ఇటీవల శబరిమల విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అమెరికాలోని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. శబరిమల పవిత్రత కోసం అయ్యప్ప భక్తులు సాగిస్తున్న అహింసాయుత నిరసనలకు మద్దతుగా న్యూయార్క్ మరియు న్యూజెర్సీకి చెందిన వందలాది హిందువులు న్యూయార్క్ సిటీలోని భారత కాన్సులేట్ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రదర్శనలో భాగంగా అయ్యప్ప భజనలతో టైమ్స్ స్క్వేర్ ప్రాంతం మార్మోగిపోయింది. ఇదే సందర్భంగా శబరిమల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై కూడా ప్రదర్శనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనుక భారతదేశాన్ని విభజించాలని చూస్తున్న క్రైస్తవ మిషనరీల కుట్ర ఉందని వారు ఆరోపించారు. శబరిమల దేవస్థానం విషయంలో సుప్రీం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని, ధార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యాన్ని నివారించాలని నిరసనల్లో పాల్గొన్న వందలాది మహిళలు పేర్కొన్నారు.
రోజుకి 5 సార్లు మైకుల్లో అజాన్ వినిపించడంలో విషయంలో సుప్రీం తీర్పుని అమలు చేయని ప్రభుత్వం శబరిమల కేసులో మాత్రం అత్యవసరంగా పోలీసులను పెట్టి మరీ తీర్పుని అమలుచేయాల్సిన అవసరం ఏముందని వారు నిలదీశారు. సాంప్రదాయాలను కాపాడమంటూ వేడుకుంటున్న భక్తులపై లాఠీచార్జి చేయడమేంటి అని ప్రశ్నించారు.
శబరిమల దేవస్థానం ఆస్తులతో పాటు దేవస్థానం చుట్టుప్రక్కల ఉన్న సహజ సంపదలు దోచుకునేందుకు కమ్యూనిస్ట్ – క్రైస్తవ మిషనరీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ప్రదర్శనలో పాల్గొన హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. ఇందుకోసం వారు శబరిమలకు ఒక మ్యూజియం లాగా మార్చివేసే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
శబరిమల వెనుక క్రైస్తవ మిషనరీల కుట్ర ఇప్పటిది కాదు. 1950 సంవత్సరంలోనే వీరి కన్ను ఆలయం మీద పడింది. ఆలయంపై దాడి చేసి పాక్షికంగా ధ్వంసం చేయడంతో పాటు ఒక శిలువను అక్కడ ఏర్పాటు చేసి దానికి లేని చారిత్రక ప్రాముఖ్యత ఆపాదించాలని ప్రయత్నం చేశారు. సంవత్సరానికి 50 మిలియన్ పైగా భక్తులు దర్శించుకుంటున్న శబరిమల క్రైస్తవ మిషనరీల ప్రముఖ లక్ష్యంగా ఉంటూ వస్తోంది.
Source: Organiser