Home News FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్

FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్స‌వానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖ‌తర్

0
SHARE

`మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది.

మ‌నీలాండ‌రింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్ప‌డి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌కు నవంబర్ 20, 2022న దోహాలో జరిగే ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం పంప‌లేద‌ని ఖతర్ అధికారిక ఛానెళ్ల ద్వారా భారత్‌కు తెలియజేసింది. భారత్, ఖతర్ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసేందుకు ఇతర దేశాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రారంభోత్సవాన్ని VVIP గ్యాల‌రీ నుంచి వీక్షించడానికి ఇస్లామిస్ట్ జాకీర్ నాయక్‌ను అధికారికంగా ఆహ్వానించినట్లయితే, FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకకు భార‌త ఉప‌రాష్ట్రప‌తి జగదీప్ ధంకర్ పర్యటనను రద్దు చేసుకోవలసి ఉంటుందని భార‌త్ స్ప‌ష్టం చేసిన త‌ర్వాత ఖ‌తర్ ఈ ప్రకటన చేసింద‌ని ఇండియా టుడే పేర్కొంది.

ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధంకర్ నవంబర్ 20న ఖతర్‌లో సాకర్ స్టేడియాలను నిర్మించిన భారతీయ ప్రవాస బ్లూ కాలర్ కార్మికులతో సమావేశమ‌య్యారు. దేశంలోని 80 మిలియన్లకు పైగా ప్రజలకు ఆహార ధాన్యాలను అందించిన కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ధంఖర్ భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ మరుసటి రోజు ఖతార్ నుండి బయలుదేరారు.

అయితే వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారమే 2022 FIFA ప్రపంచ కప్‌కు ప్రారంభానికి ముందే దేశవ్యాప్తంగా మతపరమైన ప్రసంగాలు చేయడానికి జాకీర్ నాయక్ ఖతార్‌లోని దోహా చేరుకున్నారు. భారతదేశంలో మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు భారత పోలీసులు వెతుకుతున్నారు. 2016లో భారత్‌ నుంచి వెళ్లిన తర్వాత జకీర్‌ నాయక్‌ మలేషియాకు పారిపోయాడు. అత‌నికి చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను భారత ప్ర‌భుత్వం నిషేధించింది. మతపరమైన సంఘాలు, సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషపూరిత భావాలను ప్రోత్సహించ‌డం, అతని అనుచరులను ప్రేరేపించడం వంటివి చేశాడ‌ని ఆరోపణలున్నాయి.

2022 మార్చి 30న భారత హోం మంత్రిత్వం శాఖ (MHA) జాకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించి, వచ్చే ఐదేళ్లపాటు నిషేధిస్తూ నోటీసు జారీ చేసింది. అతను తన మతపరమైన చర్చల ద్వారా ముస్లిం యువకులను రాడికల్‌గా మారుస్తున్నాడని ఆరోపించింది. 2016లో ఢాకా పేలుడు కేసులో పాల్గొన్న ఉగ్రవాదులు బోధకుడి ప్రసంగాల ద్వారా ప్రభావితమయ్యారని అంగీకరించినట్టు నివేదిక‌లు చెబుతున్నాయి. 2019లో, హిందువులు, చైనీస్ మలేషియన్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన జకీర్ మలేషియాలో ప్రసంగాలు చేయకుండా నిషేధించింది.