రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
అఖిల భారతీయ ప్రతినిధి సభ, కర్ణావతి, గుజరాత్
యుగాబ్ది 5123, 11-13 మార్చ్, 2022
తీర్మానం: స్వావలంబీ/స్వయం సమృద్ధ భారత్ నిర్మాణానికి దేశంలో ఉపాధి అవకాశాలను పెంచాలి
భారత్ లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులను, విస్తారమైన మానవ శక్తిని, స్వాభావికమైన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని మన యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తే వ్యవసాయం, తయారీ మరియు సేవా రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధించటానికి, భారత ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. మన ప్రజల జీవన స్థితిగతులపైన, ఉపాధి అవకాశాలపైన కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సమాజంలోని కొన్ని వర్గాలు కొత్త అవకాశాలను దొరకబుచ్చుకుని విశేష ప్రయోజనాలు పొందిన సంగతి కూడా మనకు తెలుసు. ఉపాధి విషయంలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించటానికి, ఉద్యోగ అవకాశాల కల్పనలో యావత్ భారతీయ సమాజం క్రియాశీల పాత్ర పోషించాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) నొక్కి చెబుతోంది.
మానవ కేంద్రిత, శ్రమ ఆధారిత, పర్యావరణ అనుకూల, వికేంద్రీకృత, ఫలితాలను అందరికీ సమానంగా పంపిణీ చేసే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, సూక్ష్మ స్థాయి, చిన్న తరహా మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెంపొందించే భారతీయ ఆర్థిక నమూనాకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధి సభ అభిప్రాయపడింది. గ్రామీణ ఉపాధిని, అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని, మహిళలకు ఉపాధిని మరియు ఆర్థిక వ్యవస్థలో వారందరి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మన సామాజిక పరిస్థితులకు తగినట్లుగా కొత్త సాంకేతికతలను, చేతి వృత్తులను, నైపుణ్యాలను స్వీకరించే ప్రయత్నాలు అత్యంత ఆవశ్యకం.
పైన పేర్కొన్న మార్గాల ఆధారంగా దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ అనేక విజయవంతమైన ఉపాధి కల్పన నమూనాలు అందుబాటులో ఉండటం గమనార్హం. వారు స్థానిక ప్రత్యేకతలు, ప్రతిభ మరియు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అటువంటి అనేక ప్రదేశాలలో విలువ ఆధారిత ఉత్పత్తులు, సహకార రంగం, స్థానిక ఉత్పత్తుల ప్రత్యక్ష మార్కెటింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి మొదలైన రంగాలలో వాటి వ్యవస్థాపకులు, నిర్వాహకులు, వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాలు మరియు స్వచ్ఛంద సంస్థలు తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. దాంతో హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్, గృహ ఉత్పత్తులు మరియు కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తోంది. వారి అనుభవాలతో అవసరమైన చోట వాటి పునఃస్థాపనకు వేగంగా ప్రయత్నించాలి. కొన్ని విద్య మరియు పారిశ్రామిక సంస్థలు గణనీయమైన రీతిలో ఉపాధి కల్పనకు తోడ్పడ్డాయి. పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించిన అన్ని రకాల విజయగాథలను ప్రతినిధి సభ అభినందిస్తోంది. సమాజంలో ‘స్వదేశీ మరియు స్వావలంబన’ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నాలు, పై కార్యక్రమాలకు సరైన ప్రేరణనిస్తాయి.
అధిక ఉపాధి అవకాశాలను కలిగి ఉన్న మన ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడం అవసరం. ఇది దిగుమతులపై మనం ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రజలకు,ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారు వివిధ సంస్థలను, పరిశ్రమలను స్థాపించడాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించాలి. తద్వారా వారు ఉద్యోగాలను మాత్రమే కోరుకునే మనస్తత్వం నుండి బయటపడవచ్చు. మహిళలు, గ్రామీణ ప్రజలు మరియు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలలో కూడా ఇలాంటి వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యావేత్తలు, పరిశ్రమలు, కుల నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు మరియు ఇతర సంస్థలు ఈ దిశగా సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని కలిగి వుండాలి. అందుకోసం ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు మరియు ఇతర ప్రయత్నాలు వీటికి తోడుగా సాగడం అత్యంత అవసరం.
ప్రపంచ ఆర్థిక మరియు సాంకేతిక స్థితిగతులు వేగంగా మారుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి మనం వినూత్న మార్గాలను అన్వేషించాల్సిన అవసరమున్నదని ప్రతినిధి సభ అభిప్రాయపడుతోంది. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతి అవకాశాల ఆధారంగా ఉపాధి అవకాశాలు మరియు వ్యవస్థాపకత అవకాశాలను మనం తీవ్రంగా అన్వేషించాలి. ఉద్యోగంలో చేరటానికి ముందు, అనంతరం మానవశక్తి శిక్షణ, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ లు మరియు గ్రీన్ టెక్నాలజీ వెంచర్‌లకు ప్రేరణ మొదలైన వాటిలో మనం నిమగ్నమవ్వాలి.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్థిరమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధించడానికి, ఉపాధి కల్పనకు భారత కేంద్రీకృత నమూనాలపై పని చేయాలని ప్రతినిధి సభ ప్రజలకు పిలుపునిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ తన సముచిత స్థానాన్ని తిరిగి పొందేలా వివిధ రకాల ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే మొత్తం ప్రయత్నాన్ని ప్రోత్సహించేలా శాశ్వతమైన మన భారతీయ విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన పని సంస్కృతిని నెలకొల్పాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ సమాజంలోని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తోంది.