“ఒక సంస్థను రిజిస్టర్ చేసుకునేందుకు దాఖలు చేసుకున్న దరఖాస్తును సంబంధిత చట్టంలోని సెక్షన్ 3 ఏ క్రింద తిరస్కరించే పూర్తీ అధికారం రిజిస్త్రార్ కు ఉంటుంది’’ అని ముంబై హైకోర్ట్ స్పష్టం చేసింది. `రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్’ పేరున ఒక చారిటబుల్ సంస్థను రిజిస్టర్ చేయాలంటూ వచ్చిన దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించడంపై కోర్ట్ ఈ విధంగా వ్యాఖ్యానించింది. జనార్దన్ మూన్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఈ దరఖాస్తులో `రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్’ పేరునే తమ సంస్థకు కూడా కేటాయించాలని పేర్కొన్నారు. దీనిని తిరస్కరించిన రిజిస్ట్రార్, సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ ౩ఎ ప్రకారం ఇందుకు ప్రభుత్వ అనుమతి అవసరమవుతుందని స్పష్టం చేశారు. అలాగే `రాష్ట్రీయ’ అనే పదం సంస్థకు భారత లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సహాయసహకారాలను సూచిస్తుందని, కనుక అలాంటి పదాన్ని కూడా అనుమతించలేమని రిజిస్ట్రార్ తెలిపారు. ఈ విషయమై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ముంబై హైకోర్ట్ ఇద్దరు సభ్యుల బెంచ్ ఒక సంస్థకు ఒక పేరును అనుమతించడం, నిరాకరించడం పూర్తిగా రిజిస్ట్రార్ అధికార పరిధిలోని విషయమేనని స్పష్టం చేసింది. సెక్షన్ ౩ఎ కింద ఒక పేరును తిరస్కరించడానికి మూడు కారణాలు ఉంటాయి. అవి 1. అదే పేరుతొ అంతకు ముందే మరో సంస్థ ఉంటె, రెండు సంస్థల పేర్ల వాళ్ళ ప్రజలుగాని, సంస్థల సభ్యులుగాని గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉండడం. 2. ఆ పేరు ప్రభుత్వంతో సంబంధం కలిగినది, లేదా సహాయసకారాలు కలిగినదనే పొరపాటు అభిప్రాయం కలిగించే విధంగా ఉండడం. 3. ఆ పేరు పూర్తిగా వాంఛనీయం కానప్పుడు. దరఖాస్తులో పేర్కొన్న పేరు ఇప్పటికే మరో సంస్థకు ఉండడం వాళ్ళ ఆ దరఖాస్తును రిజిస్ట్రార్ తిరస్కరించారని బెంచ్ పేర్కొంది.
Source: LiveLaw