Home News కాశ్మీర్ లో ప్రజాభిప్రాయసేకరణ జరగాలి – కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కాశ్మీర్ లో ప్రజాభిప్రాయసేకరణ జరగాలి – కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

0
SHARE

కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో తెలియడం లేదని, ప్రభుత్వానికి ఉన్న భయం, సందేహాలు బయటపెట్టాలని ఇటీవల రాజకీయ రంగంలో ప్రవేశించిన నటుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అధీకృత కాశ్మీర్ ను `ఆజాద్ కాశ్మీర్’ అంటూ పేర్కొన్న కమల్ `మెరుగైన దేశం’ గా రూపొందాలంటే `ఇలా వ్యవహరించకూడదు’ అని సలహా కూడా ఇచ్చారు. పుల్వామాలో సి ఆర్ పి ఎఫ్ జవానులపై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

`సైనికులు చనిపోవడాని కూడా సిద్ధపడి కాశ్మీర్ వెళతారని కొందరు అన్నప్పుడు నాకు విచారం కలుగుతుంది. అసలు సైనిక శక్తి ప్రయోగం చాలా పాతబడిపోయింది. ఇప్పుడు లోకం ఎంతో మారిపోయింది. ఇప్పుడు ఎవరు ఆహారం కోసం ఒకరినొకరు చంపుకోవడం లేదు. అలాగే యుద్ధాలు కూడా పూర్తిగా ఆగిపోయే రోజు వస్తుంది. ఈ విషయాన్ని గత 10 ఏళ్లలో అసలు తెలుసుకోలేకపోయామా?’ అంటూ కమల్ హాసన్ ప్రశ్నించారు.

`నేను మైయం పత్రిక నడుపుతున్నప్పుడే కాశ్మీర్ సమస్య పరిష్కారం గురించి వ్రాసాను. ఇప్పుడు ఇలా జరుగుతుందని ఆ రోజుల్లోనే నేను వ్రాసాను. ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదు? దేనికి భయపడుతున్నారు? వాళ్ళు మరోసారి దేశాన్ని విభజించాలని అడుగుతున్నారు. అంతే. వాళ్ళని మరోసారి ఎందుకు అడగరు?’ అని కమల్ హాసన్ ప్రశ్నించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాద్ కాశ్మీర్’గా అభివర్ణించిన ఆయన అక్కడ జిహాదిలను గొప్ప హీరోలుగా చిత్రీకరిస్తున్నారని, అది కూడా తప్పేనని అన్నారు. అలాగే భారత్ కూడా మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఇది ఎవరికి మంచిది కాదని విచారం వ్యక్తం చేశారు. మనం మెరుగైన దేశమని చూపాలంటే ఇలా వ్యవహరించకూడదని, అప్పుడే నూతన రాజకీయ సంస్కృతి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

కమల్ హాసన్ వ్యాఖ్యల పట్ల కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ గురించి ప్లెబిసైట్ నిర్వహించాల్సిన అవసరంలేదని, అందుకు ఒప్పుకుంటే ఆ ప్రాంతం వివాదాస్పదమైనదని అంగీకరించినట్లే అవుతుందని భారత్ మొదటి నుంచి చెపుతోంది. మరోవైపు ప్రజాభిప్రాయసేకరణ జరిపించాల్సిందేనని పాక్ పట్టుబడుతోంది. ఇప్పుడు కమల్ హాసన్ కూడా పాక్ పాటనే పాడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాద్ కాశ్మీర్ గా అభివర్ణించడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.