Home Uncategorized సీమ సింహాసనాన్ని కదిలించిన సిరా చుక్కలు..

సీమ సింహాసనాన్ని కదిలించిన సిరా చుక్కలు..

0
SHARE

-గోపరాజు

మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్రధానంగా భారతీయ భాషల పత్రికలు, భారతీయులు ప్రచురించిన ఆంగ్ల భాషా పత్రికలు చేపట్టాయి. భారతీయుల స్వరాజ్య సమరంలోని సహేతుకతను గుర్తించిన కొందరు విదేశీయులు కూడా ఇందుకు చేయూతనిచ్చారు. భారతావని నుంచి ఆంగ్లేయులు వెళ్లిపోవాలని, సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రతిష్టించాలని, స్వయం పాలన ఉండాలన్న ఆధునిక ప్రాపంచిక చింతనను బ్రిటిష్‌ ఇం‌డియా మైదాన ప్రాంతాలకు అందించడంలో పత్రికలదే ప్రధాన పాత్ర. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌విస్తరణకు ముందు నుంచి కూడా పునరుజ్జీవనోద్యమ దృష్టితో దేశవాసులలో జాతీయ చైతన్యం రగిలించిన నాయకులు చాలామంది ద్విపాత్రాభినయం చేశారు. స్వరాజ్య సమర సారథ్యం ఒకవైపు, పత్రికా రచన మరొకవైపు. బాలగంగాధర తిలక్‌, ‌సావర్కర్‌, ‌సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ, అరవిందుడు, ఫిరోజ్‌షా మెహతా, గాంధీజీ వంటివారంతా ఆ కోవకు చెందుతారు. గాంధీగారు ‘హరిజన్‌’, ‘‌యంగ్‌ ఇం‌డియా’ అనే పత్రికలకు సంపాదకత్వం వహించారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, కొండ వెంకటప్పయ్య వంటివారు పత్రికలను నడిపించడానికి కృషి చేశారు. పత్రికలు స్థాపించకున్నా, పత్రికలలో విరివిగా రచనలు చేసినవారూ ఉన్నారు. అందుకే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పత్రికలకు కూడా ప్రముఖ స్థానమే ఇస్తారు. తమ గతం ఎలాంటిదో, పరాయి పాలన అనే చీకటిలో ఉన్న తాము ఎలాంటి భవిష్యత్తును నిర్మించుకోవాలో ప్రజా బాహుళ్యంలో మేధోమథనానికి అవకాశం కల్పించినవి పత్రికలు. అలాంటి అక్షరోద్యమం మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలో కూడా జరిగింది.

‘స్వరాజ్య’, ‘దేశాభిమాని’, ‘కృష్ణాపత్రిక’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధప్రకాశిక’, ‘దేశమాత’, ‘కాంగ్రేసు’, ‘ఆంధప్రభ’ వంటి ఎన్నో పత్రికలు స్వరాజ్య సమరం నాటి రాజకీయ, దేశ పరిస్థితులను విశ్లేషించడం కనిపిస్తుంది. నిజానికి తెలుగు భాషలో తొలి పత్రికగా చెప్పుకునే ‘వృత్తాంతి’(1838) మొదలు, 1947 వరకు తెలుగులో 520 వరకు పత్రికలు పుట్టాయి, గిట్టాయి. నిజాం సంస్థానంలో నవాబు నడిపిన ‘మీజాన్‌’ ‌తెలుగు వెర్షన్‌కు అడవి బాపిరాజు సంపాదకులు. అందులో నవాబు వ్యతిరేకోద్యమ వార్తలకు కూడా ఆయన చోటిచ్చారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్‌’ ‌పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక పత్రిక. ‘ఇమ్రోజ్‌’ ఉర్దూ పత్రిక నిర్వాహకుడు, రచయిత షోయబుల్లాఖాన్‌ను (ఇంట్లో ముద్దుపేరు షోయబుల్లా గాంధీ) రజాకార్లు హైదరాబాద్‌లో హత్యచేశారు. ‘గోల్కొండ పత్రిక’ నిజాం విమోచనోద్యమానికి దోహదం చేసింది. దీనిని సురవరం ప్రతాపరెడ్డి నిర్వహించారు.
తెలుగులో 1838 ప్రాంతంలో పత్రికలు ఆరంభమైనా తొలి దశలో అన్నీ సంఘ సంస్కరణకు, సాహిత్యానికి, విద్యార్థుల సేవకు పరిమితమైనాయి. ఏపీ పార్థసారథి నాయుడు గుంటూరు నుంచి వెలువరించిన ఆంధప్రకాశిక తొలి రాజకీయ పత్రిక అని చెబుతారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత, భారత జాతీయ కాంగ్రెస్‌ ‌స్థాపన ఘట్టాలతో ఒక కొత్త రాజకీయ వాతావరణం ఏర్పడింది. వాటి ప్రభావంతో పత్రికలు పుట్టుకు రావడం చరిత్రలో కనిపిస్తుంది. బెంగాల్‌ ‌విభజనతో రగిలిన జాతీయతా భావం అక్షరాలకు పదును పెట్టింది.

