హర్యానాలో రాష్ట్రం పానిపట్ జిల్లాలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే మాట్లాడారు. ముందుగా ప్రముఖ పాత్రికేయుడు డాక్టర్ వేద్ ప్రతాప్ వైదిక్‌కు సంతాపం తెలియజేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ కోసం వార్షిక నివేదికతో పాటు ప్రతినిధుల సభ సమావేశంలో ముఖ్యమైన తీర్మానాన్ని ఆమోదించినట్లు శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. భారతదేశ అమృతకాలంలో అభివృద్ధి వైపు పయనించే సమయంలో, సంఘం శతాబ్ది సంవత్సరంలో సమాజానికి దిశానిర్దేశం చేసేందుకు ఈ తీర్మానం దోహదపడుతుందని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వ మార్గంలో సాహసోపేతమైన అడుగులు వేస్తున్న తరుణంలో భారత్ పురోగతిని అడ్డుకోవాలని కుట్రలు చేసే వారిని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, మొత్తం సమాజ పునరుజ్జీవన మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను తొలగించడానికి కృషి చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అమృత కాలంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దేశం గురించిన కథనం మారాలని, భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు భారతదేశం నుండి మాత్రమే వెలువడాలని ఆయన అన్నారు. వక్రీకరించిన చరిత్రను సరైన చరిత్రతో భర్తీ చేయాలి, అప్పుడే దేశప్రజలు తమ వారసత్వంపై గర్వపడతారని అన్నారు. కళలు, సాహిత్యం, సమకాలీనతను ప్రతిబింబించే సృజనాత్మకత పెంపొదించాలని ఆయన సూచించారు.
2025 విజయదశమి నుంచి సంఘ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, ఈ ప్రతినిధుల సభలో కార్య విస్తరణ, నాణ్యత పెంచేందుకు ప్రణాళిక మాత్రమే రూపొందించడం జరిగిందని సర్ కార్యవాహ తెలిపారు. శాఖ ద్వారా స్వయంసేవకులు గ్రామాలు, నివాసాల సామాజిక వాస్తవాలను అధ్యయనం చేస్తారని, స్థానిక సంఘాలను కలుపుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఇటువంటి ప్రయోగాలు,ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని ప్రతినిధి సభలలో చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు.
రాబోయే కాలంలో ఆర్.ఎస్.ఎస్ సామాజిక పరివర్తన అంశాలపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవి సామాజిక సమరసత, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ (భారతీయ) ప్రవర్తన, పౌర విధి. సమాజంలో వివక్షను గట్టిగా వ్యతిరేకిస్తూ, సమరసత కోసం నిరంతరం కృషి చేయడం ఈ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు. అంటరానితనం సమాజానికి అవమానకరమని, దానిని నిర్మూలించేందుకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతపు జనాభా అసమతుల్యత గురించి RSS ఆందోళన చెందుతోంది, ఈ సమస్య సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావనకు వచ్చిందను, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ కూడా దీని గురించి మాట్లాడారని జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ సర్ కార్యవాహ చెప్పారు.
RSSపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన చేసిన ప్రకటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. సర్ కార్యవాహ జీ స్పందిస్తూ .. రాహుల్ గాంధీ లాంటి పార్లమెంటేరియన్ మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు క్షమాపణలు కూడా చెప్పనివారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. భారత్ హిందూ దేశం అనే సంఘ ఆలోచన సాంస్కృతికమైన ఆలోచన అని, దీనిని భౌగోళిక రాజకీయ సరిహద్దుల ప్రకారం చూడకూడదని, సాంస్కృతికంగా చూసినపుడు భారత్ ఎప్పుడూ హిందూ దేశమేనని హోసబాలే మరోసారి స్పష్టం చేశారు.
స్వలింగ వివాహం గురించిన ప్రశ్నపై, వివాహం అనేది స్త్రీ, పురుషుల మధ్య జరిగే పవిత్రమైన ఆచారమని సంఘం దృఢంగా విశ్వసిస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే వివాహం ఉద్దేశ్యం సామాజిక ప్రయోజనం కానీ, వ్యక్తిగత శారీరక ఆనందం కాదు అని తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది, వ్యూహాత్మక, దౌత్య రంగాలలో దాని ప్రభావం పెరుగుతోంది. ఈ తరుణంలో సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ను అభివృద్ధి మార్గంలో ముందుకు సాగకుండా భారత్‌ను ఆపాలని భారత్‌లో, విదేశాలలో అనేక శక్తులు కుట్రలు చేస్తున్నాయని, అటువంటి వారికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా, ‘స్వ’ (స్వయం, స్వావలంబన) స్ఫూర్తితో రాష్ట్ర పునరుజ్జీవనం కోసం సంకల్పిద్దామని ఆయన అన్నారు.
తీర్మానంతో పాటు, మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన 350వ సంవత్సరం, మహావీర్ స్వామి నిర్వాణం 2550వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక్కొక్కటిగా మూడు ముఖ్యమైన ప్రకటనలు కూడా ఆయన చేశారు.
మూడు రోజుల పాటు జరిగిన ఏబీపీఎస్ సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు పలు చర్చలు చేశారు. శాఖల సంఖ్య 62,000 నుంచి 68,000కు పెరిగినట్లు తొలిరోజు సమావేశంలో వార్షిక నివేదిక సమర్పించారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య లక్షకు పెంచాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. శాఖలలో ప్రతి మూడు నెలలకోసారి పరివార్ మిలన్ (కుటుంబ సమ్మేళనం) నిర్వహించాలని కూడా నిర్ణయించారు. విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ, నరేంద్ర ఠాకూర్ జీ, అలోక్ కుమార్ జీ కూడా పాల్గొన్నారు.
ABPS తీర్మానాలు – ‘స్వ’ (స్వయం, స్వావలంబన) ఆధారంగా రాష్ట్ర పునరుజ్జీవనం కోసం సంకల్పిద్దాం