‘నూతన రాజ్యాంగం’ పేరిట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంపై దుష్ప్రచారం చేసే కుట్రతో వదంతులు వ్యాప్తి చేస్తున్నవారిపై ఫిర్యాదు దాఖలైంది.
గత కొంతకాలంగా ‘నయా భారతీయ సంవిధాన్’ పేరిట ఒక పిడిఎఫ్ పుస్తిక(బుక్లెట్) కాపీని కొందరు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయసాగారు. అభ్యంతరక, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు ప్రేరేపించే అంశాలతో కూడివున్న 16 పేజీల బుక్లెట్ కవర్ పేజీపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ఫోటో ముద్రించారు. ఈమేరకు మహానగర సంఘచాలక్ శ్రీ అరవింద్ కుక్డే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ కుక్డేతో పాటు ఆరెస్సెస్ విదర్భ ప్రాంత సంఘచాలక్ శ్రీ రామ్ హర్కరే, నాగపూర్ మహానగర సంఘచాలకే శ్రీ రాజేష్ లోయా, సహసంఘచాలక్ శ్రీ శ్రీధర్ గడ్గే, సహకార్యవాహ శ్రీ రవీంద్ర బోకారే తదితరులు ఉన్నారు.
అభ్యంతరకర అంశాలు కలిగిన బుక్లెట్ మీద శ్రీ మోహన్ జీ భాగవత్ ఫోటో ముద్రించి ఇంటర్నెట్ ద్వారా వ్యాప్తి చేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని శ్రీ కుక్డే ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాగపూర్ తో పాటు దేశంలోని లక్నో, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కూడా ఫిర్యాదులు దాఖలయ్యాయి.
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘానికి భారత రాజ్యాంగం పట్ల ఎంతో విశ్వాసం, గౌరవం ఉన్నాయని, నూతన రాజ్యాంగం విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని శ్రీ గడ్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కులపరమైన, సామాజిక అసమానతలను ఆరెస్సెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని.. సామాజిక సమరసత కోసం పోరాడుతుందని తెలియజేసారు.
సంఘంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124, 153-ఎ, 153-బి, 295-ఎ, 505,తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజి చట్టంలోని సెక్షన్ 66-ఎఫ్, 67 మరియు సెక్షన్ 2కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదులో కోరారు.