
శ్రద్ధాంజలి ఘటించిన పూజ్య సర్ సంఘచాలక్, మాననీయ సర్ కార్యవాహ
పరమశ్రద్ధేయ పెజావర్ స్వామి శ్రీ స్వామి విశ్వేశ్వర తీర్థ వైకుంఠ గమనం మనందరికీ చాలా దుఃఖాన్ని కలిగించే విషయం . దైవీ సంపత్తితో, దేశ, ధర్మ చింతనతో నిరంతర కార్యశీలి అయిన వారి సౌమ్య, శాంతియుత, ప్రసన్న వ్యక్తిత్వం కార్యకర్తలమైన మనకందరికీ ఎంతో అండగా ఉంది. ఆయన స్నేహశీలమైన, ప్రశాంతమైన పలకరింపు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా తేలికపరచేదిగా ఉండేది. విశాల వటవృక్షం వంటి ఆయన సాన్నిధ్యం, అండ ఇక మాకు లభించవు. ఆయన అచంచలమైన, అమోఘమైన సంకల్పం మూలంగానే అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కానీ ఆ మందిర నిర్మాణం ప్రారంభం కావడానికి ముందే వారు మనల్ని వీడి వెళ్ళిపోయారు. ఎవరి నిష్కామ తపస్సు మూలంగా భరతవర్షంలో ధార్మిక జీవనం తేజోవంతంగా నిలిచ్చిందో అలాంటి ఆధ్యాత్మిక పుంగవులు ఇక మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా వారి జ్ఞాపకాలు, ప్రేరణ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి.
వారి పవిత్ర ఆత్మకు వ్యక్తిగతంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరఫున మేము వినమ్రపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.
మోహన్ భాగవత్ ,
సర్ సంఘచాలక్.
సురేశ్ (భయ్యా) జోషి,
సర్ కార్యవాహ












