Home News నిర్భయ నేరస్తులకు ఉరి అమలు.. ఏడేళ్లపాటు సాగిన న్యాయప్రక్రియ

నిర్భయ నేరస్తులకు ఉరి అమలు.. ఏడేళ్లపాటు సాగిన న్యాయప్రక్రియ

0
SHARE

— ప్రదక్షిణ  

ఏడు సంవత్సరాలకు పైగా దేశాన్ని, ముఖ్యంగా మహిళలని భయోత్పాతానికి గురి చేసిన నిర్భయ సామూహిక మానభంగం-హత్య కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి నేడు 2020 మార్చ్ 20న, సరిగ్గా ఉదయం 5.30గంటలకు  ఢిల్లీ తిహార్ జైల్లో, నిర్భయను అత్యాచారం చేసిన నలుగురిని ఉరి తీశారు.  అతి క్రూరంగా దారుణంగా ఆమెని అత్యాచారం చేసి, హింసించిన ఆరుగురిలో, ఒకరు జైల్లో ఉరివేసుకుని చనిపోగా, ఇంకొకరికి అత్యాచారo చేసిననాటికి మైనారిటీ తీరలేదనే (18సం.కు కొన్ని నెలలు తక్కువ ఉన్నాయని) కారణంచేత, న్యాయస్థానం బాలనేరస్థుల బోర్డుకి అప్పగించి ఆ తరువాత 3సం శిక్ష పూర్తయిన తరువాత వదిలేసింది. నిజానికి అతనే అత్యంత క్రూరంగా ఆమెని బలాత్కరణకి, హింసకి గురిచేసినవాడు.  (ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ తరువాత, తక్కువ వయసున్న నేరస్థులకి కూడా శిక్ష పడేటట్లు నిర్భయ చట్టానికి సవరణలు చేసింది).

వేగవంతమైన ఫాస్ట్-ట్రాక్ కోర్టు ద్వారా నిర్భయ కేసులో ఒక సంవత్సరoలోపే నేరస్థులకి ఉరిశిక్ష పడినా, ఆ తరువాత ఆరు సంవత్సరాలు పైన అమలు కాకపోవడం మొదలైన అంశాలు న్యాయవ్యవస్థపైన ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసు ఇప్పటికైనా సమాప్తమైందంటే అది కేవలం నిర్భయ తల్లిదండ్రుల ఏడు సంవత్సరాల అలుపెరుగని పోరాటం వల్ల మాత్రమే. శ్రీమతి ఆశాదేవి, శ్రీ బద్రీనాథ్ ప్రతిరోజు, అన్ని కోర్టుల చుట్టూ తిరిగి, తమ కుమార్తె కోసం వీరోచిత పోరాటం చేసారు. అలాగే వారి మహిళా లాయర్ `సీమా సమృద్ధి’ కూడా. అయితే న్యాయం కోసం బాధితులు ఇన్ని వ్యయప్రయాసలు పడాల్సి వస్తోందంటే, న్యాయవ్యవస్థ తమ పనితీరును సమీక్షించుకోవాలి. ఎంతోకాలంగా అందరూ ఎదురుచూస్తున్న `న్యాయవ్యవస్థ సంస్కరణలు’ ఇప్పటికన్నా జరిగితీరాలి.                  

నిర్భయ తల్లిదండ్రులు: శ్రీమతి ఆశాదేవి, శ్రీ బద్రీనాథ్, వారి లాయర్ సీమా సమృద్ధి

కేసు పూర్వాపరాలు:

16 డిసెంబర్2012, ఢిల్లీ.. 23సం నిర్భయ, మరొక వ్యక్తితో సినిమా చూసి రాత్రి పూట బస్సులో ఇంటికి తిరిగివస్తున్న సమయంలో మహీపాల్పూర్ ప్రాంతం వద్ద ఆరుగురు రౌడీలు, ఆమెని అతి క్రూరంగా సామూహిక బలాత్కారo చేసి, అడ్డొచ్చిన ఆమె స్నేహితుడిని కొట్టి, వారిద్దరిని రోడ్డు మీద చావడానికి విసిరేసి వెళ్ళిపోయారు. ఎవరో ఆమె కొనఊపిరితో ఉన్నప్పుడు ఢిల్లీ సఫ్ఫదర్జంగ్ హాస్పిటల్ చేర్చారు. చికిత్స చేసిన డాక్టర్లు ఆమె అంతర్గత గాయాలు, అతి క్రూరంగా ఆమెపై జరిగిన హింసకి నివ్వెరపోయారు.

17-18డిసెంబర్.. నిర్భయ అత్యాచారo కేసు నిందితులు రాం సింగ్, ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్త అరెస్ట్ అయారు, 21న మైనర్ నిందితుడిని (చట్టప్రకారం అతని పేరు బయట పెట్టలేదు) పోలీసులు అరెస్ట్ చేసారు. 22 డిసెంబర్ మరొక నిందితుడు అక్షయ్ ఠాకూర్ ని బీహార్ నుంచి పోలీసులు అరెస్ట్ చేసారు.

దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఘోరమైన నేరానికి నిర్ఘాంతపోయారు. నిర్భయ కేసులో సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులకు మరణశిక్ష పడాలని ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అతిత్వరలోనే నిరసనలు దేశమంతా వ్యాపించాయి.  

22డిసెంబర్: బాధితురాలు నిర్భయ మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలం ఇచ్చింది.

29 డిసెంబర్: మృత్యువుతో ధైర్యంగా చివరిక్షణం వరకు పోరాడిన నిర్భయ సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

2జనవరి 2013: అప్పటి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయముర్హ్తి అల్తమాస్ కబీర్, మహిళల అత్యాచారo కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుని ప్రారంభించారు.

17 జనవరి: మానభంగం, హత్య ఇంకా 13 ఇతర నేరాలకుగాను, నేరస్థులపై కేసు నమోదైంది.

28జనవరి: అతి క్రూరంగా వ్యవహరించిన 6వనేరస్థుడిని మైనర్ అని జువెనైల్ బోర్డు నిర్ధారించి, హత్యానేరం కింద విచారణ చేపట్టింది.

11మార్చ్: ప్రధాన నిందితుడు బస్ డ్రైవర్ రామ్ సింగ్ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

31ఆగస్ట్: మైనర్ నేరస్థుడికి జువెనైల్ బోర్డులో ౩సo. జైలు శిక్ష మాత్రమే పడింది. (2015లో  ఈ కిరాతక నేరస్థుడు విడుదల అయాడు. ఇతన్ని జైల్లోనే ఉంచాలని కోర్టులో దావా వేసినా, హైకోర్టు ఒప్పుకోలేదు, అతన్ని విడుదల చేసింది).

13సెప్టెంబర్: కోర్టు నలుగురికీ ఉరిశిక్ష విధించింది. శిక్ష ఖాయపరచడానికి, నిర్భయ కేసు ఢిల్లీ  ఉన్నత న్యాయస్థానం (హై కోర్టు) చేరింది.

1 నవంబర్: ఢిల్లీ హైకోర్టు విచారణ ప్రారంభించింది.

13మార్చ్2014:  ఢిల్లీ హైకోర్టు నలుగురికి ఉరిశిక్ష ఖాయపరిచింది.

14జూలై: సుప్రీమ్ కోర్టు ఉరిశిక్షపై స్టే ఇచ్చి శిక్ష నిలుపుదల చేసింది.

11 జూలై 2016: సుప్రీమ్ కోర్ట్ కేసు విచారణ ప్రారంభించింది (2 సంవత్సరాల తరువాత)

27మార్చ్ 2017: దాదాపు 1సంవత్సరo విచారణ పూర్తయింది కానీ తీర్పు వెలువడలేదు.

5మే 2017: సుప్రీమ్ కోర్ట్ నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది.

9జూలై: సుప్రీమ్ కోర్ట్ పునఃసమీక్ష దావా తిరస్కరించింది.

13డిసెంబర్: అయితే అదే సుప్రీమ్ కోర్టు, నలుగురు నేరస్థులకు వెంటనే మరణశిక్ష విధించాలనే దావా కూడా తిరస్కరించింది.

4-18డిసెంబర్ 2019: వరుసగా నేరస్థులు ఒకొక్కరుగా సుప్రీం కోర్టులో కేసు సమీక్ష దావాలు, ఆ తరువాత భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి క్షమాభిక్ష దరఖాస్తులు పెట్టడం ప్రారంభించారు. దరఖాస్తులు చేరగానే, రాష్ట్రపతి వెంటనే వాటన్నింటిని తిరస్కరించారు. సుప్రీమ్ కోర్ట్ లో కేసు పూర్తయింది కాబట్టి, తిరిగి దాఖలు అవుతున్న సమీక్ష దావాలు నిరాకరించాలని నిర్భయ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

ఉరిశిక్ష తేదీలు:

22జనవరి 2020: నలుగురు నేరస్థులకి ఉరిశిక్ష తేదీ ఖరారు. అయితే అనూహ్యంగా నేరస్థులు మళ్ళి క్షమాభిక్ష అభ్యర్ధనలు ఒక్కక్కరుగా వేయడం ప్రారంభించారు!

1ఫిబ్రవరి 2020: రెండవసారి ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. మళ్ళి నేరస్థుల లాయర్ ఏ.పి సింగ్ తీర్పుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేసారు. అనూహ్యంగా మళ్ళి ఉరిశిక్ష వాయిదా పడింది.

3మార్చ్ 2020: మూడవసారి మళ్ళి  ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. అనూహ్యంగా మళ్ళి ఉరిశిక్ష వాయిదా పడింది. (ఈసారి ఏకంగా నేరస్థులు `అంతర్జాతీయ న్యాయస్థానానికి’, UN సంస్థకి అభ్యర్ధన పంపించడానికి ప్రయత్నం చేసారు).

20మార్చ్ 2020: నాలుగవసారి ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. ఎట్టకేలకు సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత నలుగురు నేరస్థులకి ఉరిశిక్ష అమలయింది.    

నిర్భయ తల్లిదండ్రులు, వారి తరపున లాయర్ల 7సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, న్యాయవ్యవస్థలోని ఎన్నో లోపాలను బయటపెట్టింది. ఇప్పటికైనా న్యాయవ్యవస్థ అంతర్గత సంస్కరణలు ప్రారంభిస్తుందని ఆశిద్దాము.