Home Telugu Articles రోబోల యుగంలో మార్పులేని మావోలు

రోబోల యుగంలో మార్పులేని మావోలు

0
SHARE

నక్సల్బరీ సాయుధ పోరాటం ప్రారంభమై ఐదు ద శాబ్దాలు పూర్తయిన సందర్భంగా మావోయిస్టులు తా జాగా అక్కడక్కడా కొంత హడావుడి చేసారు. వారి అనుబంధ సంస్థ ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) కొన్ని కార్యక్రమాల్ని నిర్వహించింది. అయితే, ఊహించిన స్థాయిలో వారి కార్యక్రమాలేవీ జరగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు కొన్ని పోస్టర్లు అతికించారు, ఒకటి రెండు బ్యానర్లు కట్టారు. తమకు మద్దతునివ్వాలని, సాయుధ పోరాటాన్ని బలపరచాలని ‘ఎర్ర’ గుడ్డపై ‘తెల్ల’ అక్షరాలతో వారు విజ్ఞప్తి చేసారు. ఇదే జిల్లాలో అంతకు రెండు రోజుల ముందు మావోల మద్దతుదారులిద్దరు- మందులు, పేలుడు సామగ్రిని ‘అన్న’లకు చేరవేస్తూ పోలీసులకు చిక్కారు. దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారని ఆ జిల్లా ఎస్పీ కమల్ లోచన్ ప్రకటించారు.

యాభై ఏళ్ల నక్సల్బరీ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు సువోజిత్ బాగ్లి ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం రాసారు. ఆ వ్యాసం చదివినా, రోజువారీ వార్తలు చదివినా- ఆ పోరాటం ఉనికిని కోల్పోయిందని స్పష్టంగా అర్థమవుతున్నది. నక్సలైట్ ఉద్యమంలో ప్రస్తుతం నాలుగవ తరం కనిపిస్తున్నా అది ఆశాజనకమైన రీతిలో లేదనే చెప్పాలి. ఈ అభిప్రాయానికి తా ర్కాణం- ఎక్కడయితే నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైందో ఇప్పుడు అక్కడ భూములు సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. అక్కడి చెరువుల్లో ప్రజలు చేపలు పడుతూ కనిపిస్తున్నారు. దుర్భరమైన పరిస్థితులేవీ అక్కడ కనిపించడం లేదు. ప్రజలు స్వేచ్ఛగా తమ శక్తి సామర్ధ్యాల మేరకు కష్టపడి జీవనం సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.

నక్సల్బరీ (పశ్చిమబెంగాల్) ప్రాంతంలోని బెంగాయ్‌జ్యోత్ అనే చిన్న పల్లెటూరిలోని పాఠశాలకు వెళ్లే దారిలో లెనిన్, స్టాలిన్, మావో, చారుముజుందార్ తదితర అంతర్జాతీయ, జాతీయ కమ్యూనిస్టు నాయకులు ‘బస్ట్’ సైజ్ విగ్రహాలను చాలా కాలం క్రితమే ఏర్పాటు చేసారు. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. వాటి సమీపంలోని గోడలపై వివేకానందుని సూక్తులు, బోధనలు ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇది ఏ రకమైన పరిణామమో ఇట్టే ఊహించవచ్చు. బస్తర్ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు ఉత్తర, దక్షిణ కమాండ్‌లుగా విభజించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర కమాండ్‌కు అధిపతిగా వరంగల్ జిల్లాకు చెందిన రవీందర్ నాయకత్వం వహించి అంకితభావంతో విప్లవం కోసం పని చేసారు. ఆదివాసీ మహిళ అదిమెను వివాహం చేసుకున్నారు. చాలా కాలం తరువాత అతను ప్రభుత్వానికి లొంగిపోయాడు. లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చే నగదు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం రవీందర్‌కి ఇచ్చింది. ఆయనిప్పుడు కొత్తగా ఇప్పగూడలో కట్టుకున్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ దంపతులకు రక్షిత అనే కూతురుంది. తన కుమార్తెను ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చేర్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్టు రవీందర్ చెప్పాడు. ఈ పరిణామం కూడా మావోల పరిస్థితికి అద్దం పడుతోంది.

నక్సల్బరీ ఉద్యమం ‘యాభై ఏళ్ల’ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నక్సల్బరీ ప్రాంతంలో పర్యటించి ఒక దళితవాడలో సహపంక్తి భోజనం చేసారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉద్యమం జోరుగా కొనసాగిన సమయంలో నాయకుడిగా పనిచేసిన శాంతి ముండా ఇప్పుడు వయసుపైబడి- ‘ఇంకా ఎన్నిమార్లు నక్సల్బరీ గురించి జర్నలిస్టులతో మాట్లాడాలి?’ అని విసుగును ప్రదర్శించారు. దీంతో నక్సల్బరీ ప్రాంతం ఇప్పుడెలా ఉందో ఇట్టే ఊహించవచ్చు. ఉద్యమం 50 ఏళ్లు మనగలిగింది. అయితే దాని ప్రారంభంలో ప్రకటించుకున్న ఏ ఒక్క అంశమూ నెరవేరలేదు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో రైతు కూలీలు, సాధారణ పౌరులకు భూములు దఖలు పడలేదు,సంపద వారి ముంగిట్లోకి రాలేదు. నక్సలైట్లు చెప్పినట్టు 1975 నాటికే విప్లవం విజయవంతమై దేశం వారి అధీనంలోకి వెళ్లలేదు. ఆ మాటకొస్తే నక్సల్బరీ స్ఫూర్తితో దేశంలో చోటు చేసుకున్న ఉద్యమాలు, పోరాటాల వల్ల అటు శ్రీకాకుళం జిల్లా, ఉత్తర తెలంగాణలో, బీహార్‌లో ఎక్కడా రైతు కూలీలకు, చిన్న రైతులకు పెద్దగా ప్రయోజనమేమీ జరగలేదు. ఉద్యమాలు, పోరాటాలు జరిగినచోట ప్రాణనష్టం, ఆస్తినష్టం ఊహించనంతగా జరిగింది. అంతేకాక ప్రజలు పోలీస్‌స్టేషన్‌లు, కోర్టులు, లాయర్ల చు ట్టూ తిరిగి దాచుకున్న సొమ్ము కాస్త ‘ఉద్యమార్పణం’ చేసారు. ఈ రకమైన దృశ్యాలు ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కళ్లకు కడతాయి. ఎందరో తమ సొంత గ్రామాలను వదిలి వలసపోయారు. ఆస్తులను అమ్ముకున్నారు. ఎవరూ ఊహించనంతగా మానసిక క్షోభకు గురయ్యారు. చేతికొచ్చిన కొడుకులను పోగొట్టుకుని నిస్సారంగా జీవిస్తున్నామని చెప్పే వృద్ధులు అనేకమంది కనిపిస్తారు. దశాబ్దాలపాటు గ్రామాలు అభివృద్ధికి నోచుకోక నిస్తేజంగా బతుకులు వెళ్లదీసారు. మానని గాయాలు ఇంకా వారిని బాధపెడుతునే ఉన్నాయి. ఇది కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాల పరిస్థితే కాదు. నక్సలైట్ ఉద్యమం ఎక్కడ కొనసాగినా ఇదే పరిస్థితి. తాజాగా చత్తీస్‌గఢ్‌లోను ఇదే పునరావృత్తమవుతోంది తప్ప గొప్ప విప్లవ ఫలితాలు అక్కడ ‘జి గేల్’మంటూ మెరవడం లేదు. తూర్పుకనుమల ప్రాంతంలో ఉద్యమం కాస్త వెనుకంజ వేస్తే పశ్చిమ కనుమలవైపు పోరాటం ప్రారంభించాలని చేసిన, చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. కేరళ, తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల కూడలి ప్రాంతం ‘ట్రై జంక్షన్’లో మరో స్థానం ఏర్పాటు కోసం మావోయిస్టులు వేసిన ఎత్తుగడకు పురిట్లోనే గండి పడింది. ఆ ఏర్పాట్లలో మునిగిన మావోయిస్టు అగ్రనాయకులు కొందరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. కొందరు అరెస్టు అయ్యారు. ఈ పరిణామం దేన్ని సూచిస్తోంది?. ఇది నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తిని తలపిస్తోందా? లేదు కాక లేదు. మార్క్సిజం తమకు ఆక్సిజన్ అని భావిస్తున్న నక్సలైట్లు, మావోయిస్టులు కాలమాన పరిస్థితులను పట్టించుకోకుండా ఉద్రేకపడుతున్నారు. పంతొమ్మిదవ శతాబ్దపుకాలమాన పరిస్థితుల్లో తొలి పారిశ్రామిక విప్లవ కాలంలో మార్క్స్ తన ఆలోచనలను కాగితంపై పెట్టారు. అప్పుడు ఆవిరి యంత్రాలు గొప్ప ఊపుమీదున్నాయి. మానవ చైతన్యం, జ్ఞానం, అవగాహన, ఆలోచనల తీరు వాటి చుట్టూ తిరిగిన సమయంలో కార్మిక శక్తి, శ్రమశక్తి గురించి ఆలోచనలు చేసి రూపొందించిన మార్క్సిజం 21వ శతాబ్దంలో, నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తున్న సందర్భంలో అంతే సాంద్రతతో అన్వయం అవుతుందనుకోవడం ఎంతటి అమాయకత్వం?

21వ శతాబ్దంలో రోబో శక్తి, కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటలీకరణ, నాలెడ్జి ఎకానమీ, డ్రైవర్లు లేని కార్లు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లతో ప్రపంచమంతా గుప్పిట్లో ఒదిగిపోతున్న తరుణంలో మార్క్సిజం ఎంతో తేజోవంతంగా సమాజ సమస్యల పరిష్కారానికి మార్గమని అనుకోవడం ఎంతటి అనాలోచితం? మావోయిస్టులు ఈ అనాలోచితాన్ని అమాయకత్వాన్ని దేశమంతా వ్యాపింప చేయాలని చూస్తున్నారు. అటునుంచి నరుక్కొచ్చి రాజ్యాధికారం చేపడతామంటున్నారు. అదెలా సాధ్యమని ఎవరైనా అడిగితే- 70 ఏళ్ల క్రితం చైనాలో మావో అనుసరించిన దీర్ఘకాల సాయుధ పోరాటం, వ్యవసాయక విప్లవం, ప్రజా సైన్యం ఏర్పరిచి చేసిన ‘లాంగ్ మార్చ్’ను గుర్తు చేసారు.

మావో కాలానికి, మర మనుషులతో బ్యాంకులు సేవలందిస్తున్న కాలానికి గల తేడాను గమనించకుండా ఇలా తమ అజ్ఞానాన్ని మావోలు ప్రదర్శిస్తే అది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఈ విషయాలను మావోయిస్టులు ఎలాగూ ఆలోచించరు. కాబట్టి మేధావులు, బుద్ధిజీవులు దీనిపై దృష్టిపెట్టి ఆలోచించి మావోలకు పాఠాలు నేర్పితే బాగుంటుందేమో!

-వుప్పల నరసింహం (సెల్: 99857 81799)

(ఆంధ్రభూమి సౌజన్యం తో)