హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ లో రూ 3,300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని
(అటల్ టన్నెల్) ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఉన్నారు.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2002 మే 6న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఇప్పటికీ అందుబాటులోకి వచ్చింది. గతంలో దీన్ని రోహతంగ్ టన్నెల్ అని పిలిచేవారు. 2019 డిసెంబర్ 24న అటల్ టన్నెల్ గా పేరు మార్చారు. ఈ నిర్మాణం చేపట్టేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భౌగోళికంగా, వాతావరణ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది.మనాలి – లేహ్ ల మద్య మంచు కారణంగా ఏడాదిలో ఆరు నెలలు పాటు రాకపోకలు నిలిచిపోయేవి. ఇప్పుడు ఈ నిర్మాణంతో ఏడాది పొడవునా ప్రయాణాలు కొనసాగుతాయి.
ఈ సొరంగ మార్గం వల్ల లోహ్ నుంచి మనాలికి 455 కి.మీ నుంచి 46 కి.మీ వరకు దూరం తగ్గింది. సముద్ర మట్టానికి 10వేల అడుగులో నిర్మించారు. 3వేల కార్లు, 1500 ట్రక్కులు సొరంగ మార్గంలో ప్రయాణించగలవు. అగ్ని ప్రమాద రహిత సాంకేతికతతో నిర్మాణాన్ని చేపట్టారు. సొరంగంలో ప్రతి 150 మీటర్లకు ఒక టెలిఫోన్, 60 మీటర్లకు అగ్నిమాపక వ్యవస్థ, 500 మీటర్ల కు అత్యవసర మార్గం, 250 మీటర్లకు సీసీ కెమెరా, 2.2 కి.మీ కు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కి.మీ. కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉంటాయి. దేశ సరిహద్దుల్లో అత్యంత వ్యూహాత్మకమైన మార్గంగా అటల్ టన్నెల్ నిలవనుంది. పర్యాటకంగా కూడా ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పడుతుంది. వలసలు తగ్గి ఉపాధి కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈ టన్నెల్ ద్వారా వాణిజ్య, వ్యాపార రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి.