Home Views ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 1)

ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 1)

0
SHARE

-డా।। పి. శశిరేఖ

మొదటి భాగం

‘‘ధర్మే చార్థే చ కామేచ మోక్షేచ భరతర్ష భ,
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ ‌క్వచిత్‌.’’  (‌మహాభారతం, ఆది -62-53)

 ‘‘ధర్మం విషయంలోనూ, అర్థం విషయంలోనూ, కామం విషయంలోనూ, మోక్షం విషయంలోనూ ఏదైతే ఇక్కడ (భారతంలో) చెప్పబడిందో అదే ఇతరత్రా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా విషయం లేదూ అంటే అది మరెక్కడా లేదని అర్థం’’ అని మహాభారతం యొక్క గొప్పదనాన్ని గూర్చి చెప్పబడింది. ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. మొదటి మూడింటినీ ఆచరిస్తే నాల్గవది దానంతటదే సిద్ధిస్తుంది. అయితే ఈ ధర్మార్థాదులను గూర్చి సామాన్య మానవునికి అవగాహన ఉండకపోవచ్చును. అలాంటప్పుడే ఒక వ్యవస్థను ఏర్పాటుచేసి దానికి ఒక సమర్థుడైన నాయకుణ్ణి నియమించి, సామాన్య ప్రజలను కూడా యీ సూత్రాలపై నడిచేటట్లు చేయటమే రాజ్యాంగ వ్యవస్థ. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉన్నా, క్షీణదశలో ఉన్నా దానిక్కారణం రాజే.

‘‘కాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాల కారణమ్‌
ఇతితే సంశయో మా భూత్‌ ‌రాజా కాలస్య కారణమ్‌’’ (‌మహాభారతం – శాంతి పర్వం 9-19)

 ‘‘కాలం రాజు దశకు కారణమౌతుందా? రాజే కాలానికి కారణమౌతాడా? అనే సంశయం అక్కర లేదు. రాజే కాలానికి కారణం’’ అని స్పష్టంగా చెప్పాడు.

ఇంతటి మహత్తరమైన బాధ్యతను కలిగి ఉన్నరాజు ఎలా ఉండాలో, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో వివరించే శాస్త్రము రాజనీతిశాస్త్రం. రాజ్యాంగంలో రాజు కూడా ఒక అంగం.

‘‘స్వామ్యమాత్య సుహృత్‌ ‌కోశ రాష్ట్ర దుర్గబ‌లానిచ,
రాజ్యాఙ్గాని ప్రకృతయః పౌరాణామ్‌ శ్రేణయో-పిచ’’
(
అమరకోశం – క్షత్ర వర్గం – 18)

‘‘స్వామ్య మాత్య జనపద దుర్గ కోశ దణ్ణమిత్రాణి ప్రకృతయః’’
(కౌటిలీయార్థ శాస్త్రం 6 – 1 – 1)

రాజు, అమాత్యుడు, మిత్రరాజు, కోశాగారము, రాష్ట్రము (జనపదము), దుర్గము, బలం (దండబలం = సేన) యీ ఏడు రాజ్యపు అంగాలు. వీటిలో రాజు ప్రధానాంగం అయితే అన్ని అంగాలు సంపూర్ణంగా సమర్థవంతంగా ఉంటేనే రాజ్యం సర్వాంగశోభితమౌతుంది. పైన చెప్పిన సప్తాంగాలు కంటికి కనిపించేవి. పరోక్షంగా సహకరించేవి కూడా ఉంటాయి. అవే గుప్తచరులు అనే అంగాలు. ఎంత సుసంపన్నమైన దేశమైనా ‘గుప్తచర వ్యవస్థ’ సరిగా లేకపోతే క్షీణిస్తుంది అనే విషయాన్ని చరిత్ర స్పష్టం చేస్తుంది. రాజు వ్యవహారాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సినవి, పరోక్షంగా తెల్సుకోవాల్సినవి, ఊహించి (అనుమానం ద్వారా) తెల్సుకోవాల్సినవని మూడు రకాలు.

‘‘ప్రత్యక్ష పరోక్షానుమేయా హి రాజవృత్తిః’’ (కౌటిలీయార్థశాస్త్రం 1-9-4) 

అందుచేత రాజు ఒక్కడే కార్యాలను నిర్వహించలేడు. సమర్థులైన సహాయకులు అనగా సచివులు ఉండాల్సిందే.

‘‘సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం న వర్తతే’’ – అంటాడు కౌటిల్యుడు.  (కౌటిలీయార్థశాస్త్రం 1-7-9)

ఏ విధంగా ఒకే చక్రం శకటాన్ని (రథాన్ని) లాగలేదో అదేవిధంగా రాజ్యపాలన కూడా సహాయం లేనిదే నడవదు.
ప్రత్యక్ష రాజ్య వ్యవహారాలలో తోడ్పడటానికి, అమాత్య, పురోహితాదుల్ని నియమించాలి. పరోక్ష వ్యవహారాలను తెల్సుకొనటానికై గుప్తచరులను నియమించాలి. ఎంత సువ్యవస్థితమైన రాజ్యమైనా గుప్తచర యంత్రాంగం లేకపోతే శత్రువశమౌతుంది. గుప్తచర ప్రాశస్త్యాన్ని మాఘుడు చాలా చక్కగా చెప్పాడు.

‘‘అనుత్సూత్ర పదన్యాసః సద్వృత్తి సన్నిబన్ధనా,
శబ్దవిద్యేవ నో భాతి రాజనీతి రపస్పశా’’  (మాఘ కావ్యం 2-112)

వ్యాకరణశాస్త్రాన్ని శబ్దవిద్య అంటారు. పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయిలోని సూత్రాలకు, పదమంజరి, కాశికా అనే రెండు గ్రంథాలు చక్కని వివరణ ఇస్తాయి. అయితే వీటన్నింటికన్నా చక్కగా పతంజలి మహాభాష్యంలో ‘పస్పశాహ్నికం’ అనే ప్రథమాధ్యాయంలో వ్యాకరణశాస్త్ర ప్రాశస్త్యం, స్వరూపం మొదలైనవి వివరించాడు. ఏ విధంగానైతే ‘పస్పశాహ్నికం’ లేని శబ్దవిద్య శోభించదో ‘అపస్పశ’మైన రాజనీతి కూడా శోభించదు’. నియమానుసారం పదవుల్లో నియమించి, తగిన విధంగా భృతిని ఏర్పాటుచేసి, రాజు ఇచ్చే దానాదులను శిలా, తామ్ర శాసనాల్లో పొందుపరచినప్పటికీ ‘అపస్పశ’ (‘గూఢచారి రహితమైన రాజ్యవ్యవస్థ నిష్ప్రయోజనం’ అని అర్థం).

రాజు విలక్షణమైన వ్యక్తిత్వాన్ని మాఘుడు ఇలా వర్ణిస్తాడు –

‘‘బుద్ధిశస్త్రః ప్రకృత్యఙ్గః ఘనసంవృతి కఞ్చుకః,
చారేక్షణో దూతముఖః పురుషః కో-పి పార్థివః.’’  (మాఘకావ్యం 2-84)

 బుద్ధియే రాజు శస్త్రము, ప్రకృతులు అంగములు, మంత్రాంగమును (రహస్య సమాలోచనమును) కాపాడుటయే కంచుకము, చారులే కన్నులు, దూతయే ముఖము. ఇలా ఒకానొక విశిష్టతను సంతరించుకున్నవాడే రాజు.

ఈ విధంగా రాజు కన్నులుగా చెప్పిన చారులు సమర్థతతో కార్యం నిర్వహించకపోతే రాజు కళ్లుండీ గ్రుడ్డివాడయినట్లే. తన కళ్లే తనని మోసం చేస్తే రాజు ఇక ఎవరిని నమ్మాలి? గుప్తచరులు తమ ప్రభువును మోసగించకూడదు. తాము తెచ్చిన సమాచారం హితమైనా, అహితమైనా ప్రభువుకు చెప్పాల్సిందే. ప్రభువు కూడా గుప్తచరుడు తెచ్చిన సమాచారం ఎలాంటిదైనా శాంతంగా విని తెలుసుకోవాలి. కిరతార్జునీయం ఈ విషయము ఇలా చెప్పింది –

‘‘క్రియాసు యుక్తైర్నృప చారచక్షుషో –
 న వఞ్చనీయాః ప్రభవో-ను జీవిభిః
అతో-ర్హసి క్షన్తుమసాధు సాధు వా
హితం మనోహారి చ దుర్లభం వచః’’.   (కిరాతార్జునీయం 1-4)

‘‘ఓరాజా! గుప్తచరులుగా నియుక్తులైన రాజోద్యోగులు చారులే నేత్రములుగా గల్గిన రాజును మోసగించరాదు. (అందుచేత నేను తెలుసుకున్న సమాచారం యథాతథంగా నీకు తెల్పుతున్నాను అని అర్థం) కావున నేను తెలుపబోయే సమాచారం మంచిదైనా (ప్రియమైనా) కాకపోయినా (అప్రియమైనా) భరించి నన్ను క్షమించగలరు. ఎందుచేతనంటే హితమూ, ప్రియమూ కలిసిన వాక్కులు చాలా కష్టంగా లభిస్తాయి (హితోక్తులు ఎప్పుడోగాని మనసుకు నచ్చే విధంగా ఉండవు).

ఈ విధంగా కంటికి కనపడే ఏ దృశ్యమైనా నేత్రాలు ఎలా అందిస్తాయో అదేవిధంగా స్వరాజ్యంలోనూ, పర రాజ్యంలోనూ జరిగే విషయాలను రాజునకు అందించడం గుప్తచరుల ధర్మం. ఈ గుప్తచరుల కార్యక్షేత్రం అతి విస్తృతమైనది. వివిధ విభాగాలు పరస్పరం అనుసంధించి పనిచేస్తాయి (నెట్‌వర్క్). ‌ప్రాచీన భారతదేశంలో ఈ గుప్తచర విభాగం చక్కగా కార్యభారం నిర్వహించేది. ఇతిహాసాల్లోనూ, కావ్య నాటకాల్లోనూ ఈ విషయాన్ని స్పష్ట పరిచే ఉదాహరణలు విస్తృతంగా లభిస్తాయి. అయితే ఈ విభాగపు సమగ్ర రూపాన్ని కార్యక్షేత్రాన్ని వివరించిన ఘనత ఆచార్య కౌటిల్యునిదే.

 కౌటిల్యుని అర్థశాస్త్రంలోని గుప్తచర వ్యవస్థను గూర్చి తెలుసుకునే ముందు యీ గుప్తచర శబ్దానికి అర్థాల్ని తెలుసుకోవాలి.

ప్రణిధి, అపసర్ప ఇత్యాది పదాలు గుప్తచరులు ఏయే పదవుల్లో  నియుక్తులైనారో సూచిస్తాయి.

‘‘‌యథార్హవర్ణః ప్రణిధిరపసర్పశ్చరః స్పశః చారశ్చ,
 గూఢ పురుషశ్చ’’   – (అమరకోశము, ద్వితీయ కాండము, క్షత్రవర్గము)

‘యథార్హవర్ణః’ అనగా ఏ విధమైన కార్యం చేపట్టాడో ఆ గుర్తులు గలవాడు అని అర్థం.

  1. ప్రణిధిః – ప్రకర్షేణ నిధీయతే జ్ఞేయమస్మిన్నితి ప్రణిధిః

 సమాచారం తెల్సుకోవడానికి అధికమైన బాధ్యత ఎవరిపైన ఉంచబడుతుందో అతడు ప్రణిధి.

  1. అపసర్పః – అపకృష్టం సర్పతి ఇతి అపసర్పః

         ‘సృప్‌’ ‌గతౌ అనే ధాతువు నుండి ఏర్పడిన రూపం.
ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేవారిని తమకనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నం చేస్తారో వారు ‘అపసర్ప’ గుప్తచరులు.

  1. చరః – ఇది సంచరించి కార్యాల్ని నిర్వహించే గుప్తచరునికి అన్వయిస్తుంది – ‘చరతి ఇతి చరః’ అని.
  2. స్పశః – ‘స్పశతి బాధతే పరానితి స్పశః’ స్పశ బాధన స్పర్శనయోః.

   స్పశ ధాతువుకి బాధించటం, స్పృశించటం అని రెండర్థాలు ఉన్నాయి. శత్రువులను బాధిస్తాడు అనే అర్థంలో ‘స్పశ’ శబ్దం ప్రయుక్తమైంది.

  1. చారః – ‘‘చరతి జానాతి పరబలమితి చారః’’ చర – గతౌ, గత్యర్థత్వాత్‌ ‌జ్ఞానార్థత్వం .

   చరతి అనే ధాతువునకు ‘గతి’ అనే అర్థం ఉంది. ఈ ‘గతి’ అనే పదం జ్ఞానార్ధంలో కూడా వాడతారు. ఉదా: అవగతి ఈ అర్థం ప్రకారం ‘‘శత్రుబలాన్ని తెల్సుకుంటాడు కాబట్టి చారుడు’’ అని ‘చార’ శబ్దానికి అర్థం.

  1. గూఢపురుషః – ‘గూఢశ్చ అసౌ పురుషశ్చ’ అని కర్మధారయ సమాసంలో గూఢంగా రహస్యంగా ఉండే వ్యక్తి ‘గూఢ పురుషుడు’

పైన చెప్పినట్లుగా గుప్తచరులు వివిధ రూపాల్లో, వివిధ కార్యాలకై నియుక్తులౌతారు. అతి  ముఖ్యమైన విషయాలను తెల్సుకొనేందుకు శత్రుదేశానికి గూఢచారులను పంపాల్సి వచ్చినప్పుడు వారికి స్వదేశంలో జీతభత్యాలు యథా ప్రకారం అందుతుంటాయి. అయితే శత్రురాజుల్ని నమ్మించటానికి వారి రాజ్యంలో ఉంటూ వారిని నమ్మించి వారి ప్రాపకంలో ఉద్యోగం సంపాదించి స్వదేశ కార్యాన్ని నిర్వహించే గుప్తచరులకు స్వదేశంలోనూ, విదేశంలోను వేతనం లభిస్తుంది. వీరినే ఉభయ వేతనులు అంటారు.

ఈ వివరాలన్నీ రాజనీతిశాస్త్రాల్లో ఉన్నాయి. గుప్తచరుల కార్యరంగం ఎంత విస్తృతమైందో కౌటిల్యుని అర్థశాస్త్రం వివరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కొన్ని అధ్యాయాలు తప్ప మొత్తమంతటా వీరి ప్రస్తావన ఉండనే ఉంటుంది.

అమాత్యనియుక్తి (1-8)తో గుప్తచరుల యంత్రాంగం మొదలౌతుంది. అందుచేత అర్థశాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ పొందుపరచటం సాధ్యంకాదు. గుప్తచర విభాగపు సంక్షిప్త పరిచయం మాత్రం ఇక్కడ సాధ్యం.

గూఢ పురుషోత్పత్తి (appointment of spies)

గూఢ పురుష ప్రణిధి (Allotment of positions to spies)

అనే రెండు అధ్యాయాల్లోనూ గుప్తచర విభాగ ప్రధాన విభాగాల వివరాలు ఉన్నాయి.
అవి 1. సంస్థాః – ఒకేచోట ఉండి పనిచేసేవారు (Stationary spies)‌
2. సంచారాః – ఆయా ప్రదేశాలకు వెళ్లి కార్యం నిర్వహించేవాళ్లు (Roving spies)

ఈ రెండు విభాగాల్లో కూడా మళ్లీ అవాంతర విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాల్ని ఈ క్రింది పట్టిక సూచిస్తుంది.