ప్రముఖ పురావస్తు పరిశోధకులు, కుడ్య చిత్రాల అధ్యయనకర్త, ‘సంస్కార భారతి’ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డాక్టర్ శ్రీ విష్ణు శ్రీధర్ వాకంకర్ శతజయంతి ఉత్సవాలు (4 మే– 3 ఏప్రిల్ 1988) శనివారం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగాయి.
సంస్కార భారతి, భారతీయ ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రాచీన నాగరికత ఏర్పడకముందు గీసిన భారతీయ కుడ్య చిత్రాల విశిష్ట, వాటిలో దాగివున్న సాంకేతికత గురించి తెలిపారు. భారతీయ కుడ్య చిత్రాలపై చేసిన అధ్యయనం ద్వారా ప్రాచీన భారతీయ చరిత్ర, జీవన విధానాలపై అవగాహన దిశగా శ్రీ వాకాంకర్ సాగించిన పరిశోధనల కృషి గురించి ఎన్.రామచంద్రరావ్ వివరించారు వివరించారు.
కార్యక్రమంలో ‘భారతీయ ఇతిహాస సంకలన సమితి’ తెలంగాణ రాష్ట్ర అధ్యకులు, ప్రొఫెసర్ శ్రీ వి. కిషన్ రావు ప్రారంభోపన్యాసం చేశారు. వారు మాట్లాడుతూ భారత సంస్కృతికి శ్రీ వకాంకర్ చేసిన సేవల గురించి తెలియజేశారు. వారి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. వాకాంకర్ ప్రపంచ దేశాల్లో సంపాదించిన పేరుప్రతిష్టల గురించి వివరించారు. ఆయన అనుసరించిన నిరాడంబర జీవితం గురించి ఉదాహరణలు ఇచ్చారు.
గౌరవ అతిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి శ్రీ టి. తిరుపతిరావు కార్యక్రమంలో ప్రసంగిస్తూ..వాకాంకర్ దైవత్వం, దైవానుగ్రహం గల గొప్ప వ్యక్తి అని, ఆయన జీవితం గురించి ప్రతిఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా వాకాంకర్ యొక్క వ్యక్తిత్వం, సంస్కారాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు తెలియజేశారు.
ప్రధాన వక్త, ప్రముఖ పాత్రికేయులు శ్రీ రాక సుధాకర్ ప్రసంగిస్తూ.. వాకాంకర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాన్ని తెలియజేశారు. అసోం రాష్ట్రంలో పనిచేస్తున్న సమయంలో ఆ మహానుభావుడితో రెండు రోజులు కలిసి మాట్లాడే అదృష్టాన్ని తాను సంపాదించానని అన్నారు. జీవితంలో నిరాడంబరత, నిస్వార్ధత గల ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని వాకాంకర్ ని దగ్గరి నుండి చూసి నేర్చుకున్నానని అన్నారు. వాకాంకర్ యొక్క పురాతత్వ, చిత్ర నైపుణ్యాల గురించి దగ్గరి నుండి ప్రత్యేకంగా చూసిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సమాజం కోసం ఉపయోగపడని సమయం సమయమే కాదన్న వాకాంకర్ చెప్పిన సూక్తిని ఈ సందర్భంగా రాకా సుధాకర్ ఉదహరించారు. “నేను ఆరెస్సెస్ స్వయంసేవక్ ని.. నాకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సమయంలో ఆరెస్సెస్ మీద దేశంలో నిషేధం ఉంది.. ఇందిరా గాంధీ నుండి నేను పురస్కారం అందుకునే సమయంలో కూడా తలపై ఆరెస్సెస్ టోపీ ధరించి మరీ పురస్కారం అందుకున్నాను” అంటూ వాకాంకర్ తనతో సాగించిన సంభాషణల విషయాలు ఈ సందర్భంగా రాక సుధాకర్ ప్రస్తావించారు.
కార్యక్రమంలో ఉత్సాహవంతులైన కళాశాల విద్యార్థులతో పాటు అనేక మంది పెద్దలు పాల్గొన్నారు.