రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జరిగే సమన్వయ సమావేశాలు 2022 జనవరి 5న భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ. దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశాలలో మొత్తం 36 సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు పాల్గొన్నారు. ఈ సంస్థలు విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. ఇలాంటి సంస్థలలో పనిచేసే స్వయంసేవకులతో సంఘం సమన్వయాన్ని కొనసాగిస్తుంది.
వర్తమాన పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అనే విషయాలను అన్ని సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశాల్లో వివరిస్తారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరూ 2 డోసులు టీకా తీసుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత వంటి అంశాల్లో సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.
సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దానిపై చర్చతో పాటు.. క్రిందటి సంవత్సరం సమావేశంలో ఉపాధి కల్పన పై చర్చ, సమీక్ష జరుగుతుంది. అలాగే కోవిడ్ సమయంలో సేవా భారతి తో సహా వివిధ సంస్థలు చేసిన సేవా కార్యక్రమాలపై, విద్య రంగంలో జరుగుతున్న కార్యక్రమాలపై, ఏబీవీపీ, శిక్షణ మండలి వారు చేపట్టిన కార్యక్రమాలు, నూతన విద్య ప్రణాళిక పై ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుంది.
జనవరి 7న జరిగే పత్రిక సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ సహా సర్ కార్యవాహ్ డా. మన్మోహన్ వైద్య వివరాలు వెల్లడిస్తారని అఖిల భారత ప్రచార ప్రముక్ శ్రీ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.