Home Hyderabad Mukti Sangram రజాకార్ల ఎదురు కాల్పులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-32)

రజాకార్ల ఎదురు కాల్పులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-32)

0
SHARE

గ్రామం బయటికి రాగానే చెరువుగట్టు వెనుకనుండి కాల్పులు ఎదరైనాయి. రజాకార్లు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు 500 రౌండ్లు కాల్చి కూడా ఒక కమ్యూనిస్టునైనా చంపలేకపోయారు. చివరికి పోలీసులు, రజాకార్లు కమ్యూనిస్టుల ధాటికి తట్టుకోలేక ఎంకిర్యాల గ్రామంలో తలదాచుకున్నారు.

మరొకసారి తయ్యబ్ రజ్వీ దళం కమ్యూనిస్టులను పట్టుకోవాలనే యత్నంలో కొండమడుగు గ్రామంపై పడింది. గ్రామస్థులందరినీ వరుసగా పడుకోబెట్టి తీవ్రంగా కొట్టారు. రజాకార్లకు ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టుగా కనపడసాగారు. మరికొంతకాలం గడచిన తర్వాత తయ్యబ్ రజ్వీకి కమ్యూనిస్టులు ఉన్న స్థలం ఆచూకీ తెలిసింది. ఒక పెద్ద లారీలో సాయుధులైన పోలీసులను, రజాకార్లను తీసుకొని దాడికి బయలుదేరాడు. వెంట విడిగా ఒక జీపులో అధికారులు కూర్చున్నారు.

బీబీనగర్ క్యాంపు నుండి బయలుదేరిన ఈ దళంలో ముస్లిం శరణార్థులు కూడా ఉన్నారు. సంస్థానంలో హిందువుల సంఖ్యతో సరిసమానంగా ముస్లింల సంఖ్య పెంచాలనే ఉద్దేశ్యంతో నిజాం రాష్ట్రం వెలుపలి నుండి అనేకమంది ముస్లింలను రప్పించాడు. వాళ్ళు ఇస్లాం రక్షణ అనే దీక్షతో రజాకార్లతోపాటు అత్యాచారాల్లో పాల్గొన్నారు. ఈ సారి తయ్యబ్ రజ్వీ తమతోబాటు పటేల్ లక్ష్మీకాంతరెడ్డిని కూడా వెంట తీసుకొని వెళ్ళి దారిలో అతనిని చంపివేయాలని అనుకున్నాడు. ఈ విషయం ఎలాగో తెలుసుకొని లక్ష్మీకాంతరెడ్డి తప్పించుకొని పారిపోయాడు.

తయ్యబ్ దళం బ్రాహ్మణపల్లి గ్రామం చేరుతుండగా దారిలో ముగ్గురు కమ్యూనిస్టులతో ఘర్షణ జరిగింది. కానీ ఆ కమ్యూనిస్టులు చేతికి చిక్కకుండా పారిపోయారు. రజాకార్ల దళం బ్రాహ్మణపల్లిలోకి ప్రవేశించింది. కమ్యూనిస్టులు ఎక్కడా కనబడలేదు. కాని తమకు ఇంతకాలం నుండి చేతికి చిక్కని రామచంద్రారెడ్డి ఇల్లు మాత్రం కనబడింది. ఆ పటేల్ తన ప్రాణ రక్షణకోసం సర్వస్వం వదిలి ఎక్కడో తలదాచుకొంటున్నాడు.

ఆ కోపం వల్ల తయ్యబ్ రజ్వీ దళం పటేల్ ఇంటిని తగులబెట్టి భస్మం చేశారు. తిరిగి వస్తుండగా అనుకోకుండా చెదురుమదురుగా కొందరు కమ్యూనిష్టులు దొరికారు. దాదాపు తొమ్మిదిమంది కమ్యూనిస్టులను కాల్చి శవాలను అక్కడే వదిలివేసి తయ్యబ్‌దళం బీబీనగర్ చేరుకుంది. తాము కమ్యూనిస్టులను వేధించే చర్యలలో విజయవంతమైనామని, చాలా మందిని రూపుమాపి ఆ ప్రాంతాలలో వాళ్ళ బెడదలేకుండా చేశామని మహా ఘనంగా ప్రకటించుకున్నాడు. ఈ వర్తమానాన్ని పంపి కావలసినంత ప్రచారం చేయించుకున్నాడు.

మరుసటి రోజు సబ్ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ఖాన్, నాయబ్ నాజర్, (డి.ఐ.జి) మజీదుల్లా అసలు పరిస్థితిని అంచనా వేయడానికి బ్రాహ్మణపల్లికి వచ్చారు. కమ్యూనిస్టుల శవాలను చూడాలనుకుంటే అప్పటికే గ్రామస్థులంతా ఆ శవాలను పూడ్చి పెట్టేశారు. తిరిగి శవాలను బయటకి తీయించి పరీక్షించారు. ఆ చంపబడిన వాళ్ళంతా కమ్యూనిస్టులు కానేకాదు. తయ్యబ్ రజ్వీ క్యాంపులో వెట్టిచాకిరీ చేసే చాకలి, మంగలి, హరిజనులైన అమాయక ప్రజలు తప్ప మరొకరు కాదు. ఎవరూ దొరకకపోతే తమకు సేవచేసే ఆ అమాయకులనే కాల్చిపడేసి తమ విజయోల్లాసాన్ని ప్రకటించుకున్నాడు. ఈ వాస్తవ విషయాన్ని డి.ఐ.జి మజీదుల్లా కళ్ళారా చూసి బీబీనగర్‌లో ఉన్న పోలీసు బలగాన్ని ట్రాన్స్‌ఫర్ చేయించాడు. కాని తయ్యబ్ రజ్వీని ఏమీ చేయలేకపోయాడు.

Source: Vijaya Kranti