Home News హైద్రాబాదులో “శబరిమల పవిత్రత సంరక్షించుకుందాం – భారతీయత పరిరక్షించుకుందాం” పేరిట అవగాహనా కార్యక్రమం

హైద్రాబాదులో “శబరిమల పవిత్రత సంరక్షించుకుందాం – భారతీయత పరిరక్షించుకుందాం” పేరిట అవగాహనా కార్యక్రమం

0
SHARE

శబరిమల పవిత్రత కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో “శబరిమల పవిత్రత సంరక్షించుకుందాం – భారతీయత పరిరక్షించుకుందాం” పేరిట అవగాహనా కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాల పటేల్ ఆడిటోరియంలో జరిగింది.

కార్యక్రమంలో మొదటగా ప్రసంగించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అనంతలక్ష్మి మాట్లాడుతూ అత్యధిక సంఖ్యాక వర్గాల ప్రజలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. నమ్మే దైవాన్ని రక్షించలేనప్పుడు ఆ రాజ్యాంగం యొక్క తయారీలో లోపముందా లేక అమలులో లోపముందా అనేది న్యాయనిపుణులు ఆలోచించి సమాధానమివ్వాలని అన్నారు. దైవం మీద విశ్వాసం లేనివారి మూర్ఖపు పనుల కారణంగానే శబరిమలలో నేడు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పరిణామాల వెనుక రాజకీయ నేపధ్యం ఉందని చెప్పారు.
విజయవాడ భువనేశ్వరీ పీఠాధిపతులు పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామిజి అనుగ్రహభాషణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలను, ఇక్కడి జాతులను నేరమైనవిగా చిత్రీకరించే నెపంతో భ్రిటిష్ వారు అనేక చట్టాలను తయారుచేశారని గుర్తుచేశారు. హిందువులందరూ సంస్థలకు, సంఘాలకు అతీతంగా తమ గ్రామాల్లోని దేవాలయ కమిటీలలో భాగస్వామ్యం అయ్యి, వాటిని బలోపేతం చేయాలన్నారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ఏవిధంగా ఇతర మతస్థులు కాపీ చేస్తున్నారనే విషయాలను స్వామీజీ సోదాహరణంగా వివరించారు. మనం మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న అరుదైన వనరులను, జాతులను విస్మరిస్తున్నామని, వీటిని ఇతర మతస్థులు చేరదీసి మనకు వ్యతిరేకంగా తయారుచేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో స్వామీజీ శబరిమల పరిరక్షణ సమితి తెలంగాణ కమిటీని ప్రకటించారు.
దేవాలయాలు హిందూ ధర్మానికి వెన్నెముక అని, వాటిని నాశనం చేసేందుకు అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని, దానికి నిదర్శనమే శబరిమల పరిణామాలు అని కార్యక్రమ ప్రధాన వక్త, ఆలిండియా శబరిమల యాక్షన్ కౌన్సిల్ శ్రీ ఏ ఆర్ మోహన్ తెలిపారు. ఈ పనికోసం విచ్చిన్న శక్తులు అహోరాత్రులు కష్టించి పనిచేస్తున్నాయన్నారు. నిజంగా భక్తి ఉన్న మహిళలు కొన్ని నిర్ధేశిత సమయాల్లో దేవాలయ ప్రవేశం చేయరని అన్నారు.
శబరిమల అంటే ఏమిటి, అయ్యప్ప ఎవరు వంటి విషయాలపై కనీస పరిజ్ఞానం కూడా లేనివారు కోర్టులో లాయర్లుగా ఈ కేసుని వాదించారని విమర్శించారు.
శబరిమల దేవస్థానం దేశంలోనే విశిష్టమైన ఆలయమని, ఇది వాస్తు, ఆగమ శాస్త్ర నియమానుసారం కాకుండా స్వయంగా అయ్యప్ప ఆదేశానుసారం నిర్మితమైనది వారు తెలిపారు.
నిర్దిష్ట వయసు గల మహిళల శబరిమల దేవాలయ ప్రవేశంపై పరిమితులను సుప్రీంకోర్టు వివక్షగా అభివర్ణిస్తోందని.. కానీ ‘దేవుడు’తో పాటు ‘దేవత’ కూడా ఉన్నది కేవలం హిందుత్వంలోనేనని, ఇతర మాటల్లో కేవలం ‘దేవుడు’ మాత్రమే ఉంటాడని వారు సోదాహరణంగా వివరించారు.
కార్యక్రమంలో మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయక హక్కుకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు విషయంలో ప్రజలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కేసులో కోర్టుని ఆశ్రయించిన వ్యక్తులకు శబరిమల సంప్రదాయాల పట్ల గౌరవం కానీ అయ్యప్ప మీద భక్తి కానీ లేవన్నారు.
కార్యక్రమంలో శ్రీ జయరాం గురూజీ, జస్టిస్ శ్రీ సీవీ రాములు, శ్రీ శశిధర్, శ్రీ బీ దక్షిణామూర్తి, హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.