రాఫెల్‌పై ఇంత రాద్దాంతం ఎందుకు?
దేశ రక్షణ విషయాలపై కూడా రాహుల్ గాంధీ రచ్చ చేస్తున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో కాంగ్రెస్‌కు మచ్చబడిన విషయం గతం. కాని ఆ స్మృతులు కాంగ్రెస్‌ను వెంటాడుతున్నాయి. దేశ సరిహద్దుల్లో ఎండనక, వాననక, కుటుంబాలకు దూరంగా కాపలాకాస్తున్న జవానులకు అందించే శతఘ్నుల కొనుగోలులోను కుంభకోణం చేసిన కృతఘ్నులు కాంగ్రెస్ నేతలు. ఫ్రాన్సు దేశంతో కుదిరిన రాఫెల్ ఒప్పందం అనేక సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. దసాల్ట్ పేరుగల ఫ్రెంచి విమాన నిర్మాణ తయారీ సంస్థ నుంచి 36 యుద్ధ విమానాలను కొంటున్నట్లు 3 ఏళ్ళ క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనచేశారు. రష్యా, అమెరికా, యూరపులను కాదని ఈ ఒప్పందం ఫ్రాన్సుతో ఖరారు చేశారు. భారత్ ఈ నిర్ణయం 2012లోనే తీసుకుంది. భారత రక్షణ రంగం బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఈ రాఫెల్ విమానాలు రెండు ఇంజన్‌లు కలిగి ఉంటాయి. యూపిఎ ప్రభుత్వం 126 విమానాలను కొనుగోలు చేయాలని తీసుకున్న తన నిర్ణయాన్ని వాయిదావేస్తూ వచ్చింది. దశాబ్ద కాలం యూపిఎ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. పైగా యూపిఎ-2 హయంలో అనేక అవినీతి కుంభకోణాలు కూడా వెలుగు చూశాయి. కనుక ఇది సాధ్యంకాలేదు. దీనివల్ల భారత వైమానికసైన్య సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు మోదీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి, 2016లో ఈ ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం తయారీ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం భారతరక్షణ పరిశోధన సంస్థ డిఆర్‌డిఒతో పంచుకుంటాయి. ఈ ఒప్పందం కుదరగానే కాంగ్రెస్ పార్టీ ఎన్‌డిఏ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టు ఒకపెద్ద విఫలప్రయోగం అని విమర్శించింది. కాని మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇడియా’కు కొత్త భాష్యం ఇచ్చింది. ఇతరుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగం.
రాఫెల్ ట్విన్ ఇంజన్ విమానం బహుళ ప్రయోజనాలు కలది. పదేళ్ళ క్రితం ధరలకు కొంత ద్రవ్యోల్బణం, డాలరు విలువ తోడవుతాయి. అయినప్పటికీ యుపిఎ కంటె ఎన్‌డిఎ హయాంలో చేసుకున్న ఒప్పందంలో ఒక విమానం ధర తక్కువగా ఉంది. ఈ ఒప్పందంలో అనేక విషయాలకు సంబంధించిన కొనుగోలు వివరాలు చూస్తే ఒప్పందం చౌకగానే జరిగిందని అర్థం అమవుతుంది. కానీ ఈ సాంకేతికాంశాలు, రక్షణ రహస్యాలు, పైగా ఇరు దేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందం తాలుకు విశ్వసనీయత లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధి ఈ ఒప్పందంపై నానాయాగీ చేస్తున్నారు. కొనుగోలు చేయనున్న 36 విమానాలకు సంబంధించి 15% అడ్వాన్సు చెల్లించారు. దీనికి తోడు మొత్తం ధర 58000 కోట్ల రూపాయల్లో 30% ప్రాన్సు దేశం భారత సైనిక వైమానిక పరిశోధనా రంగంలో పెట్టుబడులు పెడుతుంది. 20% రాఫెల్ విడిభాగాల తయారీలో కూడా పెట్టుబడి పెడుతుంది. ఈ మేరకు అదనపు ఒప్పందం కూడా కుదిరింది.
భారత్ – ఫ్రాన్సు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ధరల వివరాల పట్టిక. | |||
కొనుగోలు వివరాలు | యూపిఎ | ఎన్‌డిఎ | ఆదా అయిన మొత్తం |
ఒక జెట్‌కు (అధిక ధరలతో) | 1705 కోట్లు | 1646 కోట్లు | 59 కోట్లు |
ఒక జెట్‌కు (అధికధర కాకుండ) | 1627 కోట్లు | 1372 కోట్లు | 255 కోట్లు |
మొత్తం ధర | 1,72,185 కోట్లు | 59,262 కోట్లు | 1,12,923 కోట్లు |
సరాసరి/ఒక జెట్‌కు | 911 కోట్లు | 688 కోట్లు | 223 కోట్లు |
మొత్తం ధర (ఒప్పందం) | 1,10,772 కోట్లు | 24,785 కోట్లు | 85,987 కోట్లు |
ఆయుధాలు, ఇతర సామాగ్రి | 15,823 కోట్లు | 8955 కోట్లు | 6863 కోట్లు |
నిర్ధిష్ఠ అధిక ధర | 9855 కోట్లు | 9855 కోట్లు | |
శిక్షణ, సాంకేతిక సహాయం కోసం | 14027 కోట్లు | 5897కోట్లు | 8130 కోట్లు |
మౌలిక సదుపాయలు | 17,884 కోట్లు | ఏ ఖర్చు లేదు | – |
నిజానికి భారత్ రక్షణావసరాలపై చాలా విశ్లేషణ జరిగింది. ఇది యుపిఎ హయాంలోనే జరిగింది. 10 ఏళ్ల పాటు ధరలపై యుపిఎ చర్చలు జరిపింది. పశ్చిమంలో పాకిస్తాన్, మరోప్రక్క చైనాను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం వాయుసేనకిచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా మోదీ ప్రభుత్వం అనేక సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో అణుశక్తిని మాధ్యమంగా చేసుకొని యుద్ధం చేసే వెసులుబాటు కూడా వుంది. యుపిఎ ప్రభుత్వం హయంలో జరిగిన చర్చల్లో సామాన్య యుద్ధ విమానం కొనుగోలు మాత్రమే ప్రధానాంశమైంది. 2001లో కార్గిల్ యుద్ధం తరువాతనే ఈ తరహా విమానాల విషయమై చర్చ జరిగింది. 2003లో నిర్ణయం రికార్డు చేయబడింది. 2004 నుంచి 2014 వరకు యుపిఎ చేతులు ముడుచుకుని కూర్చుంది. రాఫెల్ ధర నిర్ణయం 2007 లో జరిగిన తరువాత కూడా యుపిఎ తాత్సారం చేసింది. కాలంతో బాటు ధర పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, విదేశీ మారకం ద్రవ్యంలో హెచ్చుతగ్గులు వంటివి కూడా ఇందుకు తోడవుతాయి. ధరలు పెరగడంవల్లనే కొనాలనుకున్న ఎయిర్ క్రాఫ్ట్‌లను 36కు కుదించింది ఎన్‌డిఎ ప్రభుత్వం. పైగా కొన్ని సాంకేతికాంశాలను కూడా జతచేసి ఎయిర్‌క్రాప్ట్‌ల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. ధర ఎంత పెరిగినా యుపిఎ ప్రభుత్వం సమయంలో, అంటే 2007లో నిర్ణయించిన ధర కంటే తక్కువగానే ఇపుడు సరఫరా చేసే ఎయిర్‌క్రాప్ట్‌ల ధర తక్కువగా వుండాలని భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వ నేతలు భావించారు. ఈ లెక్కన ప్రస్తుతం ఎన్‌డిఎ కొనాలనుకుంటున్న రాఫెల్ విమానాలు 9% తక్కువ ధరకే లభిస్తున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
ఈ ఒప్పందం తాలూకు ధరల నిర్ణయంలో ధర, ఒప్పంద విషయాలను నిర్ణయించే ప్రైస్ నెగోషియేషన్ కమిటీ, కాంట్రాక్టు నెగోషియేషన్ కమిటి 14 నెలలపాటు సంప్రదింపులు జరిపాయి. ఇవి లేకుండా ఏ ప్రభుత్వమూ పని చేయదు. ఇవన్నీ జరిగాయి. దీని తరువాతనే క్యాబినెట్ కమిటికి ధరల సిఫారసు వెళ్లింది. ఇవన్నీ లేవని రాహుల్ గాంధీ బుకాయించడం కేవలం ఎన్‌డిఎపై బురద జల్లే ప్రయత్నమే. పైగా ఈ ఒప్పదంలో గోప్యత (secrecy) క్లాజు లేదని నాటి రక్షణ మంత్రి ఆంటోని చెప్పగలరా? రాహుల్‌గాంధీకి ఈ తరహ ఒప్పందం 2008లో జరిగిందని తెలియకపోవడం శోచనీయం. గోప్యత క్లాజు వుందని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టంచేసింది కూడా.
రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ ఇరు ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఒప్పందాలను భద్రతా కారణాల దృష్ట్యా బయటపెట్టలేమని చెప్పారు. సరిగ్గా ఇదే మాట నాడు ప్రభుత్వంలో ఉండగా మన్మోహన్‌సింగ్, ఆంటోనీలు అన్నారు. జెట్ విమానాలతో బాటు వచ్చే ఆయుధాల వివరాలను కూడా భద్రతా కారణాల దృష్ట్యా వివరించలేమని ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం అంటోంది.
ఫ్రాన్సులోని దసాల్ట్ సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ను భాగస్వామిగా చేసుకోవడం పట్ల కూడా కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోంది. నిజానికి రిలయన్స్ ది ఫిన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరోస్పేస్, దసాల్ట్ ఏవియేషన్‌తో కలిసి దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్‌గా జాయింట్ వెన్చర్‌గా ఏర్పడ్డాయి. ఇవి రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదు. రిలయన్స్ అధినేత అంబానీ ఇదివరకే రాహుల్ గాంధీకి ఈ విషయమై హెచ్చరిక జారీచేశారు. తాజాగా ఆయనపై 5000 కోట్ల పరువు నష్టం దావావేశారు. రాహుల్ గాంధీకి చెందిన నేషనల్ హెరాల్డు పత్రిక ఈ విషయమై అనేక అవాస్తవాలు ప్రచురించింది. 2007 ఒప్పదంలో హెచ్‌ఎఎల్ ప్రస్తావనవుంది. కాని హెచ్‌ఎఎల్‌కు తగిన సామర్థ్యం ఆ సమయంలో లేని కారణంగానే ఆ ఒప్పందాన్ని ఫ్రాన్సు రద్దు చేసుకుంది. ప్రస్తుతం హెచ్‌ఎఎల్ కూడా తేజస్ విమానాలు తయారు చేస్తున్నది. హెచ్‌ఎఎల్‌కు ఇపుడు పూర్తిస్తాయిలో వ్యాపారం కూడా వుంది.
కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లు ఇందులో కుంభకోణం ఆనవాళ్ళు మచ్చుకైనా కానరావు. దీనిని ‘బిజెపి బోఫోర్స్’గా చిత్రీకరించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తున్నా, ఆ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే బోఫోర్సు కుంభకోణంలో ఖత్రోచి లాంటి మధ్యవర్తులు బయటపడ్డారు. వాళ్ల బ్యాంకు ఖాతాలు బయటపడ్డాయి. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన మొత్తాలు తెలిసొచ్చాయి. ఇవన్నీ సాక్షాత్తు స్వీడన్ ప్రభుత్వపు విచారణలోనే బయటపడ్డాయి. కానీ రాఫెల్ ఒప్పందం ఫ్రాన్స్, భారత ప్రభుత్వాల మధ్య జరిగింది. ఇందులో మధ్యవర్తులెవరూ లేరు.
ఈ మధ్య లండన్ జర్మనీల పర్యటించిన రాహుల్ డోక్లామ్ సమస్యను మోదీ ప్రభుత్వం సరిగా చక్కబెట్టలేదని ఆరోపణ చేశారు. కానీ `మీరు ప్రధాని స్థానంలో వుంటే ఏం చేస్తారు’ అని అడిగితే మాత్రం డోక్లాం గురించి నాకు వివరాలు తెలియవని తప్పుకున్నారు. ఇలా ఏ విషయంలోనూ కనీస పరిజ్ఞానం, అవగాహన లేకుండానే ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆవిధంగా తన అపరిపక్వతను బయటపెట్టుకుని అభాసు పాలవుతున్నారు. రక్షణబలగాలలో అత్మస్థైర్యం నింపే రాఫెల్ ఒప్పందాన్ని ఆయన నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజమవుతుందని భ్రమపడుతున్నారు.
– తాడేపల్లి హనుమత్ ప్రసాద్