Home Telugu Articles పాకిస్తాన్ లోని కటాస్‌రాజ్‌లో మళ్లీ శివతాండవం?

పాకిస్తాన్ లోని కటాస్‌రాజ్‌లో మళ్లీ శివతాండవం?

0
SHARE

పాకిస్థాన్‌లోని మైనారిటీ మత వర్గాలు ముఖ్యంగా హిందువులకు సంబంధించి; ఆ దేశ భూభాగాల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగాను ఇస్లామాబాద్ పాలకులు ఇటీవల తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలుచర్యలు ప్రపంచాన్ని విస్మయపరిచాయి. తమ హిందూ పౌరులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో పాక్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అదే సమయంలో లష్కర్ –ఎ– తాయిబా అధినేత మహమ్మద్ సయీద్‌ను ఎటువంటి కారణాలు చూపకుండా, గృహ నిర్బంధంలో ఉంచింది. జమాత్‌ –ఉద్‌–దావా , దాని ధార్మిక వ్యవహారాల విభాగం ఫలా–ఇ–ఇన్సానియత్ కార్యకలాపాలను నిషేధించింది. మైనారిటీ మతస్థుల సంక్షేమం, ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థల విషయంలో పాక్ పాలకులు గతంలో అనుసరించిన విధానాలకు ఈ చర్యలు పూర్తిగా విరుద్ధమైనవి. ‘జాతీయ ప్రయోజనాల దృష్ట్యా’ ఐక్యరాజ్యసమితి తీర్మానం 1267ను అమలుపరచేందుకు గాను సయీద్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్టు పాక్ సైనిక దళాల ప్రజాసంబంధాల విభాగం వివరించింది. అయితే ఈ విషయమై పాక్‌ ప్రభుత్వం పూర్తిగా మౌనం వహించింది.

సరే, రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో సతమతమవుతున్న ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ , పాకిస్థానీ హిందువులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు మరింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి (ఉమ్మడి భారతదేశం నుంచి విడిపోయి, స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్థాన్‌ జనాభాలో హిందువులు 24 శాతం వుండేవారు. ఇప్పుడు 1.5 శాతానికి తగ్గిపోయారు. నిర్బంధ మతమార్పిడి, ఇస్లామిక్‌ ఛాందసవాదుల, సంఘ వ్యతిరేక శక్తుల దాడులు, దౌర్జన్యాల నుంచి బయటపడేందుకు భారత్‌కు, ఇతర దేశాలకు పెద్ద ఎత్తున వలస పోవడం వల్ల పాక్‌లో హిందువుల సంఖ్య తగ్గి పోయింది).

పాక్‌ పంజాబ్‌లో, చక్వాల్‌ జిల్లాలోని కటాస్ గ్రామంలో గల అత్యంత పురాతన కటాస్‌రాజ్‌ మందిర్‌ (శివాలయం)లో మంచినీటి వడపోత కేంద్రం (వాటర్‌ ఫిల్ట్రేషన్‌ ప్లాంట్‌)ను ప్రధాని నవాజ్‌ షరీప్‌ ఇటీవల ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులందరికీ సమాన పౌరసత్వం ఉండాలనే విషయంలో తన విశ్వాసాన్ని పునురుద్ఘాటించారు. మైనారిటీల సంక్షేమానికితమ ప్రభుత్వం కట్టుబడివుంటుందని నవాజ్‌ షరీఫ్‌ హామీ ఇచ్చారు.మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని సహించమని కరడుగట్టిన మతోన్మాదులను ఆయన హెచ్చరించారు.

శివుడు, పాండవులకు అంకితమయిన కటాస్‌రాజ్‌ ఆలయ ప్రస్తావన హిందూ పురాణగాథల్లో కూడా ఉన్నది. తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞం లో తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతి యజ్ఞగుండంలోకి ఆత్మాహుతి చేసుకున్నది. భార్య శాశ్వత ఎడబాటుకు శివుడు కార్చిన కన్నీళ్లు పుష్కర్‌లో(రాజస్థాన్‌లో వున్నది), కటాస్‌లోను పడ్డాయి. ఇప్పుడు పాక్‌ పంజాబ్‌ నడిబొడ్డున వున్న కటాస్‌ గ్రామంలోని పురాతన ఆలయం, దేశ విభజనకు పూర్వం ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విలసిల్లింది. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన ఉత్తర భారతావనికి చెందిన లక్షలాది హిందువులు కటాస్‌రాజ్‌ను విధిగా సందర్శించి భక్తి నిష్ఠలతో పూజలు నిర్వహించేవారు.

ఆలయంలోని పవిత్ర పుష్కరిణి చుట్టూ శివుడు, ఇతర హిందూ దైవాలకు అంకితమైన మందిరాలు వున్నాయి. పాండవులు తమ వన వాస కాలంలో ఈ ఆలయంలోనే బస చేసారని ప్రతీతి. కటాస్‌రాజ్‌ మందిర్ ప్రాంగణంలోనే మహారాజా రంజిత్‌ సింగ్‌ అగ్రశ్రేణి సేనాధిపతులలో ఒకరైన హరిసింగ్‌ నాల్వా నివాస సౌధం శిథిలాలు కూడా ఉన్నాయి. గత ఏడు దశాబ్దాలుగా ముస్లిం మతోన్మాదులు ఈ పురాతన ఆలయాన్ని పూర్తిగా కొల్లగొట్టారు. ఈ ఆలయ పవిత్రత, చారిత్రక ప్రాధాన్యాన్ని పాక్‌ పాలకులూ విస్మరించారు. దీంతో ఆ పురాతన ఆలయం పూర్తిగా ఒక ఊసర క్షేత్రమై పోయింది. హిందువులకు రక్షణ కల్పించి, వారికి న్యాయం సమకూరుస్తామని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఈ కటాస్ రాజ్ ఆలయంలోనే హామీ ఇచ్చారు.

కటాస్‌లో, హిందువుల శ్రేయస్సు పట్ల నవాజ్ షరీఫ్‌ గతంలో ఎన్నడూలేని విధంగా శ్రద్ధ చూపడం ఆకస్మిక పరిణామమేమీ కాదు. గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్‌ ప్రభుత్వం హిందూ వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. దీపావళి, హోలీ పర్వ దినాలను ప్రభుత్వ సెలవులుగా ప్రకటిస్తూ 2016 మార్చి 8న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2015 నవంబర్‌లో దీపావళి పర్వదినం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ హిందువులకు పూర్తి అండదండలనందిస్తామని, హిందువుల పీడకులు ముస్లింలు అయినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందువుల పట్ల పాక్ పాలకులలో సుహృద్భావం గతంలో ఎప్పుడూ ఇంతగా వ్యక్తం కాలేదు. పాక్‌ రాజకీయ, సామాజిక జీవితంలో హిందువులే కాదు, మైనారిటీలు ఎవ్వరూ లెక్కలోకి రారు. పాక్‌ అధికార వ్యవస్థల్లో మైనారిటీలకు ఎటువంటి పలుకుబడి లేదు.

ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చాలాకాలంగా హిందువులు, ఇతర మైనారిటీల విషయంలో విశాల వైఖరితో వ్యవహరిస్తున్నారు. 2016 ఫిబ్రవరిలో ఆయన ప్రభుత్వం గృహ, మానసిక, లైంగిక హింసాకాండను నిరోధించడానికి గాను మహిళా రక్షణ చట్టం నొకదాన్ని ఆమోదించింది. పంజాబ్‌ గవర్నర్‌ సల్మాన్‌ తసీర్ హంతకుడు ముంతాజ్ ఖాద్రికి కోర్టు విధించిన ఉరిశిక్షను నవాజ్ షరీఫ్‌ ప్రభుత్వం ధైర్యంగా అమలుపరిచింది. 2016 డిసెంబర్‌లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అయిన అబ్దస్ సలాం పేరిట ఒక జాతీయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పునఃనామకరణం చేశారు. సలాం, ప్రధాన స్రవంతి ముస్లింలు వెలివేసిన అహ్మదీయ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన స్మృతిని గౌరవించడంలో షరీఫ్‌ చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పరువు హత్యల కేసుల్లో దోషులుగా నిర్ధారితులయిన వారు బాధిత కుటుంబాలు క్షమించాయనే నెపంతో శిక్ష ననుభవించకుండా తప్పించుకోవడానికి వీలు లేకుండా పంజాబ్‌ ప్రభు త్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది (పాక్ జనాభాలో 60 శాతం మంది పంజాబీయులే).

పాకిస్థాన్‌ పాలకుల్లో పరివర్తన నిజంగా చోటుచేసుకొంటుందా? లేక, ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశంగా పాక్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న చెడ్డ పేరును తొలగించడానికే ఇలా మైనారిటీ వర్గాల వారి పట్ల ఎన్నడూలేని విధంగా సుహృద్భావాన్ని చూపుతున్నారా? ఉగ్రవాదం,ఇస్లామిక్ ఛాందసవాదానికి కేంద్రంగా పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం (చైనా మినహా) చూస్తున్న తరుణంలో పైన పేర్కొన్న ‘మార్పులు’ చోటు చేసుకోవడం గమనార్హం.

పౌర సమాజాలకు, ప్రపంచ శాంతికి ఇస్లామిక్ ఛాందసవాదం నుంచి ఎదురవుతున్న ముప్పును ప్రపంచదేశాలు శీఘ్రగతిన అర్థం చేసుకొంటున్నాయి. దీంతో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాకిస్థాన్‌ తీరుతెన్నులు అంతర్జాతీయ సమాజానికి అంతకంతకూ అంగీకార యోగ్యం కావడం లేదు. నిజానికి రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సివుంది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం, ఇస్లామిక్‌ ఛాందసవాదంను సంపూర్ణంగా నిర్మూలించడానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేస్తున్న ప్రయత్నాలు మనఃఫూర్వకంగా చేస్తున్నవేనా? చిత్తశుద్ధితో చేస్తున్నవే అనుకుందాం.

అయితే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులవారని, వారి మధ్య సహజీవనం అసాధ్యమనే సిద్ధాంత భూమికతో ఆవిర్భవించి , తదాది భారత్‌ పట్ల వ్యతిరేకతే మనుగడ మంత్రంగా వున్న పాకిస్తాన్‌లో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇస్లాంను ఔదలదాల్చిన సమాజంలో కాలానుగుణ్యమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకై పాక్‌ పౌరసమాజానికి, ఆ దేశపాలనపై పెత్తనం వహిస్తున్న మిలిటరీ–ముల్లా (సైనికాధికారులు– మతాచార్యులు) కూటమి, పూర్తి స్వేచ్ఛనిస్తుందా? భారత్‌తో పాక్‌ సంబంధాలు మెరుగవ్వాలంటే పాక్‌ సమాజంలో సంస్కరణలు తప్పనిసరి అన్నది విస్మరించలేని వాస్తవం.

ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ పాలనాచరిత్ర తెలిసినవారు, కార్గిల్ యుద్ధం పూర్వాపరాలపై అవగాహన వున్నవారు ఉగ్రవాదం, ఇస్లామిక్ ఛాందసవాదం నిర్మూలనలో ఆయన చిత్తశుద్ధిని తప్పకుండా సందేహిస్తారు. పాకిస్థాన్‌లో ఇస్లామిక్‌ ఛాందసవాదం, ఉగ్రవాదులను ‘వ్యూహాత్మక’ సాధనాలుగా ఉపయోగించుకోవడం, మత,జాతి, భాషాపరమైన మైనారిటీలను పీడించడం మొదలైన వాటికి మూలాలు, ఇస్లామిక్‌ పాకిస్థాన్‌కై పోరాడి, సాధించుకున్న స్వాతంత్ర్య పూర్వ భారతీయ ముస్లిం సమాజంలో అత్యధికులను ప్రేరేపించిన ఆలోచనా ధోరణిలో వున్నాయి. ఒక చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు సుమా!

బల్బీర్ పుంజ్

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)