Home Telugu Articles పేట్రేగిపోతున్న ‘వామపక్ష’ హింస

పేట్రేగిపోతున్న ‘వామపక్ష’ హింస

0
SHARE

రష్యాలో 1917లో ‘బోల్షవిక్ విప్లవం’ వచ్చి కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే పంథాలో 1948లో చైనాలో మావో సేటుంగ్ అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టి రాజకీయ అధికారం చేజిక్కించుకున్నాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి, దక్కించుకున్న రాజకీయ అధికారాన్ని నిలుపుకోవడానికి నిర్దాక్షిణ్యంగా చాలామందిని హతమార్చారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరు కోట్లు అని ఓ అంచనా!

‘త్రివిష్టపం’ అనే ప్రాచీన నామం గల టిబెట్టులో లామాల బౌద్ధమత ప్రభుత్వం ఉండేది. 1950వ దశకంలో మావో సేటుంగ్ టిబెట్టును కబళించి అక్కడి మతగురువు దలైలామాను చంపబోతే అతడు తప్పించుకొని ఇండియాకు వచ్చి శరణార్థిగా బతుకుతున్నాడు. ఈ సమయంలో పది లక్షల మంది బౌద్ధులను చైనా సైన్యం దారుణంగా చంపింది. ఆరు లక్షల బౌద్ధ స్థూపాలను, విహారాలను నేలమట్టం చేశారు. (ఈ వివరాలు ‘ది లాస్ట్ ఎంపరర్’ సినిమాలో చూడొచ్చు.) మన దేశంలో స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో భారత కమ్యూనిస్టులు బ్రిటీషు వారిని బలపరిచారు. 1947లో అఖండ భారత్‌ను ఇండియా, తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లుగా విభజించడానికి కమ్యూనిస్టులు మద్దతునిచ్చారు. 1962లో చైనా భారతదేశంపైకి దండయాత్ర చేసినప్పుడు ‘ఇండియానే చైనామీదికి దండయాత్ర చేసింది’ అని కమ్యూనిస్టులు ప్రకటించారు. 1950వ దశకంలో రష్యాకు మాకినేని బసవపున్నయ్య వంటి వారు వెళ్లి స్టాలిన్‌ను కలిసి- ‘సాయుధ పోరాటంతో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాం.. అందుకు అనుమతిని ఇవ్వండి’ అని కోరితే అందుకు తగిన సమయం రాలేదని చెప్పి వారిని తిరిగి ఇండియాకు పంపివేశాడు.

1964లో కమ్యూనిస్టుల్లో చీలిక వచ్చింది. రష్యా అనుకూలవర్గం సిపిఐగా, చైనా అనుకూలవర్గం సిపిఐ(ఎం)గా విడిపోయాయి. అప్పుడు సిపిఎం కార్యకర్తలు సిపిఐ వారిని ‘రివిజనిస్టులు’అంటూ నిందించి భౌతిక దాడులకు దిగారు. కేరళ, బెంగాల్, తెలంగాణ, విజయవాడ వంటి ప్రాంతాలల్లో ఎందరో పేద ప్రజలు ఈ దాడుల్లో సర్వస్వం కోల్పోయారు. 1969లో కేరళలోని కన్నూరు జిల్లాలో సిపిఎం కార్యకర్తలు పినరాయ్ విజయన్ నాయకత్వంలో దాడులు జరిగాయి. అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన, దర్జీగా పనిచేస్తున్న రాధాకృష్ణ అనే దేశభక్తుణ్ణి వారు హతమార్చారు. రాధాకృష్ణ చేసిన తప్పు ఏమిటంటే- ‘్భరత్‌మాతాకీ జై’ అనటం. ప్రత్యర్థులను చంపి గోనె సంచుల్లో పెట్టి సాక్ష్యాధారాలు దొరక్కుండా ఉప్పుపాతర వేయండని పినరాయ్ విజయన్ అప్పట్లో తన అనుచరులను ఆదేశించారట! ఇవి సరిగ్గా స్టాలిన్ రష్యాలో చెప్పిన మాటలే.

కేరళలో ఇటీవల పినరాయ్ విజయన్ ముఖ్యమంత్రిగా వామపక్ష ప్రభుత్వం అధికారం చేపట్టాక మళ్లీ రాజకీయ దాడులు, హత్యలు మితిమీరిపోతున్నాయి. హిందూ ధర్మరక్షణ కోసం తపన పడే వారిపైనే వామపక్ష సర్కారు గురి పెట్టింది. విజయన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాక- ఇన్నాళ్లూ పలు నేరారోపణలపై జైళ్లలో ఉన్న సుమారు 2,000 మంది వామపక్ష కార్యకర్తలను విడిపించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడితే రాష్ట్ర గవర్నర్ అడ్డుకున్నారు.

భారత్‌కు స్వాతంత్య్రం ఇప్పించే నిమిత్తం అలనాడు నేతాజీ సుభాష్ చంద్రబోసు జర్మనీ వెళ్లి హిట్లరును కలిసి సైనిక సహాయం కోరాడు. అప్పుడు ఇండియాలోని కమ్యూనిస్టుల ‘పీపుల్స్‌వార్’ పత్రికలో నేతాజీపై కార్టూను వేసి ‘ఇతడు హిట్లరు బూట్లు నాకిన కుక్క’ అని వ్యాసం రాశారు. ఇదీ నేతాజీపై కమ్యూనిస్టులకు ఉన్న ద్వేషభావం. కేరళలో యోగిని అమృతానందమాయి ఆశ్రమంపైనా కమ్యూనిస్టు కార్యకర్తలు దాడి చేశారు. ఆమె ‘కిడ్నీలు అమ్ముకునే వ్యాపారస్థురాలు’ అని మలయాళం పత్రికలలో నీచంగా వ్యాసాలు రాశారు. అఫ్జల్ గురు అనే ఉగ్రవాది మన పార్లమెంటు భవనంపై దాడి చేస్తే అతనిని అరెస్టుచేసి రెండు దశాబ్దాలబాటు కోర్టులో విచారించారు. చివరికి శిక్షలు ఖరారు చేశారు. అప్పుడు సిపిఎం నాయకుడు ఏచూరి సీతారాం- ‘అఫ్జల్ గురును శిక్షించకూడదు’ అంటూ ఉద్యమం నిర్వహించడమే కాదు, అతనికి క్షమాభిక్ష పెట్టండంటూ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞాపన పత్రం సమర్పించాడు.

కేరళలో సిపిఎం కార్యకర్తలు సాగించే నరమేధాన్ని పౌరహక్కుల సంఘాల వారు, మానవ హక్కుల సంఘాల వారు ఏనాడూ ప్రశ్నించరు. ఈ హత్యలపై న్యాయ విచారణ జరపాలని వారు ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీసిన పాపాన పోలేదు. కారణం ఈ అరాచకాలన్నీ సిపిఎం అగ్రనేతల కనుసన్నల్లో జరిగినవి కాబట్టే. కేరళలో జరిగే ఏ ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరూ పోటీచేయకూడదు. చేస్తే వారిని చంపివేస్తారు. సదానందన్ మాస్టర్ సిపిఎంకు వ్యతిరేకంగా ఓ పార్టీకి ప్రచారం చేశాడని ఆయన కాళ్లు విరగ్గొట్టారు. ఇప్పుడాయన కదల లేడు. సుజిత్ అనే యువకుణ్ణి ఇంట్లోనుండి బయటకు లాగి ఇనుప మేకులున్న కట్టెతో చర్మం వొలిచి మెడ నరికి చంపారు. దీనిపై ఎలాంటి కేసులూ లేవు. కారణం- పోలీసు యంత్రాంగంలో సిపిఎం కార్యకర్తలు ఇదివరకే చొరబడి పోవడం.

సిపిఎం నేతలు చేయిస్తున్న హత్యలు, అరాచకాల గురించి కేరళలో అందరికీ తెలుసు. జీహాదీ ఉగ్రవాదులు బాంబులు వేసి హత్యలు చేస్తున్నారని కూడా తెలుసు. కోయంబత్తూరు బాంబుకేసులో నిందితుడైన మదానీ అనే జీహాదీ ఉగ్రవాదికి బెయిల్ ఇప్పించి అతనితో కలిసి విందు ఆరగించి ఫొటోలు తీసుకున్న సంగతి ఎందరికి తెలుసు? ధనువాచపురంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడు ఆ సంస్థను వదిలి వెళ్లాలని అనుకుంటే సిపిఎం కార్యకర్తలు అతనిని చావబాదారు. మాజీ దౌత్యవేత్త, 70 ఏళ్ల వృద్ధ మేధావి టి.పి.శ్రీనివాసన్ ఒక విద్యాసంస్థలో సాంస్కృతిక ప్రసంగం చేస్తుంటే- ‘విద్యా వ్యాపారం చేస్తున్న నీవెందుకు వచ్చావు?’ అంటూ ఆయనను చితకబాదారు.

ఏ దేశంలోనైనా కమ్యూనిజం విజయం సాధించాలంటే ముందుగా స్థానిక పరంపరాగత సంస్కృతిని నిర్మూలించాలనేది వారి ప్రధాన సూత్రం. ‘పిల్లిరంగు నలుపా? తెలుపా? అనే చర్చలు అనవసరం. ఏ రంగుపిల్లి అయితేనేమిటి? ఎలుకలను పట్టడమే ముఖ్యం. ఇది మావో సేటుంగ్ చెప్పిన సూక్తి. దీనిని ప్రపంచ కమ్యూనిస్టులు గాఢంగా నమ్మారు. ఈ కారణం చేతనే- ‘న్యాయం, ధర్మం’ వంటి పదాలు, రామాయణ భగవద్గీతలు నిష్ప్రయోజకమైనవి అని వీరి ఉద్దేశం. ‘బంధుత్వాలు, వావివరసలు అనే తేడా పాటించకుండా వర్గ శత్రువులను నిర్మూలించండి’ అనే మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్టు సిద్ధాంతాలను ‘ఉగ్రవాద’ సామ్యవాదులు నమ్ముతున్నారు.

చైనాలో ఒక సంఘటన జరిగింది. ఓ పౌరుడు ఓ సాయంత్రం తోటలో కూర్చున్నాడు. ఇంతలో చంద్రోదయమైంది. షాంపైన్ చప్పరిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఆ క్షణంలో ‘రెడ్ ఆర్మీ’ అటు వచ్చింది. ఈ కళా హృదయం గల పౌరుణ్ణి చితకబాదారు. ‘కళాస్వాదన బూర్జువా లక్షణం’ అని బుద్ధిచెప్పిపోయారు. కేరళ అందమైన సరస్సులతో కొబ్బరి తోటలతో నేత్రపర్వంగా ఉంటుంది. కానీ- అక్కడ కళారాధనను కథాకళి మోహినీ అట్టం వంటి కళాకారులను ప్రజలు ఆస్వాదించకూడదని స్థానిక కమ్యూనిస్టులు నిషేధం విధించారు. కలకత్తాలో అంతా దుర్గాష్టమి జరుపుకుంటుంటే కాళీమాత గురించి అసభ్యకర రాతలతో కొందరు వామపక్ష కార్యకర్తలు కరపత్రాలు పంచారు. అందుకే కాళికామాత భక్తులు తిరగబడి బెంగాల్‌లో కమ్యూనిస్టులను ఓడించి మమతా బెనర్జీకి పట్టం కట్టారు.

గణాంకాలే సాక్ష్యం..

* 2006 నుండి 2016 మధ్యకాలంలో సిపిఎం కార్యకర్తలచే హత్యకు గురైన దేశభక్తుల సంఖ్య 270.

* 2016లో కేరళ సిఎంగా విజయన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కన్నూరు ప్రాంతంలో చంపబడ్డ దేశభక్తుల సంఖ్య 11.

* 1-12-2006న తిరువనంతపురంలో కృష్ణకుమార్ (బిజ్జు) హత్య

17-12-2006న త్రిస్సూరు జిల్లాలోని ఎంగదియూర్‌లో పిఎస్ సుజిత్ హత్య.

* 20-1-2007న తిరూర్‌లో రవి హత్య.

* 12-2-2007న షాజూ కల్లెత్తుంకరలో హత్య. 30 ఏళ్ల షాజూ భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్త.

* 5 మార్చి 2007న పి.పి.వల్సరాజ్‌కురూప్ హత్య

* 16 మార్చి 2007న తానూర్ (మల్లపురం జిల్లా)లో లక్ష్మణ్ హత్య

* 24-4-2007న వెట్టియార్ (కువలక్కర)లో చంద్రన్ హత్య

* 22 అక్టోబర్ 2007న కొడుంగల్లూర్‌లో సునిల్‌కుమార్ హత్య

* 2 నవంబరు 2007న చదయమంగళంలో వినోద్‌కుమార్ హత్య

* 23 డిసెంబరు 2007న వినోద్ (25) హత్య

* 5 మార్చి 2008న తలెస్సరి (కన్నూరు జిల్లాలో)లో నిఖిల్ హత్య

* 5 మార్చి 2008న సత్యన్ తలెస్సరి (కన్నూరు జిల్లా)లో హత్య

* 6 మార్చి 2008న మహేష్- తలెస్సరిలో హత్య

* 7 మార్చి 2008న సురేష్‌బాబు హత్య

* 7 మార్చి 2008 సురేంద్రన్ (కన్నూరు జిల్లాలో)ను హతమార్చారు. ఇలా వందలాది హత్యలు జరిగాయి. కేరళలో విజయన్ నేతృత్వంలో సిపిఎం ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక హిందూమత సంరక్షకులపై ఈ దాడులన్నీ జరిగాయి.

* 28 డిసెంబర్ 2016న విమలను ఆమె భర్తను సజీవ దహనం చేశారు. * 18 జనవరి 2017న కన్నూరు జిల్లాలో సంతోష్ హత్య

* 12 ఫిబ్రవరి 2017న 21 ఏళ్ల నిర్మల్ హత్య

* 11 జూలై 2016న సి.కె.రామచంద్రన్‌ను అతని పొలంలోనే భార్య చూస్తుండగానే హత్య.

* 12 అక్టోబరు 2016న రమేష్ హత్య. ఇతని తండ్రి ఉత్తమ్‌ను 14 సంవత్సరాల క్రితం చంపివేశారు.

* 4 జూలై 2012న టి.పి.చంద్రశేఖరన్‌ను హత్యచేశారు. ఇతడు సిపిఎంను వీడి హిందూ సంస్థలో చేరాడని కక్షగట్టి చంపారు. పార్టీ వదిలి పెట్టిన వారందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ మావోయిస్టు హంతకులు స్ర్తిలను కూడా విడిచిపెట్టలేదు. విమల, అమ్ముయమ్మ, యశోద వంటి మహిళా కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. ఇలా హత్యలకు గురి అయిన వారిలో దళితులు, వెనుకబడిన వర్గాల వారూ ఉన్నారు.

-ముదిగొండ శివప్రసాద్

(ఆంధ్రభూమి సౌజన్యం తో)