Home News ఉత్తమ ఎన్జీవో గా ఎంపికైన రాష్ట్రీయ సేవా భారతి

ఉత్తమ ఎన్జీవో గా ఎంపికైన రాష్ట్రీయ సేవా భారతి

0
SHARE
కరొనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్రీయ సేవా భారతి ఉత్తమ ఎన్.జి.ఓ గా ఎంపికయింది.
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇండియా టుడే ప్రతి ఏటా “హెల్త్ గిరి” పేరిట ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. గతంలో ‘సఫాయి గిరి’ పేరిట ఈ అవార్డును ప్రధానం చేసేవారు. 9 కేటగిరీ ల్లో  వలస కార్మికులకు తోడుగా నిలిచిన ఎన్. జీ.వో కేటగిరీలో రాష్ట్రీయ సేవా భారతి ఎంపికయింది. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి  విధించిన లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సేవాభారతి ఆధ్వర్యంలో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశారు. వారికి ఆహారం, నిత్యావసరాలు అందజేశారు. కొన్ని చోట్ల నగదు రూపంలో కూడా ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇండియాటుడే కి లేఖ రాశారు. “హెల్త్ గిరి” పేరిట  కరోనా వారియర్స్ ను సత్కరించడం అభినందనీయమని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరోనా వారియర్స్ చేస్తున్న సేవలు గాంధీజీ చేసిన నిస్వార్థ సేవలను ప్రతిబింబిస్తూ ఉన్నాయని అన్నారు. వారు చేస్తున్న సేవలు దేశ ప్రజలకు ఆదర్శనీయంగా, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మరింత బలోపేతం చేయడానికి ప్రోత్సహిస్తున్నాయని మోడీ ఇండియా టుడే కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సేవా భారతి 2001లో స్థాపించబడింది. ఇది  ప్రభుత్వేతర, రాజకీయేతర, లాభాపేక్ష లేని మానవ సేవయే మాధవ సేవ అని నమ్మే ఒక స్వచ్ఛంద సంస్థ.  ప్రారంభం నుండి ఈ సంస్థ అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తల బృందంతో నిబద్దత, అంకితభావంతో  సేవా కార్యక్రమాలు చేస్తోంది.
దేశంలో వివిధ చోట్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సేవా భారత్ వెంటనే స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది. వరదల్లో చిక్కుకున్న వారికి పునరావాసాలు ఏర్పాటుచేసి వారికి ఆహారం, నిత్యావసర సరుకులను అందిస్తోంది. అంతేకాకుండా నిరుపేదలకు సాయం చేస్తూ వారి కుటుంబంలోని చిన్నారులకు విద్యను అందిస్తోంది. ఇలా దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిస్సహయకలకు అండగా నిలుస్తోంది.
Source : Organizer