Home News పుల్వామా ఘటనను ఖండించినందుకు కాశ్మీరీ పండిట్ విద్యార్థిపై దాడి.. నిందితులపై దేశద్రోహం కేసు

పుల్వామా ఘటనను ఖండించినందుకు కాశ్మీరీ పండిట్ విద్యార్థిపై దాడి.. నిందితులపై దేశద్రోహం కేసు

0
SHARE

కాశ్మీర్లోని  పుల్వామాలో ఆర్మీ జవాన్ల కాన్వాయ్ మీద జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించినందుకు బెంగళూరులోని కాశ్మీరీ పండిట్ విద్యార్థిపై అదే రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

డెక్కన్ హెరాల్డ్ కధనం ప్రకారం.. ఫిబ్రవరి 14న పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ సంస్థ భారత సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద జరిపిన దాడిని ఖండిస్తూ బెంగళూరులోని స్ఫూర్తి నర్సింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కాశ్మీరీ పండిట్ విద్యార్థి కౌశిక్ దేబనాధ్ తన ఫేస్ బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో దాడిని ఖండిస్తూ, కౌశిక్ భారత జవాన్లకు మద్దతుగా తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో అదే కళాశాలకు చెందిన ముస్తాక్, మజానూర్ అనే విద్యార్థుల, చినాయ్ నర్సింగ్ కళాశాలకు చెందిన మఖ్బూల్ అనే మరొక కాశ్మీరీ విద్యార్థితో కలిసి ఆ పోస్టులో ఉగ్రదాడికి మద్దతుగా కామెంట్లు పెట్టసాగారు. అంతేకాకుండా తమ కామెంట్లలో భారత జవాన్లను కించపరచసాగారు.

మరుసటి రోజు కళాశాల క్యాంటీన్ లో ముస్తాక్, మజూర్లను కలిసిన కౌశిక్ ఆర్మీకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడానికి ప్రశ్నించడంతో వారిద్దరూ కౌశిక్  మీద దాడికి తెగబడ్డారు.

ఘటన గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ డి. బాబు సూర్యానగర్ పోలీసులను ఆశ్రయించి దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడ్డ వారి నుండి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై దేశద్రోహం సెక్షన్ తో పాటు సెక్షన్ 153ఎ, 323, 504, 13 ప్రకారం కేసు నమోదు చేశారు.

ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని బెంగళూరు రూరల్ ఎస్పీ శివకుమార్ తెలిపారు. స్ఫూర్తి కళాశాలలో దాదాపు 25 మంది కాశ్మీర్ విద్యార్థులు ఉన్నారని, కౌశిక్ పై దాడికి తెగబడ్డవారు కూడా కాశ్మీర్ కు చెందినవారేనని ఎస్పీ తెలిపారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఇక్కడ విద్య కొనసాగిస్తున్నారు.

భారత ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో చదువుకుంటూ తీవ్రవాదులను సమర్ధించడంపై మండిపడ్డ స్థానికులు ఈ ఘటనపై ఆదోళన నిర్వహించగా, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.

పోలీసు కేసు విషయం తెలియగానే నిందితులు తమ ఫేస్ బుక్  పోస్టులను తొలగించినప్పటికీ అప్పటికే బాధితుడు కౌశిక్ వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సేవ్ చేసి ఉంచాడు.