Home Telugu హైందవ సాంప్రదాయ విలువలు జాతికి చాటిచెప్పిన ప్రపంచ ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజు

హైందవ సాంప్రదాయ విలువలు జాతికి చాటిచెప్పిన ప్రపంచ ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజు

0
SHARE

తెలుగు సాహతీ లోకాన కవిత్రయం ఉన్నట్టే కర్ణాటక సంగీత లోకానికి త్రిమూర్తులూ ఉన్నారు. వారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారు, శ్రీ శ్యామా శాస్త్రుల వారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారు.

నాదోపాసన ద్వారా భగవంతుడిని దర్శించవచ్చన్న విషయాన్ని నిరూపించిన గొప్ప వాగేయకారుడు త్యాగయ్య. శ్రీరామభక్తాగ్రేసరుడైన త్యాగయ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి. భారత జాతికి చిరస్మరణీయుడై, ప్రాచీన హైందవ సాంప్రదాయ విలువలను జాతికి చాటిచెప్పి భారత, భాగవత, రామాయణ కావ్య సారాంశాలను ఔపాసన పట్టి, తన మధుర సంగీత, సాహిత్య రసభావంతో తత్త్వ, భక్తి, వేదాంత, దార్శనిక, శాంతి విషయాలను సమగ్రంగా తన కృతుల ద్వారా లోకానికి తెలియపరిచారు.

“సంగీత జ్ఞానము వినా.. సన్మార్గము గలదె మనసా” (దైవభక్తి లేని సంగీతం పరిమళం లేని పుష్పం వంటిది) అంటూ మానవాళికి బోధించిన శ్రీ త్యాగయ్య పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామానికి చెందినవారు. అనంతరం తమిళనాడుకు వలసవచ్చి స్థిరపడ్డారు. తంజావూరు జిల్లా తిరువారూరులో రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1767 మే 4న జన్మించారు త్యాగరాజు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం. తండ్రి రామబ్రహం తంజావూరు ప్రభువు శరభోజి రాజాస్థానంలో ఉద్యోగం చేసేవారు.

త్యాగరాజు తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో “గిరిరాజసుతా తనయ” అని తన తాతగార్ని స్తుతించారు. త్యాగయ్య విద్య కోసం  రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూరుకు మకాం మార్చారు. త్యాగయ్య గారు అక్కడ సంస్కృతము, వేదవేదాంగములను అమూలాగ్రము అభ్యసించారు. సంగీతాభ్యసము కోసం  త్యాగయ్య శ్రీ శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర చేరారు. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతంలో  ప్రావీణ్యత గమనించి  అత్యంత శ్రద్ధతో సంగీతోపదేశము చేశారు.

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేండ్ల చిరు ప్రాయంలోనే  త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధనకనక వస్తువాహన రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే “నిధి చాల సుఖమా” అనే కీర్తన.

సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా  త్యాగరాజు భావించారు. సంగీతంలోని రాగ, తాళములను తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే చూసారు త్యాగయ్య.

తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందారు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు.

త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఆయనకి సంగీతంలోని రహస్యాలను చెప్పి, “స్వరార్ణవము” ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన “సాధించెనే” అనీ చెపుతారు. ఈ పుస్తకం  వల్ల త్యాగయ్యగారు సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలిసికొన్నట్లు తెలుస్తోంది. శంకరాభరణము లోని “స్వరరాగ సుధారసము” అనే కృతిలో ఈ గ్రంథము గురించి త్యాగయ్య పేర్కొన్నారు. త్యాగయ్య 24000 రచనల వరకు చేశారు . “దివ్యనామ సంకీర్తనలు”, “ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు” అనే  బృంద కీర్తనలు కూడా రచించారు. “ప్రహ్లాద భక్తి విజయము”, నౌకా చరిత్రము అనే  సంగీత నాటకా లు కూడా రచించారు.

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఈయన జన్మదినం రోజుని భారతియ సంగీత దినొత్సవంగా జరుపుతాము. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో  ఆయన సమాధి దగ్గర  త్యాగరాజ మహోత్సవ సభలో  త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

ఆయన భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి చెందింది.  ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.