-ప్రదక్షిణ
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది. వైశ్య కుటుంబం పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు, నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 16మార్చ్1901న శ్రీరాములుగారు జన్మించారు. బొంబాయిలో సానిటరీ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన శ్రీరాములు గారు, బొంబాయి మద్రాసులలో రైల్వేలో పనిచేసారు. 1928లో శిశువుకి జన్మనిచ్చి భార్య మరణించగా, కొద్ది రోజుల్లోనే ఆ శిశువు, ఆ తరువాత కొద్దికాలానికే ఆయన తల్లి కూడా మరణించడంతో, ఆయన విపరీతమైన వైరాగ్యానికి గురై జీవితాన్ని గాంధీగారి అహింసా మార్గంవైపు దేశసేవకై మళ్ళించారు.
దేశ స్వాతంత్రోద్యమంలో అయన నిర్విరామంగా పని చేసారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1941-42 `క్విట్ఇండియా’ ఉద్యమాలలో ఆయన పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. యెర్నేని సుభ్రమణ్యం గారు, కృష్ణా జిల్లా కొమరవోలులో ఏర్పాటు చేసిన `గాంధీ ఆశ్రమం’లో చేరిన ఆయన, గ్రామ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. 1943-1944 సంవత్సరాలలో అయన నెల్లూరు జిల్లాలో విస్తృతంగా ఖాది ఉద్యమం నడిపించారు. 1946-48 కాలంలో హరిజనుల దేవాలయాల ప్రవేశంపై 3-4సార్లు నిరాహారదీక్షలు చేపట్టి, నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి గుడిలో హరిజనుల ప్రవేశం కల్పించడంలో విజయం సాధించారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం నుంచి హరిజనులకు పలు ప్రయోజనాలు కలిగేలా ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వ ఆదేశాలు జారి చేయించగలిగారు. జిల్లా కలెక్టర్లు హరిజనుల అభ్యున్నతి కోసం జిల్లాలలో పర్యటించి పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన జీవితం చివరి దశలో కూడా ఎన్నో సంవత్సరాలు నెల్లూరులో ఉండి హరిజనుల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుడాయన. చెప్పులు గొడుగు కూడా లేకుండా వేసవి మండుటెండలో, శరీరానికి ప్లకార్డ్లు చుట్టుకుని హరిజనోద్ధరణ ప్రచారం చేసేవారు. గాంధీ హత్యానంతరం, `గాంధీ స్మృతి నిధి’కి ఆంధ్రలో శ్రీరాములుగారు అధ్య్యక్షులుగా పని చేసారు. గాంధి, కస్తూర్బా ట్రస్ట్లకు, భూదాన్ ఉద్యమాలలో పాల్గొన్నారు.
ఆ కాలంలో మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాలలో విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. `చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ వంటి గేయాలు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. చాలామంది ఆంధ్ర నాయకులు, శ్రీ పొట్టి శ్రీరాములు గారు కూడా ప్రత్యేక ఆంధ్ర/విశాలాంధ్ర ఉద్యమరంగంలోకి దిగారు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అనే వాదం 1910లోనే మొదలైంది. `వందేమాతరం’ ఉద్యమంలో చాలామంది తెలుగు నాయకులను జైళ్లలో నిర్బంధించారు, ఆ సమయంలో కూడా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రo అవసరం అనే నినాదం ఆరంభమైంది. 1912లో కృష్ణాజిల్లా నిడదవోలులో, తరవాత గుంటూరు జిల్లా బాపట్ల, విజయవాడ, విశాఖపట్నంలలో కూడా సభలు పెట్టి తీర్మానాలు చేసారు. శ్రీమతి ఆన్ని బెసెంట్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ క్రియాశీలవర్గం సమావేశంలో ఒక అడుగు ముందుకు వెళ్లి, భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలని తీర్మానం కూడా జారీ చేసారు.
అయితే బ్రిటిష్ ప్రభుత్వం కానీ, తరువాత 1947 స్వాతంత్ర్యానంతర భారత ప్రభుత్వం కానీ, రెండూ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకోలేదు. (కానీ అంతకు దశాబ్దాల ముందే బీహార్, ఓడిసా రాష్ట్రాల ఏర్పాటు జరిగిపోయాయి, మొదటినుంచి అడుగుతున్న ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదో కారణాలు లేవు). కేంద్ర ప్రభుత్వం `ధర్ కమిషన్’ ఏర్పాటు చేయగా, వారు ఎటూ తేల్చక, మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను, తెలుగు రాష్ట్రంగా పరిగణిoచుకోవచ్చు అని సూచించారు, ప్రజలు దీనిని నిరాకరించారు. అప్పుడు 1948జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ కమిటి సమావేశం `జవహర్లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య’లతో కూడిన త్రిసభ్య కమిటీ వేసారు. వారు మద్రాస్ నగరాన్ని మినహాయించి, మిగిలిన తెలుగు ప్రాంతాలని కలుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సూచించారు. అయితే మద్రాస్ తమదే అని నమ్మిన తెలుగువారు మద్రాస్ నగరం వదులుకోవడానికి సిద్ధపడలేదు.
15ఆగస్ట్ 1951 నుంచి `స్వామి సీతారాం’ గారు, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. నెహ్రు ప్రభుత్వం బేఖాతర్ చేసింది. 35రోజుల పైగా సాగిన దీక్ష తరువాత పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గ్రహించి ఆచార్య వినోబా భావే, ప్రధాని నెహ్రుకి తెలియపరిస్తే, వారిద్దరూ కలిసి స్వామి సీతారాంగారిని కలిసి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై హామీ ఇచ్చి దీక్ష విరమింపచేసారు. అయితే ప్రధాని పదవిలో ఉండి కూడా నెహ్రు మాట తప్పారు కానీ, తన హామీ నెరవేర్చలేదు.
అప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ నగరంలో `మహర్షి బులుసు సాంబమూర్తి’ గారి ఇంట్లో 19అక్టోబర్1952 నుంచి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు మాత్రం, ప్రధాని నెహ్రు మీద భయభక్తుల వల్ల శ్రీరాములు గారి దీక్షకు మద్దతుగా రాలేదు. చాలామంది ఈ దీక్ష కొద్దిరోజులు సాగి ఆగిపోతుందనుకున్నారు కాని అలా జరగలేదు. 20రోజుల తరువాత శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి విషమించింది.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇతర ప్రముఖులు ఆయనను చూడడానికి వచ్చేవారు. గాంధేయవాది యెర్నేని సుభ్రమణ్యం గారు, శ్రీరాములుగారి పరిస్థితి చూసి విలపించేవారు. ఎంతమంది చెప్పినా అయన దీక్ష విరమించలేదు. అవయవాలు శుష్కించి, మనిషి కృశించి, శరీరం లోని ఆమ్లాలు, రక్తం, మూత్రం మొదలైన వ్యర్థాలు ఎగదన్నుకుని నోట్లోంచి వచ్చేవి, అయన నరకయాతన పడ్డారు. అయినా వజ్ర సంకల్పంతో అయన అలాగే దీక్ష కొనసాగించారు. 56వ రోజు ఆయన కృంగిపోయి, కోమాలోకి వెళ్లారు. ఆ తరువాత రెండు రోజులకి ఊపిరి అందక విపరీతమైన యాతన పడ్డారు. 15డిసెంబర్ 1952, 58రోజుల నిరాహారదీక్ష తరువాత శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి అమరజీవి అయారు. ఈ వార్త దావానలంలా మద్రాసు నగరం, రాష్ట్రం అంతా పాకింది. అమర గాయకుడు ఘంటసాల, మోపర్రు దాసు మొదలైన వారు పరిగెత్తుకుని వచ్చారు. అక్కడికక్కడే గేయం కూర్చి, శ్రీ ఘంటసాల అమరజీవి సమక్షంలో అమరగానం చేసారు.
రాష్ట్రం కోసం శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసారనే వార్త విని ఆంధ్రులు కోపోద్రిక్తులైయారు. మూడు రోజుల పాటు పలు నగరాల్లో, ముఖ్యంగా మద్రాసు నగరంలో ధర్నాలు, విధ్వంసకాండ చెలరేగింది. విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, నెల్లూరు, కనిగిరి, ఒంగోలు మొదలైన నగరాల్లో అల్లర్లు చెలరేగాయి. అనకాపల్లి, విజయవాడల్లో పోలీసులు ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. ఇంత ప్రళయo జరిగిన తరువాత, నెహ్రు దిగివచ్చి, 19డిసెంబర్ 1952న, ఆంధ్ర రాష్ట్ర ఆవతరణకి ఒప్పుకున్నారు. అయితే ఇంత బలిదానం జరిగిన తరువాత కూడా, మళ్ళి పాత తీర్మానం ప్రకారoగానే, ప్రధాని నెహ్రు, తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు శ్రీ రాజాజీ నిర్ణయం ప్రకారం, మద్రాసు నగరాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపకుండా నివారించగలిగారు. కర్నూల్ రాజధానిగా 1అక్టోబర్ 1953 తేదిన, ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ తరువాత 3సంవత్సరాలకి, విశాలాంధ్ర రాష్ట్రం ప్రాతిపదికన, 1నవంబెర్1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. (2014లో మళ్ళి రాష్ట్ర విభజన జరిగిందని మనకు తెలుసు).
సత్యాగ్రహం, నిరాహారదీక్ష, సహాయనిరాకరణ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారి మెడలు వంచడానికి వాడిన అస్త్రాలు. వాటిని త్రికరణశుద్ధిగా నమ్మి ప్రాణత్యాగం చేసిన వారు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మంది కూడా లేరు. వారిలో అరుదైన నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఆత్మత్యాగo ఫలితం. ఆయన ఆత్మత్యాగo చేసి సాధించిన తెలుగు రాష్ట్రానికి నేటి తెలుగు ప్రజలు అర్హులా కాదా అనేది మనం వేసుకోవలసిన ప్రశ్న.
ఆధారం: దక్షిణావర్త, ఇంటర్నెట్