హైదరాబాద్: ఆధునిక సెల్ ఫోన్ యుగంలో నేటితరం పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇటువంటి పోకడలకు తావు లేకుండా పిల్లల్లో విలువలు నేర్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జీవితాన్ని ఇచ్చి ఉన్నత స్థానాలకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు పాద పూజ చేయించి మాతృవందనం చేయించారు.
హైదరాబాద్ శారదాధామంలోని శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్ స్కూల్ (స్విస్) ప్రాంగణంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి దండ్రులను పిలిపించి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులకు పిల్లలే స్వయంగా కాళ్లు కడిగి పూజలు చేసి పెద్దల పట్ల గౌరవాన్ని చాటుకొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 కు పైగా పాఠశాలలు నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం .. విలువలతో కూడిన విద్యను బోధిస్తూ ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులకు సదాచారం పేరిట ప్రత్యేకంగా సబ్జెక్టును బోధించటం పరిపాటి. చిన్నప్పటి నుంచి భారతీయ విలువలు, సంస్క్రతి, సదాచారం నేర్పించినట్లయితే పెద్దవారయ్యాక అదే స్ఫూర్తితో మెలగుతారన్నది భావన. ఈ క్రమంలోనే స్విస్ ప్రాంగణంలో తల్లిదండ్రులకు పాద పూజ చేసి మాతృవందనం నిర్వహించారు.
ఇదే రీతిన రిటైర్డ్ అధ్యాపకులు, ఆచార్యులకు విద్యాలయం చీఫ్ రంగాచార్య, ప్రిన్సిపాల్ (ఇం) రమాదేవి ఆధ్వర్యంలో పాద పూజ నిర్వహించారు. స్వయంగా ఉపాధ్యాయులే పెద్దలకు పాద పూజ చేయటం, మాతృవందనం చేస్తుండటం పిల్లలను ఆకట్టుకొంది. దీంతో పిల్లలు కూడా ఉత్సాహంగా తల్లిదండ్రులకు పాద పూజ చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో భారతీయ విలువల పట్ల అవగాహన కలుగుతుందని విద్యావేత్తలు సత్యనారాయణ, సూర్యనారాయణ ఆచార్య అభిప్రాయ పడ్డారు. ఆధునిక హంగులతో నెలకొన్న స్విస్ విద్యాలయంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యాలయం చీఫ్ రంగాచార్య, ప్రిన్సిపాల్ (ఇం) రమాదేవిలను అభినందించారు.