కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు నిరసనగా అనేక ప్రతిపక్ష పార్టీలు ‘రైతులకు మద్దతుగా ఉద్యమం’ పేరిట ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వామపక్ష భావజాల పత్రిక ‘ప్రజాశక్తి’ ప్రచురించిన వార్త ఒకటి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యంతో పాటు విస్మయానికి గురిచేసింది.
డిసెంబర్ 15, 2020 నాడు “కిసాన్ కు జైకొట్టిన జవాన్” శీర్షికన ఒక వార్త ప్రచురించింది. రైతులకు సంఘీభావంగా 25 వేలమంది భారత జవాన్లు తమకు ప్రభుత్వం ప్రదానం చేసిన గౌరవ ‘శౌర్యచక్ర’ పతకాలు వెనక్కి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నట్టు ఆ వార్త సారాంశం.
నిజంగానే సంచలనం కలిగించిన ఈ వార్త తెలుగు పాఠకులను ఆశ్చర్యంతో పాటు విస్మయానికి గురిచేసింది. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన సైనికులు తమకు ప్రభుత్వం ఇచ్చిన పతకాలు వెనక్కితిరిగి ఇవ్వటం ఏమిటి అని అనుకునేలోపు కేంద్రప్రభుత్వపు సమాచార శాఖ దీనిపై స్పందించింది.
ప్రజాశక్తి ప్రచురించిన ఈ వార్త పూర్తి అవాస్తవం అని తేల్చిచెప్పింది. అంతే కాకుండా అసలు 1956 నుండి 2019 వరకు 2048 మంది సైనికులు మాత్రమే శౌర్యచక్ర పతకాలు పొందారని కేంద్ర సమాచార శాఖ తెలియజేసింది.
ఈ తప్పుడు వార్తపై కేంద్ర రక్షణ స్పందిస్తూ ప్రజాశక్తి అనే తెలుగు వార్తాపత్రికలో ప్రచురించిన నివేదిక అబద్ధమని ప్రకటన విడుదల చేసింది. ఇది పూర్తిగా అబద్ధం, నిరాధారమైనదే కాకుండా రక్షణ దళాల ప్రతిష్ట, గౌరవాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఉందని రక్షణ శాఖ పేర్కొంది. ఇలాంటి అవాస్తవమైన, దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని కేంద్ర రక్షణ శాఖ ఆ పత్రికను హెచ్చరించింది.
Source : ORGANISER Press Information Bureau