాంగ్‌ పోక్లాక్‌ పామ్‌ సుబదని దేవి, నాగాలాండ్‌లోని ఉపాధ్యాయుడు పియాంగ్‌ టెంజెన్‌ జామిర్‌, మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్‌ మహంత భార్య, ప్రముఖ రచయిత్రి జయశ్రీ గోస్వామి మహంతలకు పద్మశ్రీ ఇవ్వడం గమనార్హం.

అంతే కాదు. ఆసియాన్‌ దేశాలకు చెందిన ప్రముఖులకు కూడా పద్మశ్రీలు ఇవ్వడం ప్రభుత్వ దూరదష్టిని తెలియచేస్తోంది. బుర్‌యెయి చెంఇన హాజీ అబ్దుల్లా బిన్‌ మలాయ్‌ హాజీ ఉస్మాన్‌, ఇండోనేషియాకి చెందిన న్యోమన్‌ నువార్టా, లావోస్‌కి చెందిన బౌన్‌ లాప్‌ కెవకాంగా, మయన్మార్‌కి చెందిన థాంట్‌ మింట్‌ యు, సింగపూర్‌కి చెందిన టోమీ కోహ్‌, థాయ్‌లాండ్‌కి చెందిన సోమదత్‌ ఫ్రా ఆర్య వాంగ్స ఖోట్టావన్‌, వియత్నాంకి చెందిన న్యుయెన్‌ టీన్‌థీన్‌లకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటిం చారు. పద్మశ్రీని ప్రపంచవ్యాప్త దౌత్య సుహద్భావ వ్యాప్తికోసం కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయం.

– సూర్యపుత్ర

(జాగృతి సౌజన్యం తో)