- దీపావళి నాటికి కేసును గెలుస్తాం
- మసీదులు ప్రార్థనా స్థలాలే.. ధార్మిక సంస్థలు కాదు
- భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు
ఆయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని, దానిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని విరాట్ హిందూ సంఘం(వీహెచ్‌ఎస్) వ్యవస్థాపకులు, భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. ఇప్పటికే అలహాబాదు కోర్టు తీర్పు వెలువరించిందని, జులైలో సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుందని, దీపావళి నాటికి కచ్చితంగా గెలిచితీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థల ప్రాంగణంలో విరాట్ హిందూ సంఘం-తెలంగాణ ఆధ్వర్యంలో ‘హౌ టూ బిల్డ్ రామమందిర్ ఇన్ అయోధ్య లీగల్లీ’ అనే అంశంపై బహిరంగ సభ జరిగింది.
సభలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ..రామమందిర నిర్మాణంతోనే భారతదేశ పునర్‌నిర్మాణం జరుగుతుందన్నారు. ఇక్కడున్న అన్యమతస్థులంతా పూర్వ హిందువులేనని, మతమార్పిడి కారణంగా ఆయావర్గాలుగా ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో ఓ మారు తాను డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిజానిజాలు నిగ్గుతేలుతాయని ఓవైసీకి సవాలు విసిరానని గుర్తుచేశారు. ఎక్కడెక్కడైతే ముస్లింలు, క్రైస్తవులు రాజ్యమేలారో ఆయాదేశాల్లో ప్రజలు 100శాతం ఆయా మతస్థులుగా మారిపోయారని చెప్పారు. 800ఏళ్లు మొఘల్‌లు, 200 ఏళ్లు బ్రిటిష్‌వారు భారత్‌ను పాలించినా నేటికీ ఇక్కడ 80శాతం మంది ప్రజలు హిందువులుగానే ఉండడానికి కారణం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనం, సాధూ సంత్‌ల మార్గదర్శనమేనని చెప్పారు. మసీదు ప్రార్థన చేసే పవిత్ర స్థలమే తప్ప అది ధార్మికస్థలం కాదన్నారు. ఆనాడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు నిజమైన హిందుత్వవాది కాబట్టే అప్పుడా ఘటన జరిగిందన్నారు. నిజంగా ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనన్నారు. జమ్ము కశ్మీర్‌ది పెద్ద సమస్యే కాదన్నారు. అటువైపు మనమంతా దృష్టిని సారిస్తే పది రోజుల సమయం పట్టదన్నారు.
పరిపూర్ణానంద స్వామి ప్రసంగిస్తూ..‘భారత్ మాతాకీ జై’అని గొంతెత్తి నినదిస్తాం..అవసరమైతే చేతులెత్తి తమ సత్తాను చాటుతామని చెప్పారు. రాముడు లేకుండా రామరాజ్యం సాధ్యం కాదని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాల్సిందేనన్నారు. 2018లో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. అందుకు ప్రస్తుత యూపీ సీఎం యోగి సిద్ధంగా ఉన్నారని వివరించారు. సభలో వీహెచ్‌ఎస్ జాతీయ ప్రధానకార్యదర్శి జగదీశ్‌శెట్టి, కార్యదర్శి గోవింద్‌హరి, ఉపాధ్యక్షుడు సుధీష్ రాంబొట్ల, నిర్వహణ కమిటీ పక్షాన శంకర్‌యాదవ్ పాల్గొన్నారు.
(ఈనాడు సౌజన్యం తో)