వసుధైక కుటుంబం పరిఢవిల్లాలంటే, విజ్ఞానం ఆధునికంగా వెల్లివిరియాలంటే అత్యున్నత శాస్త్ర పరిశోధనల ఆవశ్యకత ఎంతగానో ఉంది. మేధావుల విజ్ఞాన శాస్త్ర పరిశోధనల మూలంగానే మానవాళి అత్యద్భతుమైన ఫలితాలతో సుఖసంతోషాలకు ఆలవాలమైన శాస్ర్తియతను పొందగలుగుతోంది. దేశంలోని అత్యుత్తమ శాస్త్ర పరిశోధనల సంస్థల పనితీరును ప్రపంచ ప్రమాణాలకు దీటుగా బలోపేతం చేసుకోవాలని కేంద్రం ఆకాంక్షిస్తోంది. నోబెల్ పురస్కారం సాధించే తొలి ఏపీ శాస్తవ్రేత్తకు వంద కోట్ల రూపాయల నగదు నజరానా అందిస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రకటన శాస్తవ్రేత్తలను, మేధావులను ఎంతగానో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సైన్సు పట్ల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో విముఖత పెరిగిన కారణంగానే భారతీయ పరిశోధన సంస్థలు ప్రతిభావంతులైన పట్ట్భద్రుల కొరతను ఎదుర్కొంటున్నాయి. సైన్సు, గణితాల్లో విశేష ప్రతిభను కనబరించే విద్యార్థుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ, ఆర్థిక సహాయం, ఇతర ప్రోత్సాహకాలను, ప్రత్యేక వసతుల్ని సమకూర్చడం ప్రభుత్వాల ముందున్న గురుతర బాధ్యత.
ఒక వినూత్న ఆలోచన, ఒక సృజనాత్మక పరిశోధన మానవాళి జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ప్రపంచ ప్రగతికి వెలుగుబాటలు పరిచిన ఆరు వందల మంది అద్భుత సాధకుల జాబితాను ‘ఫోర్బ్స్’ సంస్థ తాజాగా ప్రకటించింది. అందులో భారత సంతతికి చెందిన మూడు పదులమంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, వినూత్న ఉత్పాదనల ఆవిష్కర్తలు కొలువుతీరడం శుభపరిణామం. ఏ దేశ ప్రగతికైనా పరిశోధనలు, నవీన ఆవిష్కరణలు దోహదం చేస్తాయి. ఇటీవలి కాలంలో గాలితో నడిచేకారు, సౌరశక్తితో జలాల శుద్ధి, మెటాలిక్ త్రీడీ ప్రింటర్ తదితర వినూత్న ప్రయోగాలు మన దేశ శాస్ర్తియతకు శుభ పరిణామాలే. ఏ ప్రయోగానికైనా, సంక్లిష్ట పరిశోధనకైనా మానవ మేధస్సును పదునుపెడితే ఆలోచనలు ఆవిర్భవించి మానవ శ్రేయస్సుకు తోడ్పడతాయి. పాఠశాలల్లో పి ల్లల మనోగతాలను సై న్సు వైపు మరిల్చి వారిని మరింత ప్రోత్సహిస్తే న మూనా ఆవిష్కరణలే న వ్యాతి నవ్యంగా తయారై మానవాళి మనుగడకు వె లుగుబాటల్ని పరిచే మ హోన్నతాలై ప్రతిఫలిస్తాయి. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహిస్తే అటువంటి సృజన, ఆలోచన రేపటితరం పరిశోధనలకు మూల హేతువులై ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం పొందే వీలుంది. ప్రాచీన భారతావని పలు శాస్ర్తియ ఆవిష్కరణలకు నాంది పలకగా అప్పటి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు కలికితురాయిగా నిలిచాయి.
సమకాలీన ప్రపంచంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగంలో తలసరి వ్యయానికి సంబంధించి నార్వే దేశం ముందువరుసలో నిలిచింది. మన దేశంలో ప్రభుత్వాలు రాజకీయ రంగమే పరమావధిగా భావించి తల మునకలు కాకుండా క్రాంతిదర్శులుగా వెలగొందే పరిశోధనా రంగంపై దృష్టినిపెట్టి తగినన్ని నిధులు కేటాయించాలి. భవిష్యత్తును సుఖవంతంగా, ఆరోగ్యవంతంగా మార్చే రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ మధ్య 70 దేశాలకు చెందిన 980 ఉత్తమ విశ్వవిద్యాలయా ల్లో ఆసియాలో 289గా లెక్క తేలినా, అందులో భారత్ వాటా 31 మాత్రమే. అగ్రశ్రేణి 200 విశ్వవిద్యాలయాల్లో మనకు చోటే దక్కలేదు. అయితే, గుడ్డిలోమెల్లగా అంతర్జాతీయ సృజన సూచీలో గత ఏడాది కంటే 15 నుంచి 66వ స్థానానికి భారత్ ఎగబాకడం హర్షణీయమే. సైన్సు, గణితాల్లో విశేష ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ, ఆర్థిక తోడ్పాటు సమకూర్చే విధి విధానాలను రూపొందించాలి. పాఠ్యాంశాలను బట్టీపట్టే చదువుల్ని పక్కనపెట్టి, విద్యార్థుల్లో పరిశీలించే తత్వానికి, తర్కించే ధోరణికి పెద్ద పీట వేయాలి. బడిదశ నుంచి వ్యక్తిత్వ వికాసంతో ప్రయోగశాల దిశగా వెళ్లేందుకు వారికి సముచిత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి.
దక్షిణ కొరియా, జపాన్, అమెరికా లాంటి దేశాలు విద్యారంగానికి భారీ కేటాయింపులు ఇస్తూ పరిశోధనలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు నేటికీ స్థూల జాతీయోత్మత్తిలో ఒక్క శాతం మాత్రమేననే నగ్నసత్యం శాస్ర్తియవేత్తల మనోభావాలను కించపరిచే విధంగా ఉంది. మొన్నటికి మొన్న పిఎస్‌ఎల్‌వి 37 రాకెట్ ప్రయోగంలో మన శాస్తవ్రేత్తల రోదసీ వైజ్ఞానికత ప్రపంచ దేశాల శాస్తవ్రేత్తలనే అబ్బురపరిచాయి. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, ఆ దృశ్యాలను అంతరిక్షంలోనే చిత్రీకరించి ఇస్రో శాస్తవ్రేత్తలకు అందించడం మరో చారిత్రాత్మక ఘటనగా మారింది. ఆన్‌బోర్డు కెమెరాల ద్వారా రాకెట్ 4 దశలుగా విడిపోయే దృశ్యాలు, 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విడిచిపెట్టే దృశ్యాలు కన్నుల పండువ చేశాయి. భూమికి 505 కిలోమీటర్ల దూరంలో మొదట కార్బోశాట్ 2డి ఉపగ్రహాన్ని, అనంతరం 4 సెకన్ల వ్యవధిలో రెండు ఐఎస్‌ఎస్ ఉపగ్రహాలను విడిచిపెట్టిన దృశ్యాలు ఈ కెమెరాలు అత్యద్భుతంగా చిత్రీకరించాయి. రాకెట్ ప్రయోగం జరిగిన 18 నిముషాల నుండి 31 నిముషాల మధ్యలో అంటే కేవలం 13 నిముషాల వ్యవధిలో 101 నానో ఉపగ్రహాలను రాకెట్ అంతరిక్షంలోని కక్ష్యకు చేర్చింది. ఇలాంటి శాస్ర్తియ విజ్ఞానాన్ని అనంతంగా పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనా రంగానికి అన్ని విధాలా జనసత్వాలు సమకూర్చాలి.
-దాసరి కృష్ణ రెడ్డి
(ఆంధ్రభూమి సౌజన్యం తో)