శబరిమలలో ప్రవేశించకుండా ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అడ్డుకోరాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
శబరిమలలోకి ప్రవేశించకుండా మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్నారంటూ జనం టీవీ ఎడిటర్ జికె సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ ఛానెల్ ప్రతినిధులను కేరళ ప్రభుత్వం బలవంతంగా శబరిమల నుండి బయటకి పంపిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. దీనికి సమాధానంగా ప్రభుత్వం మీడియాపై ఎటువంటి ఆంక్షలు లేవని వివరణ ఇవ్వగా ఒకవేళ నిజంగా పారదర్శకత పాటిస్తున్నట్లయితె ఈ పిటిషన్ ద్వారా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందని సూటిగా ప్రశ్నించింది.
శబరిమల అత్యంత భద్రత కలిగిన ప్రాంతం అని, కొన్ని అనుకోని పరిస్థితుల్లో జర్నలిస్టుల భద్రత దృష్ట్యా వారిని కాపాడే ఉద్దేశంతో బలవంతంగా బయటకి పంపించే ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని ప్రభుత్వం కోర్టుకి వివరణ ఇచ్చింది. దీనికి స్పందనగా కోర్టు “15000 మంది పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ ఆమాత్రం భద్రత ఇవ్వలేరా” అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుండి సరియైన సమాధానం లేకపోవడంతో ‘మీడియాను శబరిమలలో నియంత్రంచం” అంటూ అఫిడవిట్ సమర్పించాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Source: VSK Bharat