ముట్నూరి కృష్ణారావు

జాతీయతా భావాలనే మనసావాచా నమ్మిన మేధోవర్గాన్నీ, ఉద్యమ సారథ్యాన్నీ ఇచ్చిన పరిణామం బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమం. అదే వందేమాతరం ఉద్యమం. ఆ ఉద్యమం తెలుగువారికి అందించిన మేధో సంపన్నుడు, పత్రికా రచయిత ముట్నూరి కృష్ణారావు (1879-1945). ఆయన సంపాదకీయాల సంకలనం ‘లోవెలుగులు’ ఆధునిక జాతీయతా చైతన్యానికి గీత వంటిది. ‘శక్త్యుపాసన’ అనే రచనలో ‘నీలో సంఘటనా శక్తి ఎక్కడ? స్వతంత్ర సంఘటన చేయలేకపోయినా, ప్రతిఘటన అయినా చేయలేవే. రాతిని కొట్టిచూడు, దానిలో నుంచి అగ్నికణాలు బయలుదేరతాయి. మందుగుండుకు చిచ్చు పెట్టామనుకో- అది ఎట్లా ప్రేలి, నీ గృహాన్ని మంటల్లో పడవేస్తుంది? ఒక ఎలక్ట్రిక్‌ ‌బొత్తామును ఒత్తావనుకో- చూడు ఎన్ని బల్బులొక్కమారు వెలుగులు గ్రక్కుతాయో! నిన్ను ఒత్తినా, తన్నినా, చంపినా, ఒక అగ్నికణం గాని, ఒక్క ప్రేలుడుగాని, ఒక్క జ్యోతి గాని ప్రకాశించలేదే! మనం చచ్చుదద్దమ్మలమన్నమాట. మనలో రాతికున్న భౌతికశక్తి లేదు, పశువులకున్న ప్రాణశక్తి లేదు, మానవునికుండదగిన త్యాగశక్తి లేదు….’ భారతజాతి ఎలాంటి స్థితిలో ఉన్నదో చెప్పడానికి ఆయన ఇలాంటి భాషతో సంపాదకీయాలు రాశారు. జాతిలో ఆ పెను నిద్రను వదిలించడానికి ఆయన ‘కృష్ణాపత్రిక’ను సాధనంగా చేసుకున్నారు. ఆ పత్రిక అలనాటి చీకటిలో వెలిగిన కంచు కాగడా. ఫిబ్రవరి 1, 1902లో మచిలీ పట్నంలో ప్రారంభమైన ‘కృష్ణాపత్రిక’కు 1907లో బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత ముట్నూరివారు సంపాదకులయ్యారు. బిపిన్‌పాల్‌ ‌దక్షిణ భారతయాత్రకు ముట్నూరి వారే మార్గదర్శకులు. నిజానికి ముట్నూరి వారు 1905 విభజన తరువాత బెంగాల్‌ ‌వెళ్లి బిపిన్‌పాల్‌ను కలుసుకున్నారు. పాల్‌, ‌చిత్తరంజన్‌దాస్‌, ‌సుబోధచంద్ర మల్లిక్‌ ఆరంభించిన ‘బందేమాతరం’ పత్రిక పనితీరును చూశారు. దీనికి అరవింద్‌ ‌ఘోష్‌ ‌సంపాదకులు. ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న వ్యాసం ప్రచురించి నందుకు నాలుగేళ్ల పాటు సంపాదకత్వానికి దూరంగా ఉన్నా, తరువాత మళ్లీ వచ్చి కొన ఊపిరి వరకు ఆయన కృష్ణాపత్రికను నడిపించారు.

గాడిచర్ల

స్వరాజ్య సమరంలో గాంధీజీ కంటే ముందే కారాగారం అనుభవించినవారు, పత్రికా రచయితలుగా ఆంగ్ల ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైనవారు ఉన్నారు. అలాంటివారిలో మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలో పుట్టిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బొంబాయి ప్రెసిడెన్సీలో బాలగంగాధర తిలక్‌లను మొదట చెప్పుకోవాలి. బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్య మంలో లాల్‌, ‌పాల్‌, ‌బాల్‌ ఇచ్చిన సందేశాలతో ఉత్తేజితుడైన గాడిచర్ల (సెప్టెంబర్‌ 14,1883- ‌ఫిబ్రవరి 29, 1960) విద్యార్థి దశలోనే నేరుగా ఉద్యమంలో చేరారు. కర్నూలుకు చెందిన గాడిచర్ల ఎంఎ చదివారు.

రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణలో ఉండగా 1907లో అక్కడికి బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌వచ్చారు. ఆయన సభలో చురుకుగా వ్యవహరించినందుకు, కళాశాలలో వందేమాతరం అని నినదించినందుకు ఆయనను బహిష్కరించారు. 1907లోనే బెజవాడ నుంచి ‘స్వరాజ్య’ వారపత్రికను ఆయన ఆరంభించారు. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావు అనే ఇద్దరు ఆయనకు సహకరించారు. 1908లో ఈ పత్రికలో గాడిచర్ల ‘విపరీత బుద్ధి’ పేరుతో ఒక సంపాదకీయం రాశారు. దానితో ఆయనకు మూడేళ్లు కారాగారా శిక్ష విధించారు. ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంకెళ్లు వేసి బెజవాడ వీధుల నుంచి తీసుకువెళ్లారని చెబుతారు. మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలో జాతీయ భావాల వ్యాప్తికి శ్రమించిన ‘ఆంధ్రపత్రిక’ తొలి సంపాదకుడు గాడిచర్ల వారే. అలాగే మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలో జైలుకు వెళ్లిన తొలి స్వాత్రత్య సమరయోధుడు ఆయననే అని కూడా అంటారు. తరువాత హోంరూల్‌ ఉద్యమంలో చిత్తరంజన్‌దాస్‌, ‌మోతీలాల్‌లతో కలసి పనిచేశారు. స్వరాజ్య తరువాత ‘నేషనలిస్ట్’, ‘‌మాతృసేవ’, ‘కౌమోదకి’ అనే పత్రికలు నడిపారు. కానీ 1930 తరువాత స్వరాజ్య సమరాన్ని వీడి, గ్రంథాలయోద్యమం కోసం జీవితాంతం పనిచేశారు. వెల్లూరు కారాగారంలో ఆయన కఠోర అనుభవాలు చవిచూశారు. దత్త మండలాలుగా పేరొందిన ప్రాంతానికి రాయలసీమ పేరు ఇచ్చినది, ఎడిటర్‌ అన్న ఇంగ్లిష్‌ ‌పదానికి సంపాదకుడు అన్న అనువాదాన్ని ఇచ్చినవారు గాడిచర్ల వారే.

చిలకమర్తి

బిపిన్‌చంద్ర పాల్‌ 1907‌లో రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది. ఆనాటి సభలో ఆశువుగా వినిపించినదే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ పద్యం. 1906లో ఆయన రాజమండ్రిలో ‘మనోరమ’ పేరుతో పత్రిక స్థాపించారు. 1909లో ‘దేశమాత’ పత్రికను నెలకొల్పారు. మనోరమ సాహిత్యానికి పరిమితమైనా, దేశమాత పేరుకు తగ్గట్టే వెలువరించారు. చిలకమర్తి బెంగాల్‌ ‌సంఘసంస్కర్తల జీవితాలను తన పత్రికల ద్వారా తెలుగువారికి పరిచయం చేశారు. దేశమాత పత్రిక ప్రారంభించ డానికి ఆయన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

అన్నపూర్ణయ్య, మరొక ముగ్గురు

గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలోకి వచ్చినా, తన పత్రిక ‘కాంగ్రేసు’ను మాత్రం తీవ్ర జాతీయవాదుల భావాలకు వేదికను చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య (మార్చి 20,1899-మార్చి 11, 1954). వాటినే ప్రచారం చేశారు కూడా. గాంధీజీకి ప్రీతిపాత్రులైన డాక్టర్‌ ‌బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం ప్రభావం మద్దూరి మీద పడింది. సుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఆంధ్రయువజన కాంగ్రెస్‌ ‌తరఫున నడిచిన పత్రిక ‘కాంగ్రేసు’. 1921 మే మాసంలో, మద్దూరి సంపాదకునిగా మొదట సైక్లోస్టయిల్డ్ ‌పత్రికగా అది ఆరంభమైంది. రాజమహేంద్రవరం నుంచి ప్రచురణ ప్రారంభించి, తరువాత సుబ్రహ్మణ్యం ప్రారంభించిన సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్ర మానికి తరలింది. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆశ్రమానికి దక్షిణాది సబర్మతి అని పేరు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంత రావు సంపాదక మండలిలో ఉన్నారు. కానీ పత్రిక వెలువడిన ఒక దశాబ్దకాలంలో (1921-1932) వీరిలో ఎవరో ఒకరు కారాగారంలో ఉంటూ వచ్చారు. 1929 మే నెల కాంగ్రేసు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంస్మరణ సంచికగా వెలువడింది. ఇందులోనే అచ్చయిన ‘చిచ్చుర పిడుగు’ అన్న నాటిక అప్పుడే ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గాంధీజీని కలవరపరచడమే కాదు, మద్దూరిని రెండున్నరేళ్లు కారాగారంలో ఉంచింది. నిజానికి అది రామచంద్రుని వెంకటప్ప రచన. రచయిత పేరు వేయలేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంతో సంపాదకుడు కాబట్టి మద్దూరి బాధ్యత వహించి జైలుకు వెళ్లారు. భగత్‌సింగ్‌ ‌బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాసినందుకు, వాడపల్లి కాల్పుల గురించి వార్తలు ఇచ్చినందుకు ప్రభుత్వం ఈ పత్రిక మీద నిఘా ఉంచింది. ప్రతివారం సంచికను బయటకు రానివ్వకూడదనే నిశ్చయంతో పోలీసు యంత్రాంగం ఉండేది. చివరికి 1932 జనవరిలో మద్రాస్‌ ‌గెజెట్‌ ‘‌కాంగ్రేసు’ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. జనవరి 12న పోలీసులు ఆశ్రమం మీద దాడి చేసి కాంగ్రేసు ఆస్తులు మొత్తం ధ్వంసం చేశారు. కాశీనాథుని నాగేశ్వరరావు కానుకగా ఇచ్చిన అచ్చుయంత్రాన్ని తుత్తునియలు చేశారు. మొత్తంగా మద్దూరి 14 సంవత్సరాలు కారాగారంలో ఉన్నారు. కుటుంబం కడు పేదరికంలో గడిపింది. కుటుంబం గుర్తుకు వస్తే భార్య రాసిన ఒకే పోస్టు కార్డును కొన్నేళ్ల పాటు దమో కారాగారంలో (ఎంపి) ఆయన చదువుకుంటూ ఉండేవారు. భార్య మరణానికీ, కూతురి పెళ్లికీ కూడా ఆయనకు పెరోల్‌ ఇవ్వలేదు. తరువాత ఆయన సుభాశ్‌చంద్ర బోస్‌ అనుచరుడయ్యారు.

సురవరం ప్రతాపరెడ్డి

మే 10, 1926న ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వం గుండెల్లో కుంపట్ల మాదిరిగా రగిలేవి. నిజాం రాజ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియచేసేందుకు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896-ఆగస్ట్ 25, 1953) ఈ ‌పత్రిక స్థాపించారు. సంపాదకునిగా మొదట్లో ఆయన పేరు లేకున్నా, పత్రికకు అన్నీ ఆయనే. సురవరం బహుభాషావేత్త. 1939-47 మధ్యనే ఆయన పేరు ప్రచురించారు. సువరం గొప్ప సాహిత్యవేత్త. ఆంధ్రుల సంస్కృతి గురించి, హిందువుల పండుగల గురించి ఆయన పుస్తకాలు రాశారు.

షోయబుల్లాఖాన్‌

రావలసినంత కీర్తి రాని కలం యోధుడు షోయబుల్లా ఖాన్‌ (అక్టోబర్‌ 17,1920-ఆగస్ట్ 22, 1948). ‌తండ్రి హబీబుల్లా నిజాం రైల్వే ఉద్యోగి. వీరు ఉత్తర ప్రదేశ్‌ ‌నుంచి వలస వచ్చారు. షోయబ్‌ ‌ఖమ్మం జిల్లా సుబ్రవేడులో పుట్టారు. ‘తేజ్‌’ ‌పత్రికతో జర్నలిస్ట్ ‌జీవితం ఆరంభించారు. మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడిన ‘రయ్యత్‌’ ‌పత్రికలో ఉపసంపాదకుడు. నిజాం దీనిని మూయించిన తరువాత షోయబ్‌ ‌స్వయంగా ‘ఇమ్రోజ్‌’ (ఈరోజు) పత్రిక స్థాపించారు. అరాచకాలను బట్టి నిజాం రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ ఏడుగురు ముస్లిం పెద్దలు వినతిని తయారు చేశారు. దానిని షోయబ్‌ ‌యథాతథంగా ప్రచురించారు. ఇలాంటి వార్తలు రాస్తున్న షోయబ్‌ ‌చేతులు నరికేస్తామని ఆగస్ట్ 19, 1948‌న ఖాసిం రజ్వీ హెచ్చరించినట్టే 21వ తేదీన కాచిగూడ రైల్వే స్టేషన్‌ ‌రోడ్‌లో రజాకార్లు కుడిచేతిని నరికేశారు. మరునాడే షోయబ్‌ ‌తుదిశ్వాస విడిచారు.
సత్యాగ్రహి (ఆత్మకూరి గోవిందాచార్యులు, 1923),జమీన్‌రైతు (నెల్లూరు వెంకటరామానాయుడు, 1928), పల్లెటూరు (శనివారపు సుబ్బారావు, 1923), వాహిని (ఆచార్య ఎన్‌జి రంగా, 1932), ఆంధప్రభ (ఖాసా సుబ్బారావు, నార్ల, 1939), ప్రబుద్ధాంధ్ర (శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 1930) వంటి పత్రికలు ఎన్నో స్వాతంత్య్రోద్యమం గురించి వ్యాఖ్యానించాయి. శ్రీపాద ప్రబుద్ధాంధ్ర ఎన్నో స్వాతంత్య్ర సమర ఘట్టాలను నమోదు చేసింది. వాటి మీద ఆయన నిశిత విమర్శలు చేశారు. ప్రాంతీయ భాషల ప్రాధాన్యం విస్మరించడం సరికాదని నిష్కర్షగా చెప్పేవారు. ఉద్యమ ఘట్టాల మీద బలమైన సంపాదకీయాలు కూడా ఆయన వెలువరించారు. ఆ కాలంలో కొన్ని రహస్య పత్రికలు కూడా వెలువడినాయి. అయితే బ్రిటిష్‌ ‌చట్టాలు పత్రికలకు స్వేచ్ఛను ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ముద్రాపకులు, సంపాదకులు ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చి పత్రికలను వెలువరించేవారు. పత్రికా చట్టాలు, పోలీసు నిర్బంధాలు కఠినంగా ఉండేవి. అయినా స్వాతంత్య్ర కాంక్షతో అక్షర సమరం సాగించిన ఆ తరం కలం యోధులందరికీ నివాళి.

జాగృతి సౌజ‌న్యంతో..