“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు
రాణి గైడిన్లియు (26 జనవరి 1915- 17 ఫిబ్రవరి 1993)
మన దేశంలో చాలామంది భారత స్వాతంత్ర్యోద్యమకారులలాగే, ఈమె చరిత్ర కూడా మరుగున పడిపోయింది. 4 మే 2014 తేదిన, ఈమె జన్మ వార్షికోత్సవo జరపడానికి, గౌహతిలో `రాణి గైడిన్లియు జాతీయ స్మారక కమిటీ’ ఏర్పాటు చేసిన తరువాతే స్వాతంత్ర్యోద్యమoలో ఈమె వీరవృత్తాంతం, ఆధ్యాత్మిక పునరుద్ధరణలో ఈమె పాత్ర ప్రజలకు పరిచయమయ్యాయి.
24 ఆగస్ట్ 2015న, `రాణి గైడిన్లియు జన్మశతాబ్ది ఉత్సవం’లో మాట్లాడుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ `బ్రిటిష్ వారిని ఎదిరించిన రాణి గైడిన్లియు `నాగా ఉద్యమం’, స్వాతంత్ర్యోద్యమ ఉజ్వల చరిత్రలో, భారతీయ ఐక్యత సమగ్రతలకు చిహ్నమని’ కొనియాడారు. పూర్వ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి కూడా ఆమెని ఒక గొప్ప స్వాతంత్ర్య సమర సేనానిగా అభివర్ణించారు.
చాలా చిన్నవయసులోనే రాణి గైడిన్లియు, తన నాగా జాతి ప్రజలను ఉద్బోధిస్తూ, బ్రిటిషు రాచరికాన్ని ఎదిరించింది. `మన నాగా జాతీయులు స్వతంత్రులు, మనని ఏలడానికి, మనచేత బలవంతంగా పన్నులు కట్టించుకుని, నిర్బంధ కార్మికులుగా మనచేత వెట్టిచాకిరి చేయించుకునే తెల్లదొరలను మన పాలకులుగా మనం గుర్తించము, మనపై వారికి ఎటువంటి అధికారం లేదు’ అని ఆమె బ్రిటిషువారిని ఎదిరించడంతో, బ్రిటిష్ పార్లమెంటు ఆమెని `ఈశాన్య భారత ఉగ్రవాది’ గా అభివర్ణించింది! ఈ వీరవనితను గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం, భారతజాతికి గర్వకారణం.
ప్రారంభం
తన 13వ ఏట, మణిపూర్ నాగాలాండ్ల నుంచి బ్రిటిషువారిని తరిమేయడానికి, దేశ స్వాతంత్ర్యానికి పిలుపునిచ్చి, స్వాతంత్ర్య ఉద్యమంలో చేరిన రాణి గైడిన్లియు, అతిచిన్నవయసులో తన 16వఏట జైలుపాలై, దాదాపు పదిహేనేళ్ళు 1933-1947వరకు జైలు జీవితం గడిపి, స్వాతంత్ర్యం తరువాత విడులయారు. అతి సుదీర్ఘ జైలు జీవితం గడిపిన వారు ఈమె ఒక్కరే.
26జనవరి 1915తేదిన రోంగ్మెయి సామజిక వర్గానికి చెందిన నుంగ్కావు గ్రామంలో, నేటి మణిపూర్ రాష్ట్రంలోని తామేన్గ్లోంగ్ జిల్లాలో, రాణి గైడిన్లియు జన్మించారు. వెనకబడిన ప్రాంతానికి చెందిన ఈమె పాఠశాలకు వెళ్ళలేదు, కాని స్వాతంత్ర్య స్ఫూర్తి నిండుగా ఉన్న ఈమె, తన బంధువు `హైపోజడోనాంగ్’ ప్రేరణతో ఉద్యమంలో పాల్గొంది.
సంఘర్షణ
పురాతన నాగాజాతి సంప్రదాయాల స్ఫూర్తితో, అన్ని నాగావర్గాలను కలిపి `హైపోజడోనాంగ్’ బ్రటిషువారిని ఎదిరించి పోరాడాడు. బ్రిటిష్ పాలకులు ఫిబ్రవరి 1931లో ఆయనను అరెస్ట్ చేసి, 29ఆగస్ట్ 1931 తేదిన ఇంఫాల్ జైలులో ఉరి తీసారు. ఆయన మరణంతో, ఉద్యమం నాయకత్వం 16సం రాణి గైడిన్లియు పైబడింది. ఆమె తన `జేలియనగ్రోంగ్’ వర్గాలను కూడదీసి, బ్రిటిషువారికి పన్నులు చెల్లించవద్దని కోరి, దేశ స్వాతంత్ర్యానికై పోరాడింది. ఆమె మాటమీద అన్ని నాగావర్గాలు, బ్రిటిష్ పాలకులను ఎదిరించి సహాయనిరాకరణ ప్రారంభించారు.
రాణి గైడిన్లియుని అరెస్ట్ చేయడం కొరకు, పాలకులు ప్రతి గ్రామం, కొండగుట్టలు గాలించారు; కాని ఆమె తన అనుయాయులతో కలిసి, ఈనాటి ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం,నాగాలాండ్, మణిపూర్లలో, పర్వతశ్రేణులలో రహస్యంగా తిరుగుతూ, బ్రిటిషు పాలకులను ఎదిరించే ఉద్యమకారులుగా ప్రజలను తీర్చిదిద్దింది. ఈశాన్యoలో పెరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి, బ్రిటిష్ ప్రభుత్వం `అస్సాం రైఫిల్స్’ కెప్టెన్ మక్డోనాల్డ్ నాయకత్వంలో సైన్యాన్ని పంపించి, గాలించి, `పులోమి’ గ్రామంపై దాడిచేసి, సైన్యంతో ఆమెని చుట్టుముట్టి 17అక్టోబర్1932 తేదిన నిర్బంధించారు. పదినెలలు జరిగిన కోర్టువిచారణలో, `సైన్యంపై దాడి, హత్యా’ నేరాలకింద, ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. 1933- 1947 మధ్య కాలంలో, గువహతి, షిల్లాంగ్, అయిజాల్, తురా జైళ్లలో ఆమె కారాగార శిక్ష అనుభవించారు.
1937లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రు, అస్సాం పర్యటించినపుడు, `నాగరాజ ఉద్యమం’ గురించి, జడోనాంగ్ ఉరి గురించి తెలుసుకుని, గైడిన్లియుని `రాణి’ అని పేర్కొని కొనియాడారు. షిల్లాంగ్ జైల్లో, అక్కడి చీకటి కారాగృహంలో ఆమెని కలుసుకుని, అక్కడి పరిస్థితులకి నెహ్రూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
18 డిసెంబర్ 1937తేదిన `హిందూస్తాన్ టైమ్స్’ దినపత్రికలో నెహ్రూ వ్యాసం వ్రాస్తూ, `అక్కడి పర్వతాల్లో ఉన్న ఈ ధీర యువతి గాంధీగారి స్వాతంత్ర్య ఉద్యమం గురించి విని, తన ప్రజల స్వాతంత్ర్యానికై కలలు కని, వారిని ఉద్యమింపచేసింది. ఈ చిన్నారి గురించి భారతావనికి తెలియదు’ అని అన్నారు. ఎప్పటికైనా స్వతంత్ర భారతం ఆమె గురించి తెలుసుకుంటుందని, ఆమెని జైలు నుంచి విడిపించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని తాను కోరుతానని అంటూ, నెహ్రూ ఆమెని `నాగాలకు రాణి’ అని ప్రశంసించారు. 14సంవత్సరాలు కారాగార శిక్షానంతరం, దేశ స్వాతంత్ర్యం తరువాత 1947లో తురా జైలు నుంచి ఆమె విడుదలయారు.
స్వాతంత్ర్యానంతరం అన్ని నాగా `జేలియనగ్రాంగ్’ వర్గాలను రాణి గైడిన్లియు ఒకతాటిపైకి తీసుకురావడం, నాగా సంప్రదాయ `హెరాకా’ మతాన్ని ఆమె తిరిగి పునరుద్ధరించడం చూసి, `ఏ.జెడ్.ఫిశో’ నాయకత్వంలోని వేర్పాటువాద `నాగా నేషనల్ కౌన్సిల్’ భరించలేకపోయింది. అప్పటికే విపరీతంగా వ్యాపించిన మతమార్పిడులవల్ల బలపడిన `నాగా చర్చ్’, రాణి గైడిన్లియు నాగా సాంప్రదాయ పునరుద్ధరణను ఖండిస్తూ, ఇది క్రైస్తవానికి వ్యతిరేకమని ప్రచారం చేసారు.
ఏ.జెడ్.ఫిశో’ వేర్పాటువాద `నాగా నేషనల్ కౌన్సిల్’ తో పోరాడడానికి 1960-66 మధ్య ఆమె పర్వతాల్ల్లో అజ్ఞ్యాత జీవితం గడుపుతూ, 400/500 రైఫిళ్ళతో 1000మంది సైన్యంతో, తమ సంప్రదాయిక సంస్కృతి, `హెరాకా’ మతం రక్షించుకోవడానికి, `రాణి పార్టీ జేలియనగ్రాంగ్ ప్రభుత్వాన్ని’ ఆమె నడిపింది. రాణి గైడిన్లియు భారత జాతీయవాది అని స్పష్టంగా తెలిసిన ఇందిరాగాంధీ ప్రభుత్వం, నాగాలాండ్ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెని అజ్ఞ్యాతం నుంచి బయటకు వచ్చి తమ ప్రభుత్వంలో చేరమని ఆహ్వానించాయి. ఆమె చివరికి జనవరి 1966లో బయటకు వచ్చారు, ఆమె సైన్యం `నాగాలాండ్ పోలీస్’లో భాగం అయింది. 1966-1992 వరకు ఆమె నాగాలాండ్ రాజధాని కొహిమాలో నివసించారు.
జాతీయ సంస్థలతో అనుబంధం:
రాణి గైడిన్లియు ఎల్లప్పుడూ, ఇతర జాతీయ సంస్థలు- వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం, విశ్వ హిందూ పరిషద్, విద్యా భారతి సంస్థలతో అనుబంధంగా పనిచేసారు. 1969 `జోర్హాట్’లో జరిగిన హిందూ సదస్సులో ఆమె ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ ఎంఎస్ గోల్వాల్కర్ ను కలిసారు. జనవరి 1979లో ప్రయాగరాజ్ లో జరిగిన 2వ ప్రపంచ హిందూ సదస్సుకి వారు హాజారయారు. ఆమె దేశమంతా పర్యటించి, నాగాలు వేర్పాటువాదులు కాదని వారిలో అధిక శాతం హిందువులేనని, భారాతదేశంలోనే జీవించాలని కోరుకుంటున్నారు అని ప్రజలకు తెలియచేసారు. అఖిల భారత స్వాతంత్ర్యోద్యమకారుల సంఘానికి ఆమె అధ్యక్షులుగా కూడా ఉన్నారు.
అవార్డులు, గౌరవ పురస్కారాలు
నాగాలను భారతజాతి ప్రదానస్రవంతిలో కలపడానికి ఆమె చేసిన సేవకు కేంద్ర ప్రభుత్వం 1972లో `తామ్రపత్రం’తో రాణి గైడిన్లియుని గౌరవించింది. 1981లో పద్మభూషణ్, 1983లో వివేకానంద సేవా సమ్మాన్, ఆమె మరణానంతరం 1996లో `బిర్సా ముండా’ సత్కారాలతో ఆమెను గౌరవించారు. 1996లోనే ఆమె పేరు మీద 1రూపాయి స్టాంప్ విడుదలైంది.
స్త్రీ శక్తి పురస్కార్
2000వ సంవత్సరoలో కేంద్రప్రభుత్వం, ఐదుగురు స్త్రీమూర్తుల పేరు మీద స్థాపించిన `స్త్రీ శక్తి పురస్కార్’ అవార్డులలో, `రాణి గైడిన్లియు’ పేరు ఒకటి. విశాఖపట్నం `నేషనల్ కోస్ట్ గార్డ్’ `రాణి గైడిన్లియుని’ పేరు మీద ఒక కాపలా-నౌకను ఏర్పాటు చేసింది. ఆమె శతజన్మ సంవత్సరం 2015లో, ఆమె స్మృత్యర్థం కేంద్ర ప్రభుత్వం, ఆమె పేరు మీద, రూ. 100 మరియు రూ. 5 నాణాలు విడుదల చేసింది. .
మరణం – స్మృతి
1992లో కుకి-నాగా సంఘర్షణ మొదలైన తరువాత ఆమె రాజకీయ వ్యాపకాలు ఆగిపోయాయి. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా రాణి గైడిన్లియు తన స్వంత గ్రామంలో, 17 ఫిబ్రవరి 1993తేదిన తుదిశ్వాస వదిలారు, ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అప్పటి ప్రధాని శ్రీ పివి నరసింహారావుతో సహా యావద్భారతదేశం సంతాపంతెలిపింది.
స్వాతంత్ర్యోద్యమ యోధురాలిగా, జాతీయవాదిగా, భారతమాత ప్రియపుత్రికగా, రాణి గైడిన్లియు పేరు, భారత చరిత్రలో చిరస్మరణీయoగా మిగిలిపోతుంది.
– డా. సోనియా, ఢిల్లీ విశ్వవిద్యాలయo