Home News రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణలు చెప్పాలి – విశ్వహిందూ పరిషత్

రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణలు చెప్పాలి – విశ్వహిందూ పరిషత్

0
SHARE

ఒక విదేశీ పత్రికలో వచ్చిన అర్ధరహితమైన కధనాలను ఆధారం చేసుకుని జాతీయవాద సంస్థలపై అసత్య ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాండే డిమాండ్ చేశారు. తప్పుడు కధనాలు ప్రచురించిన అమెరికా పత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. బజరంగ్ దళ్ `ప్రమాదకరమైనదని’ నిర్ధారించుకున్న తరువాత కూడా ఫేస్ బుక్ ఆ సంస్థను తమ ప్లాట్ ఫామ్ వాడకుండా నిషేధించలేకపోయిందని, ఇందుకు రాజకీయ ఒత్తిళ్లతోపాటు భౌతికమైన దాడులు జరుగుతాయనే భయమే కారణమంటూ అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కధనాన్ని ప్రచురించింది. ఈ కధనాన్ని ఆధారం చేసుకుని బజరంగ్ దళ్ వంటి సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తున్నదని, రాజకీయ ఒత్తిడులకు లొంగి ఫేస్ బుక్ ఆ సంస్థను నిషేధించలేకపోయిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే బజరంగ్ దళ్ విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవంటూ భారతదేశంలో ఫేస్ బుక్ కార్యకలాపాలు పర్యవేక్షించే అజిత్ మోహన్ పార్లమెంటరీ సంఘం ముందు వివరణ ఇచ్చారు. దీనితో వాల్ స్ట్రీట్ జర్నల్ కధనంతోపాటు, దాని ఆధారంగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కూడా అసత్యమని, దురుద్దేశపూరితమైనవని తేలిందని విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజలమధ్యన, ప్రజల కోసం పనిచేసే బజరంగ్ దళ్ వంటి దేశభక్త సంస్థపై ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. కరోనా కష్టకాలంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఇది ఆ సంస్థ కార్యకలాపాలు ఎలాంటివో తెలియచెపుతుందని వ్యాఖ్యానించింది.

కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం ముందు విచారణకు హాజరైన ఫేస్ బుక్ అధినేత అజిత్ మోహన్ అమెరికా పత్రిక ప్రచురించిన కధనంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఆ కధనంలో ఉటంకించిన వ్యక్తుల కధనాలు కూడా అసత్యమని, అసలు ఆ వ్యక్తులకు తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కానీ తప్పుడు కధనాలు ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్ ను ఎందుకు సంజాయిషీ కోరలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. అలాగే ఇలాంటి `దుష్ప్రచారానికి’ సంబంధించి నిజానిజాలు నిర్ధారించి, చర్యలు తీసుకునే పద్దతి, ప్రక్రియ ఏది లేదని కూడా ఆయన వెల్లడించారు